- స్టూడెంట్లకు అందించే సౌకర్యాలపై ప్రమోషన్
- విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యత్నం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటి వరకూ ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రమే అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహిస్తుండగా.. తాజాగా సర్కారు విద్యా సంస్థలూ ప్రచారం షురూ చేయనున్నాయి. అయితే, దీన్ని అడ్మిషన్ల ప్రచారం కోసమే కాకుండా.. సర్కారీ స్కూళ్లలో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల గురించీ ప్రచారం చేయనున్నారు.
రాష్ట్రంలో గవర్నమెంట్, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్ వంటి విద్యా సంస్థలు 26,856 ఉన్నాయి. వీటిలో సుమారు 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. అలాగే 11,500 ప్రైవేటు స్కూళ్లుంటే, వాటిలో 34 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. మరోపక్క ఇంటర్మీడియెట్ లోనూ 424 సర్కారు కాలేజీలు ఉండగా.. వాటిలో లక్షన్నర మంది విద్యార్థులు చదువుతున్నారు. 1400 ప్రైవేటు కాలేజీల్లో 7 లక్షల మంది చదువుతున్నారు. కాగా.. ఏటా సర్కారు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా, ప్రైవేటు సంస్థల్లో పెరుగుతోంది.
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎలాంటి ఫెసిలిటీస్, క్వాలిఫైడ్ టీచర్లు, లెక్చరర్లు లేకున్నా.. అడ్మిషన్ల సంఖ్య పెరిగేందుకు ప్రధానంగా ప్రచారమే కారణం. ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్ల ఫొటోలతో ప్రచారం చేసి పేరెంట్స్ ను కాలేజీల మేనేజ్ మెంట్లు ఆకర్షిస్తున్నాయి. మరోపక్క ప్రైవేటు విద్యా సంస్థలతో పోలిస్తే సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతున్నా, ఫెసిలిటీస్ ఉన్నా.. ప్రచారం లేక బయటకు తెలియడం లేదు. ఈ నేపథ్యంలో లక్షల్లో ఫీజులు కట్టిన స్టూడెంట్లతో ఎలాంటి ఫీజులు చెల్లించని విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఇదే విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు, ఇంటర్మీడియెట్ అధికారులు యోచిస్తున్నారు.
దీనికోసం ప్రత్యేకంగా ఫేస్ బుక్, ఎక్స్, వాట్సప్ లో స్పెషల్ గ్రూపులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, మండల, స్కూల్ లెవెల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రతి స్కూల్ లెవెల్ లో టీచర్ల క్వాలిఫికేషన్లతో పాటు ఆ స్కూళ్లలో జరిగే ప్రతి ఈవెంట్నూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేరనున్నారు.
విద్యార్థులకు సర్కారు అందిస్తున్న మిడ్ డే మీల్స్, రాగిజావతో సహా యూనిఫాం, పుస్తకాలు, డైలీ స్పోర్ట్స్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ను ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేయనున్నారు. స్టూడెంట్లు సాధించే ఫలితాలనూ తెలియజేయనున్నారు. దీంతో సర్కారు విద్యా సంస్థలపై ఉన్న అపనమ్మకాన్ని ప్రజల నుంచి దూరం చేయాలని అధికారులు యోచిస్తున్నారు.