
- విప్ రామచంద్రు నాయక్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పదేండ్ల కుటుంబ పాలనతో తెలంగాణ 50 ఏండ్లు వెనక్కిపోయిందని ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ ఆరోపించారు. మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ వద్ద మార్కులు కొట్టేయడం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ పై మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఆర్ఎస్ ప్రవీణ్ ను వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి జీతగాడిలా మారడంతో ప్రవీణ్ కుమార్ పై ఇప్పటి వరకు జనంలో ఉన్న గౌరవం ఇలాంటి చేష్టలతో పూర్తిగా పోయిందన్నారు. దళిత, గిరిజన, బహుజన హక్కుల కోసం పోరాడుతున్న ప్రవీణ్ కుమార్.. చివరకు ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొడుతానన్న ఆయన ఇప్పుడు అక్కడే ఊడిగం చేస్తున్నరని ఆరోపణలు చేశారు.