ఎవుసం చేసే రైతులకు అనారోగ్యం, అప్పులే మిగులుతున్నాయ్

పురుగుమందులమ్ముతున్న కంపెనీదారులు, దుకాణదారులు ధనవంతులవుతుండగా, వాటిని వేల రూపాయలకు కొని పంటల మీద చల్లుతున్న అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. విష రసాయనాల ప్రభావంతో అనేక రోగాల బారిన పడి కాలం చేస్తున్నారు. ఎవుసం చేసే రైతులకు అనారోగ్యం, అప్పులు, పేదరికమే మిగులుతున్నది. రైతుల ఆర్థిక, ఆరోగ్య సంక్షోభానికి కారణమవుతున్న విష రసాయనాల వాడకంపై ప్రభుత్వాలు విధానపర నిర్ణయం తీసుకోవాలి.

పురుగుమందుల వాడకం వ్యవసాయదారుల ప్రాణం మీదకొస్తున్నది. విష రసాయనాల వల్ల గ్రామీణ భారతంలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. సంఖ్యాపరంగా ఇది రైతుల ఆత్మహత్యల కంటే చాలా పెద్దది.  ఏటా పెరుగుతున్న వీటి వాడకం వల్ల పండిన పంటలోనూ పురుగుమందుల అవశేషాలు మిగిలి ఉంటున్నాయి. ఆ ఆహార పదార్థాలు తింటున్న వారు రోగాల బారిన పడుతున్నారు. విష రసాయనాల వల్ల ఆహారం, నీరు, గాలి కలుషితమై జీవజలంపై ప్రత్యక్ష ప్రభావం పడుతున్నది. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వాలు విడుదల చేస్తున్న వార్షిక ఆరోగ్య గణాంకాల్లో ఈ రకమైన సమాచారం(డేటా) ఎక్కడా ప్రతిబింబించదు. ఏటా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రసాయనాల బారిన నేరుగా పడిన కేసుల సంఖ్య,  2020లో ఒక పరిశోధన పత్రంలో వేసిన అంచనా ప్రకారం  దాదాపు 7,40,000. వీటిని అన్​ఇంటెన్షనల్​ యాక్సిడెంటల్ ​పెస్టిసైడ్​ పాయిజనింగ్(యూఏపీపీ) కేసులుగా పరిగణిస్తారు. ఇందులో 7,446 మరణాలు, 7,33,921 ప్రాణాంతకం కాని కేసులు ఉన్నాయి. ఏటా 38.50 కోట్ల యూఏపీపీ కేసులు నమోదవుతాయని అధ్యయన రచయితలు అంచనా వేశారు. అంటే 86 కోట్ల మంది రైతుల్లో దాదాపు 44 శాతం మంది ఈ విష వ్యవసాయ రసాయనాల(పురుగుమందుల) బారిన పడుతున్నారు. దక్షిణాసియాలో, ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక యూఏపీపీ కేసులు నమోదయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం.. దేశంలో వ్యవసాయం/వృత్తి జనాభాలో వార్షిక యూఏపీపీ సంభవం 62 శాతం. దీన్ని బట్టి చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా11.89 కోట్ల మంది సాగుదారులు ఉండగా, విష రసాయనాల బారిన పడిన రైతుల సంఖ్య7.4 కోట్లు అవుతుంది. ఇది భారీ సంఖ్య. వివిధ రకాల సమాచారం నుంచి క్రోడీకరించిన అంచనా.

వివిధ ఏజెన్సీల నివేదికల్లో..

సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్(సీబీహెచ్ఏ), భారత ప్రభుత్వ ఏజెన్సీ,“నేషనల్ హెల్త్ ప్రొఫైల్(ఎన్​హెచ్ పీ)ని ప్రతి సంవత్సరం ప్రచురిస్తున్నది. కాకపోతే వ్యవసాయ రసాయనాల విష ప్రభావం గురించి నివేదించదు. ఈ ఎన్​హెచ్​పీ నివేదికలో సాధారణంగా జనాభా, సామాజిక- ఆర్థిక స్థితి, వ్యాధి, వ్యాధిగ్రస్తులు, మరణాలు, హెల్త్‌‌‌‌కేర్ ఫైనాన్స్ తదితర సమాచారం ఉంటుంది. ఈ వార్షిక నివేదికలో ఆత్మహత్యలు, పురుగుమందుల విషప్రయోగం కారణంగా సంభవించే మరణాలు లేవు. అది ఆశ్చర్యం కలిగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రసాయనాల దుష్ప్రభావం ఒక భారీ ఆరోగ్య సమస్యగా ఇప్పటికే గుర్తించారు. మన దేశంలో ఆసుపత్రుల్లో రైతులు, రైతు కూలీల సంఖ్య పెరుగుతున్నా.. దీని గురించిన కనీస సమాచారం సేకరించకపోవడం శోచనీయం. మరోవైపు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ విధించిన బాధ్యతలో భాగంగా మరణాలు, ప్రమాదాలు, ఆత్మహత్యలకు సంబంధించిన కేసుల్లో పోలీసు స్టేషన్ల ప్రమేయం ఉన్నందున నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) కొంత సమాచారం ఈ మధ్య నివేదిస్తున్నది. క్రిమిసంహారక రసాయనాల దుష్ప్రభావం భారతదేశంలో ఒక పెద్ద సమస్య. అయినా ఇది ఎన్సీఆర్బీ నివేదికలో పూర్తిగా ప్రతిబింబించదు. ఈ ప్రజారోగ్య సమస్యను వైద్య సంస్థలు, పోలీసు, వ్యవసాయ, ఇతర నియంత్రణ అధికారులు పట్టించుకుంటలేరు. కేసుల వివరాల సేకరణ పట్ల కూడా ఏ ఒక్క శాఖకు పట్టింపు లేదు. నియంత్రణ అధికారులకు కూడా అవగాహన లేదు. ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో ఎక్కడైనా వచ్చినప్పుడు, గ్రామీణుల అపరిశుభ్ర అలవాట్లతోనే  వచ్చాయని భావించడం డాక్టర్లకు అలవాటుగా మారింది. 

కొన్ని ఉదంతాలు

2002లో తెలంగాణాలోని వరంగల్ ప్రాంతంలో దాదాపు 500 మంది రైతులు పురుగుమందుల బారిన పడి చనిపోయారని అప్పట్లో మేము తయారు చేసిన నివేదికలో ఒక అంచనా.  2017లో యావత్మాల్(మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని ఒక జిల్లా) లో ఇదే రకమైన ఘటన జరిగింది. కేవలం రెండు నెలల కాలం లో దాదాపు 80 మంది రైతులు చనిపోయారు.1,200 మంది ఆసుపత్రి పాలయ్యారు. పక్క జిల్లా అమరావతిలో కూడా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు, ఆ తర్వాత కూడా నిత్యం మరణాలు, అనారోగ్యాలు కనపడుతూనే ఉన్నాయి. సాధారణంగా, విదర్భ ప్రాంతం పత్తి రైతు ఆత్మహత్యలకు ప్రసిద్ధి. గత16 ఏండ్లలో అక్కడి ఆరు జిల్లాల్లో దాదాపు14 వేల రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. 2017 నుంచి యావత్మాల్‌‌‌‌లో, ఇతర జిల్లాల్లో పెద్ద ఎత్తున రసాయనాల బారిన పడిన కారణంగా రైతుల మరణాలు, విష ప్రభావాలతో ఆ ప్రాంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. పురుగుమందుల మరణాలు, దీర్ఘకాలిక దుష్ప్రభావాల మీద మేము ఒక నివేదిక కూడా ఇచ్చాం. యావత్మాల్, నాగ్​పూర్, చంద్రపూర్, అమరావతి, బుల్దానా, భండారా, అకోలా జిల్లాల్లో ఇలాంటి కేసులు ఎక్కువ బయటపడ్డాయి. యావత్మాల్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. 2017లో జులై నుంచి సెప్టెంబరు వరకు, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యవసాయ రసాయన విషం వల్ల కలిగే వివిధ లక్షణాల కారణంగా రోజూ ఆసుపత్రిలో చేరడం అప్పట్లో సంచలనమైంది. మొదట్లో 19 మరణాలు నమోదయ్యే వరకు, ఎవరూ వాటిని సీరియస్​గా తీసుకోలేదు. దేవానంద్ పవార్, శేట్కారి న్యాయ్ హక్ ఆందోళన్ దీన్ని గమనించి సమస్యను ప్రజలు, మీడియా, ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. పత్తి చేన్లలో పురుగుమందులు పిచికారీ చేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలకు ఒళ్లు నొప్పులు, వాంతులు, కళ్ల మంటలు తదితర సమస్యలు ఏర్పడి వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. అప్పట్లో యావత్మాల్‌‌‌‌లోని ప్రభుత్వాసుపత్రిలోని వార్డులు, పడకలు రోగులతో నిండిపోయాయి.

