ట్రాఫికింగ్.. డ్రగ్స్, బెగ్గింగ్ మాఫియా చిన్నారులకు భద్రత లేకుండా చేస్తన్నాయి. అమానుషంగా రేప్ చేయడం, దగ్గరి వాళ్లు కూడా పిల్లలను కిడ్నాప్ చేసి చంపడం వంటివి మామూలు అయిపోయాయి. ఇక స్ట్రీట్ చిల్డ్రన్ సంగతి పట్టించుకున్న వారే లేరు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది చిన్నారులు అమ్మానాన్నలను కోల్పోయి వీథుల పాలయ్యారు. తినడానికి తిండి లేక, తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క, ఉండేందుకు చోటు లేక నరకం చూస్తున్న పేద పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఆప్యాయంగా పలకరించే వారు లేక ఎన్నో పసి హృదయాలు ఇప్పటికి విలవిలలాడుతున్నాయి. రాజ్యాంగం ఎన్ని హక్కులు కల్పిస్తున్నా.. వారి పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. అలాంటి వారికి సంపూర్ణ రక్షణ, భద్రత కల్పించే విధంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రామానిక నిర్వహణా పద్ధతులు (ఎస్వోపీ)ను ముందుకు తెచ్చింది. తద్వారా పిల్లల వివరాలు సేకరించి వారికి సరైన, ఉన్నతమైన జీవితం అందేలా చూస్తారు.
గత రెండేళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులను ఒక్కసారిగా కరోనా మహమ్మారి తలకిందులు చేసేసింది. దీనివల్ల ఎంతోమంది చిన్నారులు వీధుల పాలయ్యారు. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య ఎక్కువ అవుతూ వస్తోంది. లెక్క తెలియని ఎంతోమంది చిన్నారులు నిరాధారులుగా బతుకుతున్నారు. ప్రభుత్వాలు పిల్లలకోసం ఎన్ని స్కీములు ప్రవేశ పెడుతున్నాం అవి వారికి చేరడం లేదు. ఎంతమంది మేధావులు వీరిపై ఎన్ని చర్చలు చేసినా వారి బతుకుల్లో వెలుగులు నింప లేకపోతున్నారు. దానికి తోడు కరోనా సమయంలో ఆహారం, నీళ్లు సరైన సమయానికి అందక వాళ్ల బతుకులు మరింత హీనంగా మారాయి. మన రాజ్యాంగం వీరి కోసం ప్రత్యేకంగా కొన్ని రక్షణ హక్కులను కల్పించింది. ఆ హక్కులు ఉల్లంఘనకు గురవుతూ పిల్లల మానసిక, శారీరక, విద్య, అభివృద్ధిపై విపరీత ప్రభావాలను చూపుతున్నాయి.
ఎస్‌ఓపీ లక్ష్యాలు..
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారు బాలల హక్కుల కార్యకర్తలతో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న వీధి బాలలను గుర్తించి వారితో డైరెక్ట్‌గా మాట్లాడిన తర్వాత కొన్ని చర్యలు చేపట్టింది. వారికి సంపూర్ణ రక్షణ, భద్రత కల్పించే విధంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రవేశ పెట్టింది. ఈ విధానంలో వారికి సరైన, ఉన్నతమైన జీవితం అందేలా చూస్తారు. ఇంకా వీరు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి, రక్షణ కల్పిస్తారు. ఈ ఎస్‌ఓపీలోకి ఎన్‌సీపీసీఆర్, ఎస్‌సీపీసీఆర్‌ల వంటి చట్టబద్ధమైన సంస్థలు పనిచేస్తాయి. జువెనైల్ జస్టిస్ రూపొందించిన పర్యావరణ వ్యవస్థలో చిల్డ్రన్ ఇన్ స్ట్రీట్ సిచ్చుయేషన్ (సీఐఎస్ఎస్) పై సమాచారం, డేటాను సేకరించడానికి, రెస్క్యూ ఆపరేషన్‌లు నిర్వహించడానికి, సర్వేలు చేపట్టడానికి జిల్లా పిల్లల రక్షణ యంత్రాంగం ద్వారా బృందాలను ఏర్పాటు చేస్తారు. చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్ 2015 ప్రకారం ఎస్‌ఓపీ ముందుగా లోకల్ స్థాయిలోని కొన్ని కుటుంబాల పరిస్థితులను సర్వే చేసి, పిల్లలను అవసరాలను మెయిన్‌టెయిన్ చేసేందుకు 34 రకాల స్కీములను సూచించింది. ఎస్‌ఓపీ అమలును నిర్థారించిన తర్వాత కోర్టుకు నివేదికను సమర్పించాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ ఆదేశంతో సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా ఉన్న చైల్డ్ యాక్టివిస్ట్‌లలోనూ, చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టంలోనూ కొత్త ఆశను నింపింది.
