పత్తికి మంచి ధర వస్తదా?

10 కోట్ల మందికి ఉపాధి కల్పించే పత్తి రంగం మీద ప్రభుత్వాలకు ఒక సమగ్ర ఆలోచన లేదు. ముడి పత్తి ధరల మీద ప్రభావం చూపే ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలు ప్రైవేటు విత్తన, రసాయన, ఎగుమతి, దిగుమతి, మిల్లుల యాజమాన్య కంపెనీల కనుసన్నల్లో, వారికి అనుకూలంగా ఉంటున్నాయి. రైతుల గోస అరణ్య రోదనగానే మిగులుతున్నది. కార్పొరేటు కంపెనీలు నష్టాల్లో ఉంటే అనేక పథకాల ద్వారా, అనేక రూపాల్లో వారిని ఆదుకునే మన ప్రభుత్వాలు, రైతులు నష్టపోతే మాత్రం స్పందించడం లేదు. 
 

అమెరికాలో 2021తో పోలిస్తే నిరుడు పత్తి సాగు విస్తీర్ణం11 శాతం పెరిగింది. 2021 చివర్లో, 2022 ప్రారంభంలో పత్తి ధరలు పెరగడంతో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. చైనాలో మాత్రం కొంత తగ్గింది. మొత్తానికి, అంతర్జాతీయంగా పత్తి మార్కెట్లు నిలకడగా లేవు. పత్తిని ఉత్పత్తి చేసి, పూర్తిగా ఆ ఉత్పత్తిని వినియోగించుకునే సత్తా ఉన్న భారతదేశం అంతర్జాతీయ మార్కెట్ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. మన దేశంలో కూడా పత్తి విస్తీర్ణం మారుతున్నది. 2020–-21లో 132.85 లక్షల హెక్టార్ల నుంచి 2021–-22లో 119.10కి పడిపోయి, 2022–-23లో 125.10 లక్షల హెక్టార్లకు పెరిగింది. తెలంగాణలో  2021–-22లో 23.58 నుంచి 2022–-23లో 18.89 లక్షల హెక్టార్లకు పడిపోయింది. మార్కెట్​లో పత్తి ధరలను బట్టి పంట విస్తీర్ణం మారుతున్నది. ధరలు పెరిగితే, వచ్చే సీజన్​లో చిన్న రైతులు తమకున్న కొద్దిపాటి విస్తీర్ణానికి అదనంగా కౌలుకు తీసుకుని పత్తి వేస్తున్నారు. సాగు విస్తీర్ణం అమెరికాలో ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి తగ్గింది. పత్తి సాగు, దిగుబడులు మీద వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది. పండిన పత్తి ఏరకుండా వదిలేయడం కూడా అక్కడ ఒక కొలమానం. పత్తి ఏరకుండా వదిలేసే భూ విస్తీర్ణం గత ఐదేళ్లలో బాగా మారింది. 2021లో నాటిన పత్తి విస్తీర్ణంలో కేవలం10 శాతం మాత్రమే పత్తి ఏరలేదు. అదే 2020, 2018లో అది వరుసగా 32 శాతం, 29 శాతం నమోదైంది. మార్కెట్లో ధరలను బట్టి రైతులు ఇట్లా వదిలేయాల్సి వస్తున్నది. మన దగ్గర పత్తి సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి బాగా తగ్గింది. అకాల వర్షాలు, పురుగుల బెడద, నకిలీ, నాసి రకం విత్తనాల వల్ల దిగుబడి తగ్గుతున్నది. పండిన పత్తి నాణ్యత కూడా అంతంత మాత్రమే. 

