వాళ్లు ఇటు రావడానికి చాన్స్ లేదు..  మీరే అటు పోతరా? 

  • స్పౌజ్ బదిలీల్లో సర్కార్ కొత్త ప్లాన్ 
  • డీఈఓ ఆఫీసుల నుంచి టీచర్లకు ఫోన్లు 
  •  ఒకవేళ ‘‘వెళ్లము” అంటే రాసివ్వాలని ఒత్తిడి 
  • భార్యాభర్తల్లో ఇద్దరికీ సెట్ కాకుంటే వేరే జిల్లా ఇచ్చే చాన్స్! 

హైదరాబాద్, వెలుగు: టీచర్ల అలకేషన్​లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో భర్తకు, రంగారెడ్డి జిల్లాలో భార్యకు పోస్టింగ్ వచ్చింది. వీరిది రంగారెడ్డి జిల్లా కావడంతో స్పౌజ్ కేటగిరీలో ఆ జిల్లాకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని భర్త అప్లికేషన్ పెట్టుకున్నారు. వాస్తవానికి ఈ రెండు జిల్లాలు ఇప్పుడు బ్లాక్​లిస్టులో ఉన్నాయి. అయినా ఆ టీచర్ భార్యకు రంగారెడ్డి డీఈఓ ఆఫీసు నుంచి సిబ్బంది కాల్ చేశారు. ‘‘స్పౌజ్​ కేటగిరీలో మీ ఆయన రంగారెడ్డికి వచ్చే చాన్స్ లేదు. మీరే సంగారెడ్డికి వెళ్తారా? ఒకవేళ వెళ్లను అంటే.. ఆ మేరకు రాసి ఇవ్వండి” అని చెప్పారు. ఈ ఒక్క టీచర్ కే కాదు.. స్పౌజ్ అప్లికేషన్లు పెట్టుకున్న చాలామందికి రెండ్రోజుల నుంచి ఇట్లనే కాల్స్ వస్తున్నాయి. 
 

మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లకు రూ.లక్షల్లో ఆఫర్.. 
మ్యూచువల్ బదిలీలకు సర్కార్ ఓకే చెప్పిందనే ప్రచారం నేపథ్యంలో వసూళ్ల దందా మొదలైంది. జిల్లాను, మండలాన్ని బట్టి కొందరు టీచర్లు రేట్లు నిర్ణయించారు. కొత్త జోన్ల వారీగా ఉద్యోగుల విభజనకు ముందు ట్రాన్స్ ఫర్లకు సర్కార్ చాన్స్ ఇవ్వలేదు. జీవో 317లో భాగంగా సీనియర్లు సిటీలకు వెళ్లగా, జూనియర్లు రూరల్ ఏరియాలకు అలాట్ అయ్యారు. దీనికితోడు సెంట్రల్ గవర్నమెంట్, కార్పొరేషన్స్, బ్యాంక్ ఎంప్లాయీస్​కు స్పౌజ్​బదిలీలకు చాన్స్ ఇవ్వలేదు. దీంతో స్టేట్ ఎంప్లాయీ అయిన తమ భర్త/భార్యను తాము పనిచేసే చోటుకు తీసుకొచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎంప్లాయీస్, టీచర్లు మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లకు వెళ్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో పేర్లు, స్కూల్ వివరాలు పెడుతుండటంతో కొందరు బేరసారాలు మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఒక్కో జిల్లాకు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మేడ్చల్, హనుమకొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

బ్లాక్ లిస్టులో 13 జిల్లాలు... 
రాష్ట్రంలో టీచర్ల స్పౌజ్ బదిలీలకు సంబంధించి 13 జిల్లాలను బ్లాక్ చేయగా, బ్లాక్ చేయని జిల్లాల్లోనూ పోస్టులు లేవని కొందరికి చాన్స్ ఇవ్వలేదు. 13 జిల్లాల్లో 2,566 మంది ఉండగా, మిగిలిన జిల్లాల్లో 500 మంది వరకు టీచర్లు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం స్పౌజ్ బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కలెక్టర్లకు ఆదేశాలు రావడంతో డీఈఓ ఆఫీసుల సిబ్బంది టీచర్లకు కాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్పౌజ్ కేటగిరీలో అప్లై చేసుకున్న వారి నుంచి ‘‘రివర్స్ స్పౌజ్’’ కేటగిరీ డేటాను సేకరిస్తున్నారు. భర్త ఉన్న చోటుకు వెళ్లేందుకు భార్య అప్లికేషన్ పెట్టుకుంటే, అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేకపోతే.. భార్య ఉన్న చోటుకు వెళ్తారా? అని భర్తను అడుగుతున్నారు. ఈ మేరకు అందరికీ కాల్ చేసుకుంట అభిప్రాయాలు అడుగుతున్నారు. ఒకవేళ అలా వెళ్లను అంటే ‘‘నాట్ విల్లింగ్” అంటూ లెటర్ రాసివ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆఫీసర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. తాను అప్లై చేస్తే, తనకే కాల్ చేసి అడగాలి గానీ.. తన స్పౌజ్​(భార్య/భర్త)కు కాల్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క స్పౌజ్​బదిలీలకు అనుకూలమంటూ సర్కార్ ప్రకటనలిస్తూ.. ఇలా బెదిరింపులకు గురిచేయడం సరికాదని మండిపడుతున్నారు. కాగా, స్పాజ్ బదిలీల అప్లికేషన్లు పరిష్కారం కాకపోతే, వారికి మూడో ఆప్షన్ కూడా ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. ఇద్దరు పని చేసే జిల్లాలు కాకుండా వేరే జిల్లాకు ఇద్దరూ వెళ్లేందుకు అవకాశమివ్వాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు.