మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా.. నేటికీ మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం ఇంకా అందని ద్రాక్షగానే ఉన్నాయి. ఆకాశంలో సగంగా కీర్తి పొందే మహిళలు అధికారానికి దూరంగా ఉంటున్నారు. 75 ఏండ్ల ప్రజాస్వామిక పాలనలో కేవలం ఒకే ఒక మహిళా ప్రధాని, ఒక మహిళా రాష్ట్రపతి అధికారం చేపట్టగా, మిగతా వారంతా మగవారే. దేశవ్యాప్తంగా మహిళల అభివృద్ధి స్త్రీ, పురుష సమానత్వంలో అంతరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కొంతమంది మేధావులు ఆడ, మగ సమానమే కానీ మగవాళ్లు కాస్త ఎక్కువ సమానం అని చెబుతుంటారు. దీంతో మహిళా అభివృద్ధి, సమానత్వం అనేవి ఉత్తి మాటలుగానే మిగులుతున్నాయి. కట్టుబాట్లు, సంప్రదాయాల పేరిట నేటి మహిళలు ఇంకా పురుషాధిక్యత కిందే నలుగుతున్నారు. అయితే రాజ్యాంగం స్త్రీ, పురుషులను సమానంగా గుర్తించి గౌరవిస్తోంది. ఆర్టికల్ 15(3) ప్రకారం మహిళల అభివృద్ధి, ఉన్నతికి రాజ్యం ప్రత్యేక చట్టాలు చేయొచ్చు. ఆర్టికల్ 39(బీ) ప్రకారం సమాన వేతనం చెల్లించాలి. ఆర్టికల్ 39(ఏ) ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన జీవన ఉపాధి కల్పించాలి. 15 ఏ(ఈ) ప్రకారం స్త్రీ గౌరవ పరిరక్షణకు ప్రతి పౌరుడు కృషి చేయాలి. అయితే దేశంలో ప్రతి విషయంలో రాజకీయ ప్రమేయం ఉండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతోంది.
పితృస్వామి భావజాలంతో..
మహిళలకు సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఇచ్చేందుకు ఉద్యమ కాలంలో బీజాలు పడ్డాయి. సంఘసంస్కర్తలు మహిళకు కూడా అన్ని రంగాల్లో అర్ధభాగం ఇవ్వాలని సూచించారు. ఆచారాలు, మతాల్లో పితృస్వామిక భావజాలం కారణంగా మహిళలకు రెండో స్థానమే దక్కింది. పురుషాధిక్యత సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు లేవని భావించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు1952లో ప్రయత్నించారు. కానీ దాన్ని సనాతనవాదులు వ్యతిరేకించారు. పండిత్ జవహార్ లాల్ నెహ్రూ ఒప్పుకున్నా మిగతా వారందరూ వ్యతిరేకించారు. మహిళలకు సమాన హక్కులేందని ఒప్పుకోలేదు. వారిలో బాబురాజేంద్రప్రసాద్, మహావీర్ త్యాగి తదితరులు ఉన్నారు. అప్పట్లో పార్లమెంట్ కు ఎన్నికైన వారు 52 శాతం భూస్వాములు, 27 శాతం న్యాయవాద వృత్తి వారు, మిగతా వారు ఇతరులు ఉండేలా చూడాలనే భావన ఉండేది. ఆ దృష్టితోనే మహిళలకు హక్కులు లేకున్నా పర్వాలేదని వాదించారు. యూఎన్డీపీ వారు మహిళా అభ్యుదయానికి సమభాగం అనే నినాదాలతో ఆయా రాష్ట్రాలలోని వెనుకబడిన జిల్లాలు ఎన్నుకొని మహిళల డెవలప్మెంట్కోసం చర్యలు చేపట్టారు. వాటిలో ముఖ్యమైనది జెండర్ సమానత్వం. కానీ ఆ సమానతత్వం ఎగువ, మధ్యతరగతి ప్రజల్లో కనిపించడం లేదు.
చట్టసభల్లో మహిళలేరి?
మనకు స్వాతంత్ర్యం వచ్చే నాటికి చురుగ్గా రాజకీయాల్లో పాల్గొన్న మహిళల్లో.. కమలా నెహ్రూ, కస్తూరిబాయి గాంధీ, సరోజినీదేవి నాయుడు, కమలాదేవి, చటోపాధ్యాయ, అమృత రాజుకర్ రాణి గాయత్రి దేవి, విజయరాజే సింధియా, కాంగ్రెస్ పార్టీలోనూ, కమ్యూనిస్టు పార్టీలోచటోపాధ్యాయ, అచ్యుత మీనస్, మలమ్మ, చాకలి ఐలమ్మ, విమలాదేవి, సుబ్బమ్మ, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటివారు ప్రముఖులు. వీరు మహిళలకు పనిగంటలు, జీతభత్యాలు సమానంగా ఉండాలని బ్రిటీష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతల విషయంలో ఇండియా ప్రపంచంలో దారుణస్థితిలో ఉంది. 142 దేశాలపై సర్వే చేసిన ఓ సంస్థ ప్రకటించిన ర్యాంకుల్లో ఇండియాకు114వ ర్యాంక్వచ్చింది. దేశం మొత్తంలో 47.8 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉండగా.. వారిలో 24 శాతం మహిళలు మాత్రమే ఉన్నత స్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ లోక్ సభలో11శాతం, రాజ్యసభలో 10.8 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లునే గుర్తించలేక మూలన పడేసిన ఘనత మన నాయకులది.
మహిళా సాధికారత దిశగా..
పురుషులతో సమానంగా హక్కులు పొందడంలో మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారనేది నగ్నసత్యం. కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. చట్టాలు చేయడం కాదు వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వాలు పని చేయాలి. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఏటా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఒక కార్యక్రమంగా జరుపుతున్నాయి కానీ.. మహిళా సమానత్వం గురించి ఆలోచించడం లేదు. చిత్తశుద్ధితో చట్టాలను తీసుకువచ్చి మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అప్పుడే మహిళలు సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతారు. ఆ దిశగా పాలకులు ఇప్పటికైనా అడుగు వేయాల్సిన అవసరం ఉంది.
– మన్నారం నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, లోక్ సత్తా పార్టీ