వనపర్తి, వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రేవల్లి, గోపాల్ పేట, శ్రీరంగాపురం, పెబ్బేరు, పెద్దమందడి, ఖిల్లాఘణపురం మండలాలకు చెందిన 259 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గొల్ల, కురుమల ఆర్థికవృద్ధికి సబ్సిడీపై గొర్రెపిల్లలు, మత్య్సకారుల అభ్యున్నతి కోసం ఉచిత చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దళితుల ఆర్థిక స్వావలంబన కోసం దళితబంధు పథకం అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు పలుస రమేశ్ గౌడ్, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
పేట వాసికి థాయిలాండ్ డాక్టరేట్
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా కు చెందిన మఠం రాజ్ కుమార్‌కు థాయిలాండ్ గవర్నమెంట్ నుంచి ఉత్తమ డాక్టరేట్ దక్కింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇండో థాయిలాండ్ వాస్తు బృహస్పతి అవార్డుతో పాటు థాయ్ లాండ్ హానర్ డాక్టరేట్‌ను ఆదివారం థాయ్ మేయర్ ఇంగ్ బటవా అందజేశారు.
కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారిన రాజగోపాల్
మహబూబ్‌నగర్, వెలుగు :కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్ట్ కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేసి బీజేపీలో చేరాడని కాంగ్రెస్ లీడర్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. బాలానగర్‌లో జోడోయాత్ర లంచ్ బ్రేక్ సందర్భంగా మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ ఝార్ఖండ్‌లో చంద్రగుప్త బొగ్గు గనుల కోసం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి, బై ఎలక్షన్ వెళ్లారని విమర్శించారు. రూ.18 వేల కోట్లకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశి సంస్థతో బీజేపీ క్విడ్-ప్రోకో డీల్ కుదిరిందని ఆరోపించారు. ఈ కంపెనీలో రాజగోపాల్‌రెడ్డి భార్య, ఆయన పిల్లలకు 99.9 శాతం వాటాలున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, కరపత్రాన్ని మీడియాకు చూపించారు.
ఏపీకి లిక్కర్ తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
అయిజ, వెలుగు: ఏపీకి కర్నాటక లిక్కర్ తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. గద్వాల ఎక్సైజ్ సీఐ గోపాల్ వివరాల ప్రకారం.. ఏపీలోని ఎమ్మిగనూరుకు చెందిన మహబూబ్, జాఫర్, రసూల్ ఆదివారం కర్నాటకలోని రాయచూర్ జిల్లా తలమారి నుంచి 12 కార్టన్ల ఓసీ విస్కీని మూడు బైకులపై ఏపీకి తరలిస్తున్నారు. అయిజ మండలం రాజాపురం శివారులో రూట్‌వాచ్ నిర్వహిస్తున్న ఎక్సైజ్ సిబ్బందిని వారి వాహనాలను ఆపి తనిఖీ చేయగా.. లిక్కర్ కార్టన్లు పట్టుబడ్డాయి. వీటని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపాల్ తెలిపారు.
స్టూడెంట్స్ కరాటే నేర్చుకోవాలి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచే కరాటే నేర్చుకోవాలని సినీ హీరో సుమాన్ సూచించారు. ఆర్కే స్పోర్ట్స్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం కరాటే స్టూడెంట్లకు బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటేతో మానసికంగా, శరీరకంగా దృఢంగా ఉంటారన్నారు. ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా బాలికలకు స్కూల్ లెవల్ నుంచే కరాటే శిక్షణ ఇప్పించాలన్నారు. పట్టణంలో వేల మందికి ట్రైనింగ్ ఇస్తున్న మాస్టర్ రవికుమార్‌ను అభినందించారు. అంతకుముందు అకాడమీ వాళ్లు సుమన్‌ను సన్మానించారు.
ఆర్‌ఎంపీ ఆత్మహత్య
అయిజ వెలుగు : ఓ ఆర్ఎంపీ మత్రాలయంలోని లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రాలయం ఎస్సై వేణుగోపాల వివరాల ప్రకారం.. అయిజ మండలం సింధనూరు గ్రామానికి చెందిన కిషోర్ కుమార్(35) ఆదివారం ఉదయం కర్నూల్ జిల్లాలోని మంత్రాలయానికి వెళ్లాడు. అక్కడ లాడ్జి అద్దెకు తీసుకున్న ఆయన మధ్యాహ్నం వరకు బయటకి రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి కిటికీ తలుపులు తెరచి చూశాడు. ఫ్యాన్‌కు పంచతో ఉరి వేసుకొని ఉండడంతో పోలీసులకు చెప్పాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చి పోస్టుమార్టం కోసం ఎమ్మిగనూరుకు తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు.
