ఆర్టీసీలో ఎలక్ట్రిక్ డిపోలు.!..త్వరలో మరో 2,500 ఎలక్ట్రిక్ బస్సులు

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ డిపోలు.!..త్వరలో మరో 2,500 ఎలక్ట్రిక్ బస్సులు
  • ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరగడంతో ఏర్పాటుకు నిర్ణయం
  • 100 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ డిపోలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో డిపోల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఎలక్ట్రిక్  డిపోకు 10 ఎకరాల చొప్పున స్థలం అవసరం. ఈ లెక్కన పది డిపోలకు వంద ఎకరాల స్థలం అవసరం అవుతోంది. అలాగే, ఒక్కో డిపో ఏర్పాటుకు  రూ.10 కోట్లు అవసరం అవుతాయని, దీంతో మొత్తం పది డిపోలకు రూ.100 కోట్లు అవసరం ఉన్నందున ఈ నిధులు సమకూర్చాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అలాగే, ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం ప్రతి డిపోలో 33 కేవీ హైటెన్షన్ విద్యుత్​ సరఫరా అవసరం ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న పది డిపోలతో పాటు ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ డిపోల్లోని 20 డిపోల్లోనూ చార్జింగ్​పాయింట్లు అవసరం కానున్నాయి. దీంతో రూ.100 కోట్లకు తోడు అదనంగా మరో రూ.250  కోట్ల వరకు ఫండ్స్​ అవసరం అవుతాయని ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది.

త్వరలో మరో 2,500 ఎలక్ట్రిక్ బస్సులు 

ఇటీవల కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. మరికొన్ని జిల్లాల్లో కూడా ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పెరగనున్న ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ డిపోలు అవసరం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  నిధులను విడుదల చేస్తే ఆర్టీసీ అధికారులు కొత్త డిపోల ఏర్పాటుపై ముందుకు సాగనున్నారు. కాగా, గత సంవత్సరం వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకున్న ఆర్టీసీ.. ఇప్పుడు మరో 2,500 బస్సులకు సంబంధిత కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక రానున్న రోజుల్లో డీజిల్ బస్సుల వాడకం బాగా పడిపోనుంది.