సిండికేట్​ పరిణామాలతో నష్టం

ఇంట్లో పత్తి నిల్వ ప్రమాదకరమైంది. అగ్ని ప్రమాదాల సమస్యకు దారితీయవచ్చు. ఇంట్లో పత్తి నిల్వతో రైతు కుటుంబాలకు చర్మరోగాలు వస్తున్నాయి. విపరీతమైన దురద, శ్వాస సంబంధ వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందుల్లో కూడా మంచి ధర కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకు వ్యవసాయ గిడ్డంగుల్లో నిలువ చేసి రసీదులు తీసుకుని బ్యాంకుల నుంచి నిలువ చేసిన పంట విలువలో 75 శాతం రైతు పొందే పథకం ఉండేది. పత్తి రైతులకు ఈ పథకం ఉపయోగపడేది. ఇప్పుడు దాని ఊసే లేదు. మార్కెట్​లో గిరాకీ, సరఫరా ధరలను ప్రభావితం చేస్తాయి. ‘ప్రభుత్వ పరంగా మేము చేసేది ఏమి లేదు’ అని ప్రభుత్వ పెద్దలు చెబితే, ఆర్థికవేత్తలు కూడా ఇదే మంచిది అని సూక్తీకరిస్తారు. ఎక్కువ సరఫరా ఉంటే, డిమాండ్ స్థిరంగా లేదా తక్కువగా ఉంటే, ధరలు తగ్గుతాయని మార్కెట్ పండితులు చెబుతారు. అయితే, పత్తి సరఫరా తక్కువ ఉంది. అయినా ధరలు పెరుగుతలేవు. ఎందుకు? ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. నవంబరులో పత్తి మండీలకు వస్తుంటేనే, ధరలు తారుమారు అవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ సంస్థ మండీల్లో ఉండటం లేదు. ప్రభుత్వ కొనుగోళ్లు ఈసారి ఉండి ఉంటే రైతులకు గిట్టుబాటు ధర వచ్చేది. కనీస మద్దతు ధర కంటే మార్కెట్ ధర ఎక్కువ ఉంది కాబట్టి కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. మద్దతు ధర కనీసం మాత్రమే. రైతులకు గరిష్ట గిట్టుబాటు ధర వచ్చేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం ఆ పని ఎప్పుడూ చేయలేదు. ఈసారి మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, చేయడం లేదు. దీన్ని బట్టి, ప్రభుత్వం మద్దతు ధరను కనీసంగా కాకుండా గరిష్ట ధరగా భావిస్తునట్టు రుజువైంది. ప్రైవేటు పత్తి కొనుగోలుదారులకు లబ్ధి చేకూర్చే విధంగా సీసీఐ తీరు, వ్యవహార శైలి కనిపిస్తోంది. ధరలను మద్దతు ధరలోపే ఉంచడానికి ప్రైవేట్ పత్తి కొనుగోలుదారులకు కొన్ని సాధనాలు ఉన్నాయి. అవి నాణ్యతా ప్రమాణాలు(తేమ, మైక్రోనైర్, స్టేపుల్ లెంగ్త్, స్క్రాప్ తదితర), చెల్లింపు నిబంధనలు (వాయిదాల్లో, రుణాలు, చెక్కులు, అదే చెక్కులను డిస్కౌంట్​లో కొనుగోలు చేయడం) సిండికేట్ ప్రవర్తన. అదనంగా, ప్రభుత్వం తీరు కూడా ఇందుకు తోడు అవుతున్నది. ఈ పరిణామాలన్నీ పత్తి రైతులను విపరీత నష్టాలకు గురిచేస్తూ, అప్పుల పాలు 
చేస్తున్నాయి.

దిగుబడి ఎందుకు తగ్గుతున్నది?

గణాంకాలతో కూడా రైతులను మోసం చేస్తున్నారు. ఏదేమైనా, భారతదేశంలో పత్తి- చేనేత సరఫరా గొలుసులో ప్రస్తుత పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది. పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉత్పత్తి వ్యయం పెరుగుతూనే ఉంది. రసాయనాల మోతాదును తట్టుకునే పురుగులు పెరగడం, అకాల వర్షాలు, రసాయనాల నిరంతర వినియోగంతో నేల సారం క్షీణించడం పరిపాటిగా మారింది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాల్లు మాత్రమే ఎందుకు వస్తుందనే ప్రశ్నకు.. కోట్లు ఆర్జిస్తున్న పత్తి విత్తన కంపెనీల నుంచి కానీ, జన్యుమార్పిడి విత్తనాల వల్ల రైతులకు ప్రయోజనం అని చెప్పిన శాస్త్రవేత్తల నుంచి కాని, నియంత్రించే అధికార వ్యవస్థ నుంచి కాని జవాబు రావడం లేదు. నాణ్యత లేని, నాసి రకం, నకిలీ విత్తనాల వల్ల పత్తికి తెగుళ్ల బెడద పెరిగింది. విష రసాయన పిచికారి పెరిగింది. అయినా నాణ్యమైన పత్తి వస్తలేదు. పత్తి విత్తనాల జన్యు స్వచ్ఛత క్షీణించినా ప్రభుత్వం స్పందిస్త లేదు. గులాబీ రంగు పురుగు ఉధృతమై దిగుబడులకు ఆటంకంగా మారింది. రైతులకు బయట అప్పులకు వడ్డీల భారం పెరిగింది. 2013 నాటికి నెలకు రైతుల సగటు ఆదాయం రూ.6,491. ఇప్పుడు రెట్టింపు ఆదాయం కాదు కదా, కనీస ఆదాయం కూడా రాని పరిస్థితులు దాపురించాయి. నాసిరకం పత్తి విత్తనాల సరఫరా మీద నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నది. వాటి వల్ల నష్టపోతున్న రైతులకు ఉపశమనమే లేకుండా పోయింది.  పత్తి రైతుల నష్టాల సాగు మీద కోట్లకు పడగలెత్తిన కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు.