ఇథనాల్ కంపెనీతో నష్టమే
మరికల్, వెలుగు : ఇథనాల్ కంపెనీతో నష్టమే తప్ప లాభం లేదని, ఆపేందుకు అందరూ ఏకం కావాలని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ అధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న కంపెనీ పూర్తయితే జీవ వైవిద్యం దెబ్బతినడంతో పాటు పంటలకు కొత్త రకాల తెగుళ్లు సోకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోయిల్‌సాగర్ నీళ్లు సగం కంపెనీకే పోతాయని, ఆయకట్టు రైతులు ఆగం అవుతారని వాపోయారు. అంతేకాదు చెరువులను నింపే పరిస్థితి కూడా ఉండదన్నారు. ఫలితంగా బోర్లలో నీటిమట్టం తగ్గి పంటలు ఎండిపోతాయన్నాయి. కంపెనీ పక్క నుంచే వెళ్లే మన్నె వాగులో వ్యర్థాలు వదిలే ప్రమాదం ఉందని, ఇదే జరిగితే పరివాహక ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పనులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు డి.చంద్రశేఖర్, ఖలీల్, సరోజన, ఎం.వెంకట్రాములు, రాఘవచారి, ఆంజనేయులు, సుదర్శన్, రాజు, యాదగిరి, మురళి, చక్రవర్తి, చింతలయ్య, మణివర్దన్‌రెడ్డి, రాజవర్దన్‌తో పాటు 32 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
ఉల్లి పంటను దున్నేసిన రైతు
వర్షాలు, తెగుళ్ల కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు పంటలను దున్నేస్తున్నారు. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడుకు చెందిన రాముడు తనకున్న 4 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. వర్షాల కారణంగా ఉల్లిగడ్డ ఆశించిన స్థాయిలో ఊరకపోవడంతో ఆదివారం ట్రాక్టర్‌తో పంటను తొలగించాడు. రూ. 1.50 లక్షల పెట్టుబడి పెట్టినట్టు రైతు వాపోయాడు. బొంకూర్ గ్రామానికి చెందిన మరో రైతు 5 ఎకరాల్లో పత్తి పంటను వేశాడు. రూ.2 లక్షల పట్టుబడి పెట్టినా.. పూత, పిందెలు రాకపోవడంతో పంటను దున్నేశాడు.
- అలంపూర్, వెలుగు
వైభవంగా అలంకారోత్సవం
వనపర్తి, వెలుగు: సీసీ కుంట మండలం అమ్మాపూర్‌లో వెలసిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో తొలిఘట్టమైన అలంకారోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆత్మకూరు ఎస్‌బీఐ లాకర్‌లో భద్రపరిన స్వర్ణాభరణాలకు దేవదాయశాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి బయటకు తీశారు. వీటిని పూజారులు తలపై పెట్టుకొని కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా కురుమూర్తి కొండపైకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేల సంఖ్యలో హాజరైన భక్తులు కోలాటాలు, భజనలు చేస్తూ గోవిందుడిని స్మరించుకున్నారు. మరోవైపు నుంచి అమరచింతకు చెందిన పద్మశాలి వంశస్తులు నేసిన పట్టు వస్త్రాలను ఊరేగింపుగా దేవాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆభరణాల లెక్క చూసుకొని.. పట్టువస్త్రాలతో సహా స్వామిని అలంకరించారు. ఆ తర్వాత భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ ఉత్సవాల్లో ముక్కెర వంశస్థుడైన శ్రీ రాంభూపాల్‌తో పాటు ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి దంపతులు , ఆత్మకూర్, అమరచింత మున్సిపల్ చైర్ పర్సన్స్ గాయత్రి రవికుమార్ యాదవ్, మంగమ్మ నాగభూషణం, నేతలు జి.మధుసూదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
సదర్ సంబురాలు
అమనగల్లు, వెలుగు: ఆమనగల్లు పట్టణంలో సదర్ సంబురాలు ఉత్సాహంగా జరిపారు. ఆదివారం శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముందుగా బైక్ ర్యాలీ తీశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నిర్వహించిన దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దున్నపోతులకు ప్రత్యేక పూజలు చేశారు. జడ్పీటీసీలు అనురాధ, విజితా రెడ్డి, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గిరి యాదవ్ పాల్గొన్నారు.