కామారెడ్డి, వెలుగు: రామారెడ్డి మండలం రెడ్డిపేటలో రూ.2.06 కోట్లతో చేపట్టనున్న పలు డెవలప్‌మెంట్ పనులను గురువారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. మన ఊరు మన బడిలో మంజూరైన స్కూల్ అడిషనల్ రూమ్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఫండ్స్ శాంక్షన్ చేసిందన్నారు. ఎంపీపీ దశరథ్‌రెడ్డి, మాచారెడ్డి జడ్పీటీసీ మినుకూరి రాం రెడ్డి, ప్రతినిధులు సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రొఫెసర్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క
ఎర్గట్ల, వెలుగు: ఓయూ ప్రొఫెసర్, నిజాం కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ నాయుడు అశోక్ తల్లి సాయమ్మ ఇటీవల మరణించడంతో అంత్యక్రియలు వారి స్వగ్రామం ఎర్గట్ల మండలం తొర్తిలో జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం తొర్తి గ్రామానికి వచ్చి అశోక్‌ను పరామర్శించారు. ఆమె వెంట సర్పంచ్, ఉప సర్పంచ్
తదితరులు ఉన్నారు.
‘మన ఊరు–మన బడి’ పనులు పూర్తి చేయాలి
కామారెడ్డి, వెలుగు: మన ఊరు మన బడి ప్రోగ్రామ్‌లో చేపట్టిన పనులు త్వరగా కంప్లీట్ చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. పనుల పురోగతిపై గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మండలానికి 2 స్కూళ్లలో పనులు చేస్తున్నామన్నారు. 6 పనులు కంప్లీట్అయ్యాయని కలెక్టర్ వివరించారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్దొత్రే, ట్రైనీ కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీఈవో రాజు పాల్గొన్నారు.
జుక్కల్‌ను డివిజన్ చేయాలి
పిట్లం, వెలుగు: జుక్కల్ మండలాన్ని డివిజన్ కేంద్రంగా బాన్సువాడను జిల్లా చేయాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జుక్కల్‌లో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గం డివిజన్‌గా ఉందని, జుక్కల్‌ను మాత్రం పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. జుక్కల్‌ను డివిజన్ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి జుక్కల్‌ను డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
హక్కులపై అవగాహన ఉండాలి
బోధన్, వెలుగు: మానవ హక్కులను ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధం కాలంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో మనిషి జీవించే హక్కు ఉల్లంఘన జరగకుండా ఐక్య రాజ్యసమితి స్వారజనీన మానవ హక్కుల ప్రకటన జారీ చేసిందన్నారు. ఈ ప్రకటనలో 31 అధికరణలు ఉన్నయన్నారు. పాలకులు చట్టాలను మారుస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను నోక్కెస్తున్నారన్నారు. హక్కువ వేదిక జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం గంగులు, పిట్ల సరిత, సహాయ కార్యదర్శులు మహ్మద్ అహ్మద్, అరుణ్‌కుమార్, డీగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ రంగరత్నం, న్యాయవాదులు హన్మంతురావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇష్టానుసారంగా ‘డబుల్’ అప్లికేషన్లు
నిజామాబాద్ (ఆర్మూర్), వెలుగు: ఏ పద్ధతి ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు అందిస్తారో, అర్హులను ఏ విధంగా గుర్తిస్తారో చెప్పకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్లికేషన్లు తీసుకుంటోందని ఆర్మూర్ బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ నూతుల శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్‌కుమార్ గురువారం ఆర్మూర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వస్తున్నాయని, ఆదరాబాదరాగా ఇండ్లకు అప్లికేషన్లు తీసుకోవడం సరికాదన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారంతా పేదవారైనప్పుడు, కులం, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరి అని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. వీటి కోసం ప్రజలు గవర్నరమెంట్ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారన్నారు. గతంలో ఇంటి నిర్మాణానికి గతంలో ఐదు లక్షలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మూడు లక్షలు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం దేశ వ్యాప్తంగా అమలవుతున్నందున తెలంగాణలోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ టౌన్ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్, గోవింద్‌పేట్ సొసైటీ వైస్ చైర్మన్ తూర్పు రాజు పాల్గొన్నారు.
బీజేపీ సంబురాలు..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 7వ సారి ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ లీడర్లు సంబురాలు చేసుకున్నారు. జిల్లా, మండల కేంద్రాల్లోని చౌరస్తాల్లో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. --- వెలుగు, నెట్‌వర్క్
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు భూమిపూజ
బోధన్,వెలుగు: పట్టణంలోని శక్కర్‌నగర్‌లో నిర్మించే ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు ఎమ్మెల్యే షకీల్ గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.7.20 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. కొంతమంది ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగవద్దని ఇక్కడి స్థలంలోనే అంబేద్కర్ భవనం కావాలని అంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ స్థలాన్ని ఎవరికీ కేటాయించలేదని తెలిపారు. ఎస్సీలకు అందుబాటులో ఉండే స్థలంలోనే కోటి రూపాయాలతో అంబేద్కర్ భవన్‌ను చేపడుతామని తెలిపారు. అలాగే శక్కర్‌నగర్ గ్రౌండ్‌లో త్వరంలోనే స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మావతి, ఆర్డీవో రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ ఖమర్ హైమద్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహెల్, డీఈ శివానందం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధకృష్ణ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
పోలీస్ ఈవెంట్స్ షురూ..
