ఆచార్య నాగార్జున డిగ్రీ, పీజీలతో నిరుద్యోగులు పరేషాన్ 

రెగ్యులర్ కోర్సులు చేయలేని వారికి విద్యా కమిటీల సిఫార్సుల మేరకు ప్రభుత్వాలు దూర విద్యా విధానం కూడా అమలులోకి తీసుకువచ్చాయి. అనేక సంత్సరాలుగా లక్షల మంది ఓపెన్ డిగ్రీలు, పీజీ కోర్సులు ఇతర కోర్సులు చేశారు. ఎంతో మంది ఉద్యోగాలు కూడా సాధించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పొందిన పట్టాలు చెల్లవని ఇది యూనివర్సిటీ​ గ్రాంట్ కమిషన్ నిబంధన అని, ఇతర రాష్ట్రాల బ్రాంచ్​లు ఇక్కడ చెల్లవని 2013 అక్టోబర్ నుంచే ఇది అమలు లోకి ఉన్నదని తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేర్కొంది. ఈ ప్రకటన వల్ల దాదాపు 2  లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఒక పక్క నోటిఫికేషన్లు ఇస్తూ, మరో పక్క ఈ డిగ్రీ లు చెల్లవని పేర్కొనడంతో అభ్యర్థులు ఆగం అవుతున్నారు.

రాజకీయ నాయకులు ఏ డిగ్రీ లు చేసినా దర్జాగా రాజకీయ పార్టీల పదవుల్లో... ఇతర ప్రభుత్వ అధికారిక పదవుల్లో ఉంటూ నిరుద్యోగులకి మాత్రం ఫలానా వర్సిటీ డిగ్రీలు చెల్లవని పేర్కొనడం దారుణం. ప్రభుత్వం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీల విషయంపై దృష్టి సారించి, సీరియస్​గా తీసుకొని లక్షల మంది అభ్యర్థులకి న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకి అనుమతించాలి. ఒక పక్క రాష్ట్రంలో విచ్చలవిడిగా ఆ బ్రాంచ్​లకు అనుమతి ఇస్తూ.. మరో పక్క పోటీ పరీక్షలకి ఆ డిగ్రీలు చెల్లవని పేర్కొనడం విద్యార్థులను మోసగించడమే అవుతుంది. వెంటనే పోటీ పరీక్షలకు అందరికీ అవకాశం ఇవ్వాలి. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

‌‌‌‌‌‌‌‌- రావుల రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు,  తెలంగాణ డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్థుల సంఘం