బాధ్యత విస్మరిస్తున్న రాష్ట్ర సర్కారు

పాలన పరంగా పత్తి రైతులకు అండగా ఎవరూ లేరు. వ్యాపారులు, కంపెనీలు, అధికారులు, ఎగుమతిదారులు సమన్వయంతో వ్యవహరిస్తారు. మార్కెట్ సమాచారాన్ని ముందుగానే తెలుసుకునే వనరులు వాళ్లకు ఉన్నాయి. మార్కెట్ ధోరణి, విశ్లేషణలపై వారికి ముందస్తు సమాచారం అందించే సంస్థలు ఉన్నాయి. వారు కోరుకున్న సమయంలో, క్షణంలో ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటనలు పొందే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో రైతు ప్రయోజనాల పరిరక్షణ ముసుగులో వాళ్ల అభిప్రాయాలను సమర్థించే స్వయం ప్రకటిత రైతు ప్రతినిధులకు మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. పత్తి వేయండని ఏటా ఖరీఫ్ కు ముందు చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం పత్తి వచ్చే సమయానికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపుతున్నది. తానుగా చేపట్టాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నది. పత్తి పంట కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు. బోనస్ ప్రకటించవచ్చు. ఇంకా ఇతర మార్గాలను అన్వేషించి రైతులకు లబ్ధి చేకూర్చవచ్చు. కానీ రాష్ట్ర సర్కారు అదేమీ చేయడం లేదు.

ఎగుమతులను ప్రోత్సహించక..

ఈ సారి పత్తికి మంచి రేటు వస్తదని రైతులు ఆశించారు. కొన్ని రోజులు ఆగితే రేటు వస్తదని ఇంట్లో, ఎక్కడ వీలు ఉంటే అక్కడ నిల్వ చేసుకున్నారు. ప్రపంచ స్థాయిలో 2022–23 మార్కెటింగ్ సంవత్సరానికి పత్తి డిమాండ్ ఉత్పత్తిని మించి ఉంటుందని భావించారు. అయితే అనిశ్చిత, స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది మారొచ్చు అని కూడా అనుకున్నారు. నిరంతర ద్రవ్యోల్బణం వినియోగదారుల విచక్షణ వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నది. పత్తికి డిమాండ్ తగ్గింది. మార్కెట్ ధరలు రైతులు ఆశించిన మేరకు లేవు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మార్కెట్లోకి రాలేదు. కొనుగోళ్లు చేయలేదు. ఇంతకు ముందు, జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని కాటన్ అడ్వైజరీ బోర్డు ఏటా పత్తి బ్యాలెన్స్ షీట్ ను అభివృద్ధి చేసేది. ఈ బోర్డును ఎత్తేసి, కమిటీ ఆన్ ​కాటన్ ​ప్రొడక్షన్ ​అండ్​ కన్ఞంప్షన్ (సీఓసీపీసీ) అనే ఒక కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తయారు చేసిన ఈ ఏడాది బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. నిరుటితో పోలిస్తే ఉత్పత్తి10 శాతం పెరిగితే, దేశీయ వినియోగం1 శాతం తగ్గింది. అయితే, అమెరికాలో ఉత్పత్తి తగ్గిన దరిమిలా మనం ఎగుమతులు పెంచుకోవచ్చు. ఎగుమతులు పెరిగితే రైతులకు ధర పెరగొచ్చు. కానీ, ఎగుమతులు 6 శాతం తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ముడి పత్తి ఎగుమతులను ప్రోత్సహిస్తలేదు. ఏటా మార్చి లోపే, బ్యాలెన్స్ షీట్ అంచనాల మేరకు పత్తి ఎగుమతులు, దిగుమతుల విధానం ఖరారు అవుతున్నది. ఇప్పటి వరకు కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు చేసినట్టు లేదు. ఎగుమతులు పెరిగితే దేశీయంగా ధరలు పెరుగుతాయని భయం కావచ్చు. అంటే దేశీ కంపెనీల ప్రయోజనాల మేరకు పత్తి ఎగుమతులను అనుమతించడం లేదు. మరి పత్తి రైతుల ప్రయోజనాలు ఏం కావాలి? వారికి గిట్టుబాటు ధర అందించాలి కదా! అయినా మార్కెట్ కొనుగోళ్లు లేవు. ఎగుమతులకు అనుమతి లేదు. ఈ రెండు చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల ఆశల మీద నీళ్లు చల్లింది. ధరలు పెరుగుతాయని ఇంట్లో పెట్టుకుని ఆశిస్తున్న పత్తి రైతులకు ధర వచ్చే అవకాశం కనిపిస్తలేదు.

- డా. దొంతి నరసింహారెడ్డి
మాజీ సభ్యుడు, కాటన్ అడ్వైజరీ బోర్డు