నిజామాబాద్ నగరంలో రాజారాం స్టేడియంలో నిర్వహిస్తున్న పోలీస్ ఈవెంట్స్ గురువారం షురూ అయ్యాయి. సీపీ కె.ఆర్ నాగరాజు సమక్షంలో ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఫిజికల్ టెస్ట్‌లు సాయంత్రం వరకు నిర్వహించారు. తొలిరోజు 600 మంది పురుష అభ్యర్థులను పిలువగా 518 మంది హాజరయ్యారు. ఎక్కడా ఎలాంటి పొరబాట్లు, అక్రమాలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
అర్బన్ పార్కు పనులు పూర్తి చేయాలి: నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నిజామాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న పనులను పది రోజుల్లో పూర్తి చేసి అర్బన్ పార్స్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. నగర శివారులోని చిన్నాపూర్ వద్ద ఉన్న అర్బన్ పార్క్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఓపెన్ జిమ్‌లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కనీస సదుపాయాలైన నీటి వసతి, విద్యుత్ సరఫరా, టాయిలెట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలన్నారు. మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ నుంచి అర్బన్ పార్కుకు కనెక్షన్ అందించే పనులను వేగవంతం చేయాలన్నారు. పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్స్ ప్లే జోన్ ఏరియాతో పాటు, ప్రధాన ప్రవేశ మార్గానికి ఇరువైపులా పర్యాటకులను ఆకట్టుకునేలా సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, ఎఫ్‌డీవో భవానీ శంకర్, తహసీల్దార్ శంకర్, ఎంపీడీవో క్రాంతి, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారులు సౌమ్య, అశోక్ కుమార్, స్థానిక సర్పంచ్ లక్మి పాల్గొన్నారు.
కూల్చివేతలపై అనుమానాలు వద్దు
నిజామాబాద్ ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి చెప్పారు. పాత కలెక్టరేట్ తో పాటు దాని పరిసరాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయ భవనాల కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కూల్చివేతలపై వస్తున్న ఆరోపణలను నమ్మరాదని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్న ప్రదేశాల్లో అతి త్వరలోనే అధునాతన హంగు లతో వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్, ఆడిటోరియం, స్పోర్ట్స్ స్టేడియం, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం తదితర నిర్మాణాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఆశావర్కర్ల సంక్షేమానికి కృషి చేయాలి
నిజామాబాద్, వెలుగు: ఆశావర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని సీఐటీయూ జిల్లా మహాసభ డిమాండ్ చేసింది. కొత్త అంబేద్కర్ భవనంలో ఆశావర్కర్ల 4వ జిల్లా మహాసభ జరిగింది. ఈ ప్రోగ్రామ్‌కు సీఐటీయూ నేత ఏ.రమేశ్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ హాజరై మాట్లాడారు. ఏపీలో చెల్లిస్తున్నట్లు ఆశావర్కర్ల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 6 శాతం కేటాయించాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్, రాజమణి, రేణుక, విజయ, బాలామణి, భాగ్య, సుకన్య, స్వప్న, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.
నాలుగేళ్లలో అభివృద్ధి చేశా..ఎమ్మెల్యే సురేందర్
లింగంపేట, వెలుగు: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 20 ఏళ్లుగా జరుగని అభివృద్ధిని తాను నాలుగేండ్లలోనే చేశానని ఎమ్మెల్యే సురేందర్ చెప్పారు. గురువారం లింగంపేటలోని రైతు వేదికలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 90 మంది లబ్ఢిదారులకు రూ.29.86 లక్షల సీఎంరి లీఫ్ఫండ్చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో12వేల పైచిలుకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించామన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, గాంధారి మండల కేంద్రంలో రూ.15 కోట్లతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. రూ.80 లక్షలతో లింగంపేట బస్టాండ్ మరమ్మత్తులు చేయిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో రూ.40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. అనంతరం మండలంలోని పర్మల్లలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లు లావణ్య, ఎంపీపీ గరీబున్నీసా, వైఎస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీటీసీ షమ్మి మున్నీసా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, టౌన్, యూత్ అధ్యక్షులు పోకలసాయిరాం, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం..
ఎల్లారెడ్డి : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై చేప పిల్లల్ని పంపిణీ చేస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ చెప్పారు. గురువారం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆయాన 1.52 లక్షల చేప పిల్లలు, 76,100 రొయ్య పిల్లలని వదిలారు. అనంతరం మత్స్యకారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కుల వృత్తుల అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. కార్యక్రమం లో జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను, జడ్పీటీసీ ఉషా గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీశ్, అధికార ప్రతినిధి శంకర్ పాల్గొన్నారు.
‘మన ఊరు మన బడి’తో విద్యాభివృద్ధి: ఎమ్మెల్యే హన్మంత్‌షిండే
పిట్లం, వెలుగు: విద్యాభివృద్ధి కోసమే ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం చేపడుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలోని గణేశ్ మందిర్ పీఎస్, హైస్కూల్‌లో మౌలిక వసతులు, నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్కూల్‌లో స్టూడెంట్లకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అవసరం ఉన్న చోట భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగానే గణేశ్ మందిర్ పీఎస్‌లో మౌలిక వసతుల కోసం రూ.58.13 లక్షలు, హైస్కూల్ కొత్త భవనం కోసం ఎన్ఆర్జీఈఎస్ కింద రూ.79.49 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎంపీపీ అశోక్‌పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జునప్ప పాల్గొన్నారు.
శిశుమందిర్ స్కూల్‌కు రూ.10 లక్షలు
పిట్లం సరస్వతి శిశుమందిర్ స్కూల్ అభివృద్ధికి రూ. 10 లక్షల నిధులు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. గురువారం స్కూల్‌లో ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హన్మంత్‌షిండే హాజరై బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రతాప్‌రెడ్డి, విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సాగౌడ్, బాబుసింగ్, నవీన్ స్కూల్ సెక్రటరీ రమణాగౌడ్, వైస్ ప్రెసిడెంట్ సంగమేశ్వర్, హెచ్‌ఎం బద్రీ పాల్గొన్నారు.