
జన్నారం/బజార్ హత్నూర్/బెల్లంపల్లి రూరల్, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 15 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా గురువారం గ్రామ పంచాయతి కార్మికులు పలు చోట్ల భిక్షాటన చేశారు. జన్నారం, బజార్ హాత్నూర్ తదితర మండలాల్లో దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం తమతో వెట్టి చాకిరి చేయిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. కాసిపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు చేపట్టిన దీక్షకు బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్మద్దతు తెలిపారు. 15 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
కార్మికుల గోడు పట్టదా?
భైంసా: పారిశుద్ధ్య కార్మికుల గోడు సీఎం కేసీఆర్సర్కారు పట్టదా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామారావు పటేల్ప్రశ్నించారు. బాసరలో కార్మికులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్ధతు తెలిపారు. గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్మికులకు నెలనెలా జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.