ఎన్నికలొస్తేనే జనం గుర్తొస్తరు

రాష్ట్రంలో తాజాగా నాగార్జునసాగర్​ ఉప ఎన్నిక వచ్చింది. వెంటనే టీఆర్ఎస్ సర్కారుకు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు గుర్తొచ్చాయి. స్వయంగా సీఎం కేసీఆర్​ రెండు సభల్లో పాల్గొన్నారు. అయితే ఇటీవల హాలియ సభ టీఆర్ఎస్ నాయకత్వం ఉహించినంత సక్సెస్ కాలేదు. అక్కడ కేసీఆర్ ప్రసంగంతో, ఎన్నికలొస్తేనే సీఎంకు ఆయా నియోజకవర్గాలు, అభివృద్ధి కార్యక్రమాలు గుర్తొస్తాయని తేలిపోయింది. నెల్లికల్లు సాగునీటి ప్రాజెక్టు, నందికొండలో డిగ్రీ కాలేజ్ తదితర అంశాలపై కేసీఆర్ హామీలు ఇచ్చారు. కానీ, ఎన్నిక తెల్లారి ఇవన్నీ కేసీఆర్  మరిచిపోతుంటారని మనందరికీ తెలిసిందే. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా అనేక హామీలు ఇచ్చారు. ఎన్నిక తర్వాత వాటిని మరిచిపోయారు. ఇప్పుడూ అంతే. 

ఎన్నికల్లో గెలవడానికి లక్ష అబద్ధాలు ఆడుతున్నరు

కేసీఆర్ ఇచ్చే హామీలన్నీ ఓట్ల కోసమే. లక్ష అబద్ధాలు ఆడి ఎన్నికలో గెలవాలనే స్ఫూర్తితో కేసీఆర్ ముందుకు పోతున్నారు. ఒకవేళ ఈ ఉపఎన్నిక రాకపోయి ఉంటే సాగర్ లో అభివృద్ధి పనులు గుర్తొచ్చేవా? ముమ్మాటికీ లేదనే చెప్పాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తమ సొంత నియోజకవర్గాలకు ఖర్చు పెడుతున్న నిధుల్లో కనీసం 50% అయినా మిగతా నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించి ఉంటే ఇప్పుడు ఇన్ని అబద్ధాలు చెప్పే అవసరం రాకపోయేది. రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న తెలంగాణ ధనిక రాష్ట్రమని బడాయి పోతున్న కేసీఆర్, ఉద్యోగుల జీతాలు ప్రతి నెలా1వ తారీఖున ఎందుకు ఇవ్వలేకపోతున్నాడో చెప్పాలి. హాలియా సభలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన, నిరుద్యోగ భృతి వంటి మాటల ఊసేలేదు. నిరుద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపే ఒక్క హామీ లేదు. కేసీఆర్ పడికట్టు మాటలను సాగర్ నియోజకవర్గ ప్రజలు సీరియస్ గా తీసుకోలేదు. అందుకే ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు. దీంతో గ్రౌండ్ ఖాళీ కుర్చీలతో కనిపించింది.

ఓటమి భయంతోనే రెండు సీఎం సభలు

నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇదే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 15 ఏండ్లు మంత్రిగా సేవలందించిన సీనియర్ నాయకుడు జానారెడ్డి బరిలో ఉండటంతో టీఆర్ఎస్ నాయకత్వంలో ఆందోళన మొదలైంది. అందుకే గతంలో ఎన్నడూ లేనట్లు సీఎం కేసీఆర్ ఒకే అసెంబ్లీ ఉపఎన్నికలో 2 భారీ బహిరంగ సభలు పెట్టారు. సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని అధికార పార్టీ అప్రజాస్వామిక రాజకీయాలకు తెరలేపింది. కింది స్థాయిలోని కాంగ్రెస్ కేడర్​ను నయానో భయానో లొంగదీసుకునే ప్రయత్నం చేసింది. వార్డు మెంబర్లు, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులను డబ్బులు, కాంట్రాక్టులు ఆశ చూపి బలవంతంగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. టీఆర్ఎస్ కారణంగా సాగర్ లో డబ్బు, మద్యం ఏరులై పారాయి. 

సాగర్​ ఉప ఎన్నికలో బీజేపీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన రవి నాయక్ ను పోటీకి నిలిపింది. అయితే బీజేపీ క్యాండిడేట్​ కారణంగా కాంగ్రెస్ మద్దతు ఓట్లు చీలి, టీఆర్ఎస్ కు పరోక్షంగా ఉపయోగపడే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా సాగర్ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి. సీఎం కేసీఆర్ ను గద్దెదింపటానికి, జానారెడ్డి లాంటి పెద్ద దిక్కు అవసరం రాష్ట్రానికి ఎంతైనా ఉంది. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ఎండగట్టే గొంతును ఎన్నుకునే సమయమిది.
                                                       ..కొనగాలమహేష్,​ఏఐసీసీ మెంబర్

రాష్ట్రంలో ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్​కు అభివృద్ధి, జనం గుర్తుకొస్తరు. ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ హామీలిచ్చుడు, స్కీములు ప్రకటించుడు ఆయనకు అలవాటైంది. జనాన్ని నమ్మించి ఓట్లేయించుకున్నంక హామీలన్నీ మరచిపోవుడు పరిపాటైంది. ఒకవేళ ఎలక్షన్లు లేకపోతే ప్రజల గురించి, పాలన గురించి పట్టించుకునే తీరికే కేసీఆర్​కు ఉండటం లేదు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. తాను ఫామ్​హౌస్​కే పరిమితం అవుతున్నరు. ఎన్నికలు వచ్చాయంటే మాత్రం సీఎం​తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హామీలు, అభివృద్ధి కార్యక్రమాలంటూ జనాలను మోసం చేస్తున్నరు. అసెంబ్లీ, 
లోక్​సభ ఎన్నికలు మొదలుకుని హుజూర్​నగర్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎలక్షన్ల వరకూ వారిది ఇదే తీరు.

జనాలను బెదిరిస్తున్నరు

టీఆర్​ఎస్ పార్టీ మంత్రులను మండలాలకు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో బాధ్యులుగా నియమించి కాంగ్రెస్ లోకల్ లీడర్లు, కార్యకర్తలతో బేరసారాలకు దిగారు. టీఆర్ఎస్ క్యాండిడేట్ గ్రామానికి వస్తున్నారని, మీటింగ్​కు హాజరైతే ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఇస్తామని ఊరు చాటింపు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన మహిళలను కుక్కలు అని కేసీఆర్ తిట్టారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కోసం నిరసన తెలిపిన  నిరుద్యోగులను తొక్కిపడేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి బెదిరింపులకు దిగారు. తమ క్యాండిడేట్​కు ఓట్లేయకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ప్రజలను టీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసెకెళ్లినా లాభం లేకపోయింది. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు తమ ఆలోచనలను ప్రజలకు వివరించేందుకు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉంది. కానీ, సాగర్ లో ఆ పరిస్థితులు లేవు. కేసీఆర్ బహిరంగ సభ కోసం వస్తుంటే, కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయడం దేనికి సంకేతం? కాంగ్రెస్ నాయకులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఇవన్నీ టీఆర్ఎస్ కనుసన్నల్లోనే ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారనే భావన కలిగించేలా చేస్తున్నాయి.