పిల్లలు తమ హక్కులు పొందాలి..
ఎన్ని పాలసీలు, స్కీములు ఉన్నా అవి చేనేవి చాలా కొద్దిమందికే. కరోనా మహమ్మారి టైమ్‌లో వలస కార్మికులు తమ పిల్లలతో వలస వెళ్లడం వల్ల ప్రభుత్వ పథకాలు అందుబాటులో లేవు. ఇప్పుడైనా పిల్లలంతా తమ హక్కులు సాధించేలా రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. స్థిరమైన, మంచి సమాజ నిర్మాణం జరగాలంటే బాలలు తమ హక్కులను పొందడం ఎంతో అవసరం. పిల్లలకు వారి హక్కుల కోసం వాదించడానికి, పోరాడటానికి మనదేశంలో సరైన చట్టాలు లేవు. రాజకీయంగా కూడా వారికి ఎలాంటి అండా లేదు. వారి ప్రయోజనాల కోసం నిర్ధిష్ట చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కుటుంబాలు బలంగా ఉన్నప్పుడే చిన్నారులు సామాజిక, మానసిక, శారీరక, విద్యా పరంగా ఎదుగుతారు. వీధుల్లో తిరుగాడే పిల్లలను కేవలం రక్షించడమే కాదు వారిలో పాజిటివ్ థింకింగ్ పెంచి దేశానికి పనికి వచ్చే వారిగా తీర్చిదిద్దగలగాలి. అందుకోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలి. చిన్నారులే దేశానికి నిజమైన వారసులు. వారి అవసరాలను పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేయడం వల్ల దేశానికి తీరని నష్టమే కాని లాభం ఏ మాత్రం లేదు. స్ట్రీట్ చిల్డ్రన్స్‌పై శ్రద్ధ పెట్టి, వారిని సరైన దారిలో నడిపించగలిగితే దేశం మరింత పటిష్టమవుతుంది. అందుకే వారిని చేరదీద్దాం.. దేశం గర్వించే పౌరులుగా తీర్చిదిద్దుదాం. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు.
దేశానికి ప్రమాదకారులుగా..
మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతోంది. మరో 75 ఏండ్లకు వ్యూహ రచనలు చేస్తున్నారు. దేశ భవిష్యత్ కోసం చేసే ఏ పనైనా ఫ్యూచర్‌లో మంచి ఫలితాలను పొందేందుకే. కాని ఇక్కడ సమస్య అది కాదు, నిర్లక్ష్యానికి గురవుతున్న చిన్నారుల గురించి. వారి విలువలు గుర్తించకుండా, పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే భవిష్యత్‌లో వీరి వల్ల ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ స్ట్రీట్ చిల్డ్రన్ పై సరైనా డేటా లేదు.16 నుంచ 18 లక్షల వరకూ వారి సంఖ్య ఉండొచ్చని కొన్ని ఎన్జీవోలు అంచనా వేస్తున్నాయి. ఈ చిన్నారులు ఫిజికల్‌గా, మెంటల్‌గా సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డులు లాంటివేమీ వారికి ఉండకపోవడం.. దాంతో సరైన ఫ్రూఫ్స్ లేవని వారిని బడుల్లో చేర్చుకోకపోవడంతో చదువు అబ్బక మరింత మొరటుగా తయారవుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్‌లో వీరు అక్రమ రవాణాకి గురవుతూ, హ్యూమన్ ట్రాఫికింగ్‌కి, డ్రగ్స్‌కి బానిసలవుతూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ దేశానికి ప్రమాదకారులుగా మారుతున్నారు.
- శ్రీమతి ప్రజ్ఞా పరాండే,
జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు