భూసేకరణ చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలు

ఎన్నో ఉద్యమాలు, పోరాటాల తర్వాత రైతులకు మేలు చేసేలా ఒకటి రెండు సమగ్ర భూసేకరణ చట్టాలు రూపుదిద్దుకున్నాయి. వాటిని అమలు చేస్తే ఎక్కడ పరిహారం ఎక్కువ ఇయ్యాల్సి  వస్తుందోనని, ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం భూసేకరణ చట్టాలకు తూట్లు పొడుస్తున్నాయి. ప్రాజెక్టుల అక్కెర ఒడ్డెక్కించుకునేందుకు ఆర్డినెన్స్​లు, జీవోలు తెచ్చుకొని, అవసరం లేకున్నా చట్టసవరణలు చేసి అరకొర పరిహారం ఇచ్చి నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నాయి. పర్యావరణ ప్రభావాల అంచనాలు, సామాజిక ప్రభావాల అంచనాలు, గ్రామ సభ అనుమతులు లేకుండానే ఏకపక్షంగా తమ పని కానిచ్చుకునే వెసులుబాటుతో సవరించిన చట్టాలు తెచ్చుకొని రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండికొడుతున్నాయి. 

బ్రిటీష్ కాలం(1884)లో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని స్వతంత్ర దేశంలో విచ్చలవిడిగా వాడారు. రైతులకు, భూ యజమానులకు ఎలాంటి హక్కులు కల్పించని ఈ వలసవాద చట్టంపై అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి. న్యాయమైన పరిహారం, పునరావాసం తదితర హక్కుల కోసం స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఏండ్లపాటు చేసిన ఉద్యమాలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. 2013లో పార్లమెంట్​ఆమోదంతో కొత్త భూ సేకరణ చట్టం తీసుకువచ్చింది. 80 శాతం ప్రజల అంగీకారం ఉంటేనే భూసేకరణ జరపాలని(సెక్షన్ 2), సమగ్ర సామాజిక అధ్యయనం జరగాలని(సెక్షన్ 4), రెండు పంటలు పండే భూములను ప్రాజెక్టుల కోసం తీసుకోవద్దు(సెక్షన్10). ఇలాంటి రైతులకు మేలు చేకూర్చే ఎన్నో అంశాలను ఈ చట్టంలో పొందుపరిచింది. ఆనాడు కేంద్రమంత్రి అజిత్ సింగ్ హైదరాబాదుకు వచ్చి చట్ట ముసాయిదా గురించి మాతో సంప్రదించినప్పుడు మేము కూడా కొన్ని మార్పులు చెప్పాం. రైతులకు ఎంతో మేలు చేస్తుందనుకున్న ఈ చట్టం అమలు ప్రక్రియ మొదలు కాకముందే 2013 చట్టం ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బ తీసేలా 2014లో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రభుత్వానికి, ప్రైవేటు కంపెనీలకు భూమి తాము అనుకున్న చోటే సేకరించుకునే మార్గాలను సుగమం చేసింది. తరువాత, ఆ చట్టానికి సవరణ బిల్లు లోకసభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో ఆమోదం పొందలేదు. దీంతో 2015 ఏప్రిల్ లో ప్రభుత్వం మళ్లీ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. రాష్ట్రాలు కూడా కేంద్రం తీరునే అనుసరిస్తూ సొంత భూసేకరణ చట్టాలు తయారు చేయడం మొదలుపెట్టాయి.  

జీవోలతో భూ సేకరణ
అనేక నిరసనల మధ్య తెలంగాణ ప్రభుత్వం భూసేకరణకు సంబంధించి 2016లో ఒక ముసాయిదా తెచ్చింది. 2017లో దానికి తుది రూపం ఇచ్చింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమి తీసుకోవడం కష్టం అని భావించిన రాష్ట్ర సర్కారు జీవో 45 ద్వారా పేదలకు ఇచ్చిన అస్సైన్డ్ భూమి తీసుకుంది. ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి రద్దు చేయాలని 2016 లో రైతులు కోర్టుకు పోతే, హైకోర్టు దాన్ని రద్దు చేసింది. తర్వాత వచ్చిన123 జీవో ప్రకారం కొంత అసైన్​మెంట్, కొంత పట్టా భూమి తీసుకుంది. ఈ జీవోను కూడా హైకోర్టు రద్దు చేసింది. అయితే రద్దుకు ముందే కొంత భూసేకరణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం ఈ జీవో ద్వారా దాదాపు19,570 ఎకరాలు సేకరించిన సర్కారు, సంబంధిత ఇంజనీర్ల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసింది. ఈ భూమిని కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద బదిలీ చేసే ప్రక్రియ 2021లో మొదలుపెట్టింది. భూమిని ‘ప్రైవేటు’ వ్యక్తుల పేరు మీద రిజిస్టర్ చేసి, మళ్లీ అప్పులు పొందేందుకు వాటిని ఒక కార్పొరేషన్ పేరు మీద బదిలీ చేయడం ఏ పాలనా సూత్రాల్లో ఉంది?  అసలు19 వేల ఎకరాలు భూసేకరణ ప్రాజెక్ట్ అవసరాలకు జరిగిందా లేక కుదువపెట్టేందుకు తీసుకున్నారా? అనే ప్రశ్నకు సమాధానమే లేదు.

కేంద్ర చట్టానికి సవరణలు
భూసేకరణకు మార్గం సుగమం చేసే బిల్లును ఆమోదించడంపై 2016 డిసెంబర్ 28న శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2013 కేంద్ర చట్టం ద్వారా కీలకమైన ప్రాజెక్టుల కోసం భూమిని సేకరించడంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దీన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విచారణ చేయకుండా ఆసక్తి గల వ్యక్తుల సమ్మతి తీసుకున్న తరువాత భూమిని సేకరించడానికి, ఒక అవార్డును జారీ చేయడానికి జిల్లా కలెక్టరుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఏదైనా ప్రజా ప్రయోజనం కోసం భూమిని సేకరించవచ్చు. కేంద్ర చట్టంలో రైతుల రక్షణకు ఉన్న నిబంధనలను తప్పించుకోవడానికి రాష్ట్ర సర్కారు చాలా కసరత్తు చేసింది. ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి మరీ ఈ చట్టం నుంచి బయటపడటానికి సుదీర్ఘ ఆలోచనలు చేసింది. చట్టాన్ని కాలరాయడానికి అధికారుల కమిటీ ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. తెలంగాణ భూసేకరణ చట్టంలో 2013 కేంద్ర చట్టానికి కొన్ని సవరణలు చేసి అందులో ఉన్న కీలక మూడు సెక్షన్ల(సెక్షన్ 2, సెక్షన్ 4, సెక్షన్10)ను మినహాయించారు.  2013 నుంచి 2021 వరకు భూ రిజిస్ట్రేషన్​ విలువలు సవరించలేదు. వాటిని చట్టప్రకారం సవరిస్తే, 2013 కేంద్ర భూ సేకరణ చట్టం అమలు చేస్తే, బాధితులకు ఎక్కువ నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తుందని 2017లో రాష్ట్ర భూసేకరణ చట్టం చేసి, నిర్వాసితులకు అరకొర పరిహారం నిర్ణయిస్తూ గోస పెడుతున్నది. నిర్వాసితుల పరిస్థితే ఇలా ఉంటే అదే భూమి మీద ఆధారపడి బతుకుతున్న బడుగు, బలహీన వర్గాల కుటుంబాలను పట్టించుకునే నాథుడే లేరు.

ఫార్మా సిటీ పేరుతో..
హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 19,333 ఎకరాలు సేకరించడానికి 2013 చట్టం నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఈ జీవో కూడా చట్ట విరుద్ధం. హైకోర్టు ఇక్కడి సేకరణ ప్రక్రియను నిలిపి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పేరిట వ్యవసాయ భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకొని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకు కట్టబెడుతున్నది. నగరాల చుట్టూ ల్యాండ్ పూలింగ్, రోడ్ల విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం వ్యవసాయ భూములు గుంజుకుంటున్నది. దీని వల్ల భవిష్యత్తులో ఆహార ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. ఆహార భద్రత సమస్యగా మారుతుంది. పేదరికం మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, సమగ్ర భూ వినియోగ విధానం, పకడ్బందీ చట్టపర రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.
- దొంతి నర్సింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్