అసెంబ్లీలో యాదాద్రి లడ్డూలు పంచిన బీర్ల ఐలయ్య

అసెంబ్లీలో యాదాద్రి లడ్డూలు పంచిన బీర్ల ఐలయ్య
  • రుణమాఫీకి కృతజ్ఞతగా పంచినట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బుధవారం అసెంబ్లీకి వచ్చిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు యాదాద్రి లడ్డూలను పంచారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులకు రుణమాఫీ అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఆయన ప్రసాదం పంచిపెట్టారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, పోలీసు అధికారులకు, అసెంబ్లీకి వచ్చిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు, జర్నలిస్టులకు లడ్డూ ప్రసాదం అందజేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుకు లక్ష్మీనర్సింహ స్వామి ఆశీస్సులతో లడ్డూలు పంచానని చెప్పారు. అందరికీ స్వామివారి ఆశీస్సులు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీర్ల ఐలయ్యతో పాటు కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ పాల్గొన్నారు.