15 ఎకరాల్లో 2016 ఇండ్ల నిర్మాణం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి వరదతో ప్రజలు ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జులై 16న 71.3 అడుగులకు గోదావరి వరద రావడంతో పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. 17న భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్​ ముంపునకు గురైన కాలనీవాసులకు ఎత్తైన ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబరు 3న రాష్ట్ర కేబినెట్​ కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. 2016 మంది నిర్వాసితులకు ఇళ్లు కట్టించి అందించేందుకు కలెక్టర్​ అనుదీప్​ స్థల సేకరణ, తదితర అంశాలపై దృష్టి పెట్టారు. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్​ కమిటీ, కొత్తమార్కెట్​లోని స్థలాన్ని పరిశీలించి వాటిని ఓకే చేసి స్వాధీనం కూడా చేసుకుంటున్నారు. మార్కెట్​ కమిటీ గోదాముల్లోని సరుకులను శనివారం బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్​ కమిటీకి తరలించారు. స్థలాన్ని పంచాయతీ ఆధ్వర్యంలో లెవలింగ్​ చేస్తున్నారు. 15 ఎకరాల్లో 2016 ఇండ్లు కట్టాలని నిర్ణయించారు. 

అయోమయంలో వరద బాధితులు

పట్టణంలోని సుభాష్​నగర్, అయ్యప్ప, అశోక్​నగర్​కొత్తకాలనీ, ఏఎంసీ, శిల్పినగర్​ తదితర కాలనీల్లోని నిర్వాసితులకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2016 ముంపు బాధితుల్లో భద్రాచలంలో నిర్వాసితులు 1400 మంది మాత్రమే ఉండగా, మిగిలిన వారు బూర్గంపాడు మండలం సుందరయ్యనగర్​కాలనీ, సారపాక వాళ్లు. అక్కడి వారిని భద్రాచలం ఎలా తీసుకొస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలంలో చూపిస్తున్న వారిలోనూ కొంత మందే అసలైన బాధితులు ఉన్నారని అంటున్నారు. మిగిలిన వారిని ముందు జాగ్రత్త చర్యగా ఇటీవల పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎత్తైన ప్రాంతంలో స్థలం కేటాయించి, అందులో డబుల్​బెడ్రూం కట్టిస్తామని చెప్పి, ఇప్పుడు కాంప్లెక్స్ లాగా కట్టిస్తే ఎలాగని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటే ఒక కుటుంబానికే ఇల్లు ఇస్తామనడంపైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం స్థలం కేటాయించి, ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి

డబుల్​బెడ్రూం ఇండ్లు కట్టించాలనే ఆలోచన వచ్చినప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకపోవడం సరైంది కాదు. విలువైన ఇండ్లను పోగొట్టుకుని డబుల్​బెడ్రూం ఇళ్లకు ఎలా వస్తారు? 2013 భూసేకణ చట్టం ప్రకారం పరిహారం, ఇల్లు కట్టించి ఇవ్వాలి. కరకట్టను బలోపేతం చేసి, డ్రైనేజీ వ్యవస్థను సరి చేస్తే బ్యాక్​ వాటర్​ సమస్య తీరుతుంది. స్లూయిజ్ లను మార్చాలి.

- గడ్డం స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి

ఎత్తైన ప్రాంతంలో స్థలం ఇవ్వాలి

స్థలానికి స్థలం ఇవ్వాలి. ఇంటికి ఇల్లు కట్టించాలి. అట్లైతేనే మాకు ఆ ఇంటిపై హక్కు ఉంటుంది. రేపు పిల్లలకు, మా అవసరాలకు ఇల్లు, స్థలం ఉపయోగపడాలి. లేకుంటే మేము నష్టపోతాం. ఎత్తైన ప్రాంతంలో ఇల్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు డబుల్​బెడ్రూం ఇళ్లు కాంప్లెక్స్ లా కట్టి ఇస్తామంటే ఒప్పుకొనేది లేదు.

- శెట్టిగారి సరోజిని, అశోక్​నగర్​ కొత్తకాలనీ