బీజీ పత్తి విత్తనాలతో..

విదర్భ ప్రాంతం నుంచి వెయ్యికి పైగా కేసులు, దాదాపు 50 మరణాలను ఒక నివేదికలో పేర్కొన్నారు. అంతకు ముందు కూడా తీవ్ర రుగ్మతలతో ఇలాంటి కొన్ని ఘటనలు నమోదయ్యాయని స్థానికులు తెలిపారు. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ల దృష్టికి తీసుకు వెళ్లాక,  మీడియాలో విస్తృత ప్రస్తావన తర్వాత మరణాలకు నష్టపరిహారం, బాధిత కుటుంబాలకు ఉపశమనం కల్పించడంతోపాటు  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం వంటి పరిమిత ప్రయత్నాలతో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని, బాధితుల చికిత్స పట్ల తీసుకోవాల్సిన చర్యల మీద మేము అనేక సూచనలు చేశాం. యావత్మల్, పక్కనే ఉన్న ఆదిలాబాద్​జిల్లాలో ప్రత్యేక సదస్సులు నిర్వహించాం. రైతులు పురుగుమందులు బాగా వాడటానికి ప్రధాన కారణం బీటీ పత్తి విస్తృతంగా ఉండటం. బీటీ పత్తి హైబ్రిడ్ గింజలు ‘పనికి రాని’ నేపథ్యంలో 2017లో అనుమతి లేని బీజీ 3 విత్తన ప్యాకెట్లు విస్తృతంగా అమ్మారు. ఈ రకం పత్తి గింజల వ్యాప్తి మీద విచారణకు కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ క్షేత్ర పర్యటనలు చేసింది. బీజీ 3 విత్తనాల వల్ల కాయతొలిచే పురుగు విజృంబిస్తుందని ఆనాడే నిపుణులు హెచ్చరించారు. అనుకున్నట్టే, ఆ మరుసటి ఏడాదే పత్తిని ఆశించే పురుగుల సంఖ్య పెరగడంతో రైతులు దిక్కుతోచక పురుగుమందుల వాడకం పెంచారు. దీని వల్ల రైతుల ఆరోగ్యం దెబ్బతిని, కొందరు మరణించడంతో పాటు, ఆర్థికంగా చితికిపోయారు. ఆసుపత్రి ఖర్చులు పెరిగాయి. పత్తి దిగుబడి  తగ్గింది. గ్రామాల్లో అనారోగ్యం పెరిగింది. 

అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభావం..

అన్ని రాష్టాల్లో మహారాష్ట్ర తరహా దుష్ఫలితాలు కనపడుతున్నాయి. సమాచార సేకరణ లోపం స్పష్టంగా కనపడుతున్నది. మీడియా కూడా ఇలాంటి కేసుల గురించి దృష్టి పెట్టకపోవటం వల్ల పరిస్థితి తీవ్రత తెలుస్తలేదు. ఆసుపత్రుల్లో కేసుల నమోదు ప్రక్రియ సక్రమంగా లేదు. వివరాలు వాస్తవానికి భిన్నంగా ఉంటున్నాయి. పురుగుమందుల గురించి వైద్య సిబ్బందికి అవగాహన లేదు. రైతులు విష ప్రభావంతో ఆసుపత్రి పాలు అయితే ఇవ్వాల్సిన చికిత్స పట్ల శ్రద్ధ లేదు. విషానికి ఇచ్చే విరుగుడు మందుల స్టాకు ఉండటం లేదు. అవి తగిన మోతాదులో క్రమంగా ఇస్తే బాధితులు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నా, చికిత్సలో పాటించాల్సిన పద్ధతుల మీద అవగాహన లేక, నిర్లక్ష్యంతో, పని భారంతో బాధితుల మరణాలకు వారూ కారణం అవుతున్నారు. 
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్