లైబ్రరీలకూ ఓ పథకం కావాలి : డా.రవి కుమార్ చేగొనీ

ప్రభుత్వాలు పట్టించుకోక.. సరిపోను నిధులు ఇవ్వక.. రాను రాను లైబ్రరీల ప్రభ మసకబారుతున్నది. పుస్తక పఠనం అలవాటు అంతరించిపోయే ప్రమాదంలో పడింది. ఉన్న లైబ్రరీలను ఆధునీకరించడంతోపాటు ప్రతి పల్లెలో ఒక గ్రంథాలయం ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే జాతీయ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలి. అప్పుడే భారతదేశం విజ్ఞాన భూమిగా పునర్వైభవం సంతరించుకుంటుంది. 

గ్రంథాలయాలు జాతి సంపద. మనదేశంలో ఒకప్పుడు నలంద, తక్షశిల, పాల, ఇక్ష్వాక విశ్వవిద్యాలయాల్లో అద్భుతమైన జ్ఞాన భాండాగారాలు ఉండేవి. వాటిలోని జ్ఞాన సంపద కోసం వివిధ దేశాల విద్యార్థులు, యాత్రికులు ఇండియాకు వచ్చి విద్యనభ్యసించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన గ్రంథాలయాల ఉన్నతి, వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. పాలకుల నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా స్వాతంత్ర్యోద్యమంలో  ప్రజలతో మమేకమై ఉద్యమ, చైతన్య స్ఫూర్తిని నింపిన గ్రంథాలయాలు నేడు ప్రభను కోల్పోయే పరిస్థితి వచ్చింది. యునెస్కో, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ మేనిఫెస్టో ప్రకారం తొలుత ప్రతి 5000 జనాభాకు ఒక లైబ్రరీ, తర్వాత 2000 జనాభాకు ఒకటి, ప్రస్తుతం వెయ్యి జనాభాకు ఒక గ్రంథాలయం ఉండాలి. దేశవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఆరు లక్షల గ్రంథాలయాలు ఉండాలి. కానీ లేవు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ లెక్కల ప్రకారం.. దేశంలో 50 వేల లైబ్రరీలు ఉన్నాయి. 

రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్.. 

మనదేశంలో ఉన్న పౌర గ్రంథాలయాలు ఆయా రాష్ట్రాల ఆధీనంలో, ప్రభుత్వం అందించే ఆర్థిక, సహకారాలతో, ప్రజలు చెల్లించే పన్ను ద్వారా నడుస్తున్నాయి. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా ఉన్న పౌర గ్రంథాలయాలకు భవన నిర్మాణాల కోసం, పుస్తకాల కొనుగోలు కోసం, సౌలత్​ల కోసం, గ్రంథాలయాలను ఆధునీకరించేందుకు(కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు) కావాల్సిన తోడ్పాటునందిస్తున్నది. ఈ సంస్థ నుంచి తెలంగాణ 2019-–20 ఏడాదిలో భవనాల నిర్మాణం కోసం రూ. 34, 50, 000, అదే ఏడాది లైబ్రరీలకు కంప్యూటర్లు కొనేందుకు రూ.1,36, 99 2 నిధులు పొందింది. 2020–-21 సంవత్సరంలో స్టోరేజ్ మెటీరియల్ కోసం రూ.1,15, 500, భవనాల నిర్మాణం కోసం రూ.12,50,000 ఫండ్స్​రాష్ట్రానికి అందాయి. 2021-–22 సంవత్సరంలో భవనాల నిర్మాణం కోసం రూ.25 లక్షలు, 2023 సంవత్సరానికి స్టోరేజ్ మెటీరియల్ కోసం రూ.13,50, 000 నిధులు కేటాయించింది.

అత్యధికంగా 2019 నుంచి 2022 వరకు రాజారామ్ మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ వారు కేరళ రాష్ట్రానికి రూ. 1,94,03,986 , కర్నాటకకు ఒక కోటి 86 లక్షల రూపాయలు నిధులు కేటాయించారు. ఈ ఫౌండేషన్ ఆయా రాష్ట్రాలకు మ్యాచింగ్ గ్రాంట్, నాన్ మ్యాచింగ్ గ్రాంట్ కింద నిధులు అందజేస్తూ లైబ్రరీల ఉన్నతికి తోడ్పడుతున్నది. అయితే రాష్ట్రాల్లో లైబ్రరీల అభివృద్ధి కోసం ఫౌండేషన్​ఇంత చేస్తుంటే.. ఆయా రాష్ట్రాలు మాత్రం ఆ నిధులను వాడుకొని ఫౌండేషన్​ అడిగిన యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. దీంతో ఫౌండేషన్​ద్వారా వచ్చే కొద్దిపాటి నిధులు కూడా ఆగిపోతున్నాయి. 

