
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అనేకమంది భావించారు. ప్రజా రవాణా మీద దృష్టి ఉంటుంది అని ఆశించారు. రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు దాటిన తరువాత కూడా ప్రజా రవాణా వ్యవస్థను పెంపొందించలేదు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వ పెట్టుబడులు లేనే లేవు. తెలంగాణ గ్రామీణుల ప్రయాణం ఇంకా జటిలం అయ్యింది. సగటు తెలంగాణ ప్రయాణికుడి గోస ప్రభుత్వానికి పట్టడం లేదు. రోడ్లమీద పెట్టిన కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్ నగరాభివృద్ధికి, కార్లకు, కలప, ఇసుక, మట్టి, కంకర లారీలకు ఉపయోగపడుతున్నాయి.
ఈ పెట్టుబడుల వల్ల ఆయా వ్యాపారాలు పుంజుకున్నాయి. గ్రామీణులకు మాత్రం ఒనగూరిన ప్రయోజనం లేదు. పైగా కొత్త రోడ్లు అన్నీ గ్రేడ్ రోడ్లుగా మారుస్తున్నారు. రోడ్లను వెడల్పు చేసి వాహనాలు వేగంగా ప్రయాణించేందుకు వీలుగా ఇతర వాహనాలు రాకుండా డిజైన్ చేస్తున్నారు. హైదరాబాద్కు చేరే రోడ్ల వెడల్పు వల్ల రైతులకు, గ్రామీణులకు ఉపయోగం లేకుండా పోయింది. తమ గ్రామం మీదుగా పోతున్న రోడ్డు తాము ఎక్కకుండా, తమకు కాకుండా పోతున్న పరిస్థితి చూసి ఏం చేయలేకపోతున్నారు.
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో పాదచారుల మరణాల సంఖ్య చాలా ఎక్కువ. అందులో, గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు దాటుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వ్యవసాయ కూలీలు పని ప్రదేశాలకు వెళ్లాలంటే చాలా కష్టపడాల్సి వస్తున్నది. వాహనాలు లేని పరిస్థితులలో గ్రామాలలో ప్రయాణం కష్టం అయిపోయింది. రోడ్లు ఉన్నా సరిపడ వాహనాలు లేవు. రోడ్లు లేని గ్రామాలు కూడా ఉన్నాయి. అధునాతన వ్యవసాయం చేయాలని ప్రోత్సహించే ప్రభుత్వాలు పంటను ఇంటికి చేరవేసేందుకు, ఇంటి నుంచి మార్కెట్లకు తరలించడానికి అవసరమయిన రహదారుల ప్రణాళిక, రోడ్ల నిర్వహణ చేయడం లేదు.
ఒకప్పుడు మార్కెట్ సెస్సు నిధుల నుంచి గ్రామీణ రోడ్లను బాగుపరిచేవారు. నాబార్డు గ్రామీణ నిధులు కూడా ఉపయోగపడేవి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గ్రామీణ రోడ్ల గురించి, గ్రామీణుల రవాణా గురించి, గ్రామీణ రహదారుల నిర్మాణం గురించి, నిర్వహణ గురించి ఏ మంత్రి గాని, ముఖ్యమంత్రిగాని సమీక్ష చేయలేదు. కోసిన పంటను సరి అయిన పద్ధతులలో రవాణా చేసేందుకు తగిన వాహనాలు కూడా లేవు. దరిమిలా ప్రజలు వ్యక్తిగత వాహనాల మీద ఆధారపడుతున్నారు.
గ్రామాల్లో పెరుగుతున్న వ్యక్తిగత వాహనాలు
గ్రామాలలో వ్యక్తిగత మోటార్ సైకిల్ వాహనాల సంఖ్య పెరుగుతున్నది. వాటి వలన కాలుష్యం ఒక సమస్య కాగా వాటిని ఉపయోగిస్తున్న తీరు ప్రమాదకరంగా పరిణమించింది. గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఏ వాహన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. రోగులు, అనారోగ్యానికి గురి అయినవారిని తరలించడం గగనం అయిపోయింది. వైద్యం సరి అయిన సమయంలో అందక, అందుకోలేక అనారోగ్యం ముదిరినవాళ్లు కూడా ఉన్నారు. వాహనం లేక, ప్రజా రవాణా వ్యవస్థ లేక, అనేక రూపాలలో అసంఖ్యాకులు నష్టపోతున్నారు. ఆడపిల్లలు ఉన్నత చదువులకు వెళ్ళలేకపోతున్నారు.
దీనికంతటికీ కారణం సొంత వాహనాలు లేకపోవటం, వాటిని కొనగలిగినా నిర్వహించే ఆర్థిక సామర్థ్యం లేకపోవటం, ప్రజా రవాణా వాహనాలు లేకపోవటం, రహదారుల నిర్మాణం లేకపోవటం, రహదారుల నిర్వహణ లేకపోవటం, ‘మెల్లగా పయనించే వాహనాలకు’ అనుగుణంగా ప్రధాన రహదారుల డిజైన్ లేకపోవటం. ప్రధాన రోడ్లపొంటి గ్రామాలు, ఇండ్లు ఉంటే మంచిది అని అందరూ భావిస్తారు. కానీ, కొత్త రకం రోడ్లవల్ల, వాటి మీద వేగంగా పయనించే కార్లు, లారీల వల్ల కుటుంబాలే
చిన్నాభిన్నం అవుతున్నాయి.
రిస్క్ బెనిఫిట్ విశ్లేషణ చెయ్యాలి
మన దేశీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రవాణా విధాన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేయడానికి వివిధ రవాణా వ్యవస్థల వల్ల కలిగే ఖర్చులు, ప్రయోజనాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే కాస్ట్ బెనిఫిట్ విశ్లేషణతో పాటు రిస్క్ బెనిఫిట్ విశ్లేషణ కూడా చెయ్యాలి. సామాన్యులకు ఉపయోగపడని, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే రవాణా వ్యవస్థ మీద విలువైన ప్రజాధనం ఖర్చు చేయటం ప్రజాస్వామ్య విరుద్ధం. హైస్పీడ్ ఆటోమొబిలిటీ వల్ల వాయు కాలుష్యం, వాతావరణ మార్పు, ప్రమాదాలు, రద్దీకి సంబంధించిన జాప్యాలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలతో సామాజిక నష్టాలు కూడా ఉన్నాయి. సుస్థిర అభివృద్ధిలో, సామాజిక న్యాయంలో తగిన రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూడా కీలక పాత్ర ఉన్నది.
కానీ, ప్రభుత్వం గుర్తించడం లేదు. కోట్లు ఖర్చుపెట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేసి కడుతున్న రహదారులు ఎవరికి ఉపయోగపడుతున్నాయని కూడా ఆలోచించడం లేదు. రహదారులు అభివృద్ధి చేస్తే ప్రజా రవాణా ఎందుకు కుంటుపడుతున్నది అనే ప్రశ్నకు జవాబు ఇచ్చే నాయకుడు లేదు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 70 శాతం ప్రజలకు బస్సు ప్రధాన రవాణా సాధనం. అయితే, తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఒకప్పుడు మంచి ప్రయాణ వ్యవస్థను అందించింది.
క్రమంగా, బస్సుల సంఖ్య తగ్గుతున్నది. 2018-–19లో దాదాపు 11 వేల బస్సులు ఉంటే 2022-–23 నాటికి అవి తగ్గి 8,571 అయినాయి. ఇందులో పనిచేస్తున్న బస్సులు చాలా తక్కువ. తెలంగాణ ప్రభుత్వం 2024–-25 బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం రూ.3,082 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంతకు ముందు 2022-–23లో ఆర్టీసీకి అయిన ఖర్చు రూ.122.50 కోట్లు మాత్రమే. 2014 నుంచి నిర్లక్ష్యం చేసిన ఈ కేటాయింపులు ఇప్పుడైనా పెంచాల్సిన అవసరం ఉన్నది.
రవాణా వ్యవస్థను అభివృద్ధి చెయ్యాలి
కాలుష్యాన్ని నియంత్రించడానికి భారత ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రోత్సహిస్తోంది. 2018-–19లో ఒక్కో బస్సుకు రూ.1 కోటి వరకు సబ్సిడీని అందించింది. ఆ పథకం కింద తెలంగాణ ఆర్టీసీ 40 బస్సులను తీసుకోవడానికి ముందుకు వచ్చింది. కానీ, వాటిని కొనుగోలు చేయకుండా అద్దె ప్రాతిపదికన తీసుకుంది. లాక్‌డౌన్ సమయంలో నాలుగు నెలల పాటు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆదాయం పుంజుకుంటున్న పరిస్థితులలో ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం శోచనీయం. టీజీఆర్టీసీ విద్యుత్ బస్సులను కొనుగోలు చేయడానికి అనుమతించే బదులు వాటిని లీజు ప్రాతిపదికన మాత్రమే తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన సబ్సిడీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ల రూపంలో కొన్ని అదనపు నిధులను అందించినట్లయితే బస్సులను కొనుగోలు చేసి నడిపితే ప్రయాణికులకు సులభంగా ఉండేది. సంస్థకు కూడా ఆదాయం పెరిగేది. భారతదేశంలో ప్రస్తుత ఎలక్ట్రిక్ బస్సుల ధర రూ. 30లక్షల నుంచి రూ. 2.20 కోట్ల వరకు ఉంది అని సమాచారం. ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు ఉందో పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది.
బస్సుల సంఖ్య తగ్గి.. వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగింది
విద్యుత్ బస్సులతో కూడిన ప్రజా రవాణా వ్యవస్థను, కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రం మొత్తానికి విస్తరించాలి. రాబోయే బడ్జెట్లో కనీసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తూ, ప్రతి సంవత్సరం విధిగా కేటాయింపులు చేసి, సంస్థను స్వతంత్రంగా పనిచేసే విధంగా సంస్కరించాలి. ప్రజా రవాణా మీద పెట్టుబడులు పెడితే విస్తృత ఫలితాలు లభ్యం అవుతాయి. విద్య, వైద్యం తదితర వసతులతో పాటు ప్రాథమిక రవాణా కూడా కీలకంగా మారింది.
బస్సుల సంఖ్య పెరగకపోవడం వల్ల వ్యక్తిగత వాహనాల కొనుగోలు పెరిగింది. కాలుష్యం పెరిగింది. జిల్లాలు, గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ మీద అధ్యయనాలు చేస్తూ, ప్రయాణాల ధోరణిని బట్టి బస్సుల రవాణా వ్యవస్థను అభివృద్ధి చెయ్యాలి. తెలంగాణ అభివృద్ధి, అసమానతలు పోవాలన్నా, సమతుల్య అభివృద్ధి కావాలన్నా, పర్యావరణ అనుకూల అభివృద్ధికి బాటలు వేయాలన్నా విద్యుత్ బస్సులను ప్రోత్సహించడమే ఉత్తమ మార్గం.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్