ఒకవైపు గంధమల్ల నుంచి..మరోవైపు నవాబుపేట నుంచి జలాలు
యాదాద్రి, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. గంధమల్ల చెరువులో చేరిన గోదావరి జలాలు ఒక పక్క, నవాబుపేట రిజర్వాయర్నుంచి విడుదలైన గోదావరి మరోపక్క నియోజకవర్గంలో ప్రహిస్తున్నాయి. దీంతో వానలు కురువక కరువుతో అల్లాడుతున్న ఆలేరు నియోజవర్గానికి వరంగా మారాయి.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను ఇటీవల విడుదల చేశారు. మల్లన్నసాగర్కు 20 కిలో మీటర్లకు దూరంగా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువులోకి జలాలు చేరడంతో నిండి, అలుగు పోస్తోంది. దీంతో నియోజకవర్గంలోని తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు మండలాలకు వాగు ద్వారా నీరు చేరింది.
ఇదేవిధంగా నీరు పారుతూ ఉంటే ఇక్కడి నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు (యాదాద్రి జిల్లా)లోని బిక్కేరు వాగులోకి గోదావరి జలాలు చేరుతాయి. కాగా, దేవాదుల ద్వారా జనగామ జిల్లాలోని నవాబుపేట రిజర్వాయర్లోకి చేరుకున్న గోదావరి జలాలను ఇటీవల విడుదల చేశారు. ఈ నీళ్లు ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండలం కొమ్మాయిపల్లి అక్కడి నుంచి వివిధ గ్రామాలకు చేరుతున్నాయి. ఆలేరు నియోకవర్గానికి రెండు వైపుల నుంచి గోదావరి జలాలు వస్తుండడంతో యాసంగి సీజన్లో పంటల సాగుకు ఇబ్బంది ఉండదని రైతులు భావిస్తున్నారు.
వంద చెరువులు నింపుతాం- : ప్రభుత్వ విప్
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గోదావరి జలాలతో నియోజకవర్గంలోని వంద చెరువులు నింపుతామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఆలేరు పట్టణానికి చేరుకున్న గోదావరి జలాలకు ఆయన హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గత ఎమ్మెల్యేలు ఆలేరును పూర్తిగా విస్మరించారన్నారు. కరువు నెలకొన్ని సమయంలో చుక్క నీరు అందించలేదకపోయారని విమర్శించారు.
నియోజకవర్గంలోఈసారి వర్షాలు ఆశాజనకంగా కురువక పోయినా.. గోదావరి జలాలను రప్పించామని తెలిపారు. త్వరలోనే గంధమల్ల రిజర్వాయర్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆలేరుకు గోదావరి జలాలు వచ్చేలా చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.