వివిధ రాష్ట్రాల్లో చట్టాలు

రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోపాటు ప్రజల వద్ద వసూలు చేసే పన్నుల్లో కొంత సెస్​లైబ్రరీలకు కేటాయించాలన్న ఉదేశంతో ఆయా రాష్ట్రాలు గ్రంథాలయాల చట్టాలు చేశాయి. తమిళనాడు1948లో, హైదరాబాద్​1955లో, ఆంధ్రప్రదేశ్1960లో చట్టాలు చేశాయి. ఇప్పటివరకు19 రాష్ట్రాలకు గ్రంథాలయ చట్టాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయాల చట్టం 2014లో ఏర్పాటైంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ సెస్​మీద పది పైసలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాలు ఇంటి పన్ను, ఆదాయ పన్ను మీద 8 పైసలు, కర్నాటక రాష్ట్రం మూడు శాతం ల్యాండ్ రెవెన్యూలో, కేరళలో ఐదు శాతం ఇంటి పన్ను, ఆదాయ పన్ను పైన, హర్యానా లో ఆదాయ పన్ను, ఇంటి పన్ను మీద సర్​చార్జ్ పేరిట వసూలు చేసిన నిధులను గ్రంథాలయాల ఉన్నతి కోసం వెచ్చిస్తున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మణిపూర్, మిజోరం, గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్​గడ్, బీహార్, లక్షదీప్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎలాంటి గ్రంథాలయ పన్నులు వసూలు చేయకుండానే ఆయా రాష్ట్రాల్లో పౌర గ్రంథాలయాలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.

జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరం

అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో గ్రంథాలయాలకు జాతీయస్థాయిలో ప్రత్యేక గ్రాంటును కేటాయించడం, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి లైబ్రరీలను ఎప్పటికప్పుడు ఆధునీకరించడం చేస్తున్నారు. అమెరికాను ‘ది ల్యాండ్ ఆఫ్ లైబ్రరీస్’ అని పిలవడానికి ప్రధాన కారణం ఆ దేశంలో ఉన్నన్ని పౌర గ్రంథాలయాలు, అవి అందించే సేవలు మిగతా ఏ దేశాల్లో లేకపోవడమే. గత ఎనిమిదేండ్లుగా భారత ప్రభుత్వం అనేక సాంఘిక సంక్షేమ (ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, జన్ సురక్ష, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి వాయ వందన యోజన, స్కిల్ ఇండియా మిషన్, మేడ్ ఇన్ ఇండియా, మిషన్ స్వచ్ఛ్ భారత్,  ఉజ్వల యోజన, మిషన్ ఫర్ డిజిటల్ ఇండియా లాంటి125కి పైగా) పథకాలను అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది. ‘గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలు’ అని బాపూజీ అన్నట్లు గ్రామాలు స్వయం సమృద్ధితోపాటు విజ్ఞానవంతంగా వృద్ధి చెందాలి. అందుకోసం గ్రామాల్లో లైబ్రరీల ఏర్పాటు అవసరం.

పుస్తక నిక్షిప్త కేంద్రం, గ్రామీణ గ్రంథాలయం, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి గ్రంథాలయాలన్నింటినీ కలిపి ఒక నెట్​వర్క్​గా ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయిలో ఉన్న పాఠకుడు కూడా జాతీయ గ్రంథాలయంలో ఉన్న వనరులను ఉపయోగించుకునే అవకాశం కల్పించాలి. జాతీయస్థాయిలో గ్రంథలయాలకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేసి గ్రామీణ గ్రంథాలయాల నుంచి జాతీయస్థాయి లైబ్రరీల వరకు ప్రణాళికలు రూపొందించి పాఠకులను లైబ్రరీలకు తీసుకువచ్చే చర్యలు చేపట్టాలి. జాతీయస్థాయిలో గ్రంథాలయాలకు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. జాతీయస్థాయిలో ‘గ్రామీణ గ్రంధాలయ యోజన’ అనే కార్యక్రమం చేపట్టి దానికి తగిన నిధులను కేటాయించి మళ్లీ భారతదేశాన్ని విజ్ఞాన భూమిగా, ది ల్యాండ్ ఆఫ్ లైబ్రరీగా వెలుగొందే ప్రయత్నం చేయాలి.

- డా. రవి కుమార్ చేగొనీ, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం