రైతుల విషయంలో రాజకీయాలు చేస్తే సహించం : బీర్ల ఐలయ్య

రైతుల విషయంలో రాజకీయాలు చేస్తే సహించం : బీర్ల ఐలయ్య
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : దేశానికి అన్నం పెట్టే రైతుల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని చూస్తే సహించబోమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రాంరెడ్డితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంటే ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదన్నారు.

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు అమాయక రైతులను రెచ్చగొట్టి.. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లలో చేతగాని రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.  ఆలేరు నియోజకవర్గ ప్రజల సాగునీటి కష్టాలను తీర్చడం కోసం రూ.600 కోట్లతో 'గంధమల్ల రిజర్వాయర్' ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. రిజర్వాయర్ కు సంబంధించిన పనులు నెలలోపే షురూ కానున్నాయని పేర్కొన్నారు. గంధమల్ల రిజర్వాయర్ ఏర్పాటు చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. 

తుంగతుర్తి : రైతుల పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తిరుమలగిరి, నాగారం మండలాల్లోని పలు గ్రామాల్లో రైతు సేవా సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. 

సూర్యాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ గుప్తా సూచించారు. సూర్యాపేట మండలం ఇమాంపేట వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మరోవైపు సూర్యాపేట పట్టణంలోని రాయినిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.