పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి

పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి

అధిక సంఖ్యలో మహిళలను శ్రామిక శక్తిగా రూపొందించే ఆవశ్యకతను ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించాయి. వీరికి ఆర్థిక భాగస్వామ్యం కల్పించడంలో ఎదురవుతున్న ఆటంకాలను, అవరోధాలనూ పరిష్కరిస్తున్నాయి. ఉద్యోగాల నాణ్యత, పెరుగుతున్న వేతనాల చెల్లింపు  సకాలంలో చేతికి అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. పచ్చదనం, సమ్మిళిత ప్రగతితో దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును సృష్టించే ప్రపంచ విధానాలను కేంద్రం అనుసరిస్తోంది. 

ప్రపంచ బ్యాంకు భాగస్వామిగా ప్రభుత్వాలకు ఆసరాగా నిలుస్తోంది. భారత దేశంలో పేదరిక నిర్మూలనకు పదకొండు పంచవర్ష ప్రణాళికలు తయారు కాగా మొదటిది 1951 లో ప్రారంభమైంది. తొలి ప్రణాళిక ప్రధానంగా వ్యవసాయం, నీటి పారుదల, సర్వతోముఖ సమతుల్య అభివృద్ధి సాధనను లక్ష్యంగా చేసుకుంది. భారీ పరిశ్రమల వృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణపై రెండో పంచవర్ష ప్రణాళిక దృష్టి పెట్టింది. చైనా దురాక్రమణ, ఇండో– పాక్ యుద్ధం కారణంగా మూడో ప్రణాళిక పూర్తిగా విఫలమైంది.2007-–12 పదకొండో పంచవర్ష ప్రణాళిక పేదరికం తీరుతెన్నుల మీద దృష్టి సారించి పది శాతం మేర దీన్ని తగ్గించాలని, ఏడు కోట్ల కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా చేసుకుంది.

భారత ప్రణాళికా సంఘం 2011–-12 అంచనా ప్రకారం గ్రామీణ జనాభాలో 25.7 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. పట్టణ పరిధిలో ఈ సంఖ్య 13.7 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు లేకపోవడంతోపాటు ఆహార సరఫరా, ఉపాధి వ్యవస్థ వంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం రేటు పట్టణ ప్రాంతాల కన్నా  తులనాత్మకంగా ఎక్కువగా ఉంది. 

అనేక పథకాలు ఉన్నా  పేదలకు చేరుతున్నాయా?

మనదేశంలో పేదరిక నిర్మూలనతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి స్వనిధి పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ , ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, ఉజ్వల ప్రణాళిక, ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ - ధన్ వంటివి అమలు చేస్తోంది కేంద్రం. అయితే కొన్ని కార్యక్రమాలు అనుకున్న రీతిలో అమలు కావడం లేదు.

దీనికి చాలా కారణాలే ఉన్నాయి. పేదరిక నిర్మూలన కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల కచ్చితమైన సంఖ్యను గుర్తించలేకపోతోంది. అర్హులు నమోదు కాలేకపోతున్నారు. ఫలితంగా ఆశయానికి తూట్లు పడుతున్నాయి. అధికారుల్లో గందరగోళం తప్పడంలేదు. తప్పులు దొర్లడం కూడా తప్పడం లేదు. అధిక జనాభా వల్ల పథకాల ప్రయోజనాలను పెద్ద సంఖ్యలో ప్రజలకు అందించడం కష్టతరంగా మారుతోంది. అంతేకాకుండా పథకాల అమలు విషయంలో వివిధ స్థాయిల్లో అవినీతి ప్రధాన కారణంగా తయారవుతోంది.

పేదరిక నిర్మూలనకు సవాళ్లు

పేదరిక నిర్మూలనకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తున్నా,  పేదరికం వాస్తవ  లెక్కలకు దూరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశమే. దీని బహుముఖ స్వభావం, వ్యవస్థాగత సవాళ్లు విజయాన్ని అడ్డుకుంటోంది. పేదరికం కొనసాగడానికి మరో కారణం దేశమంతటా ఉన్న ఆర్థిక అసమానత. సంపద, వనరుల  అసమాన పంపిణీ అనేది సంపన్నులు, అట్టడుగు వర్గాల మధ్య అంతరాన్ని పెంచుతోంది. చాలామంది జీవన చక్రాలకు లేమితనం అడ్డుపడుతోంది. ముందుకు కదలనివ్వడం లేదు. వేగవంతమైన జనాభా పెరుగుదల పేదరిక నిర్మూలన ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోంది. అందుబాటులో ఉన్న వనరుల మీద తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. తక్కువ వ్యవసాయ ఉత్పాదకత, భూమి, ఇతర  ఆస్తుల  అసమాన పంపిణీ, గ్రామీణ పరిశ్రమల క్షీణత లాంటి అనేక అంశాలు పేదరికానికి ఉదాహరణలుగా మిగిలిపోతున్నాయి.