ముంచుకొస్తున్న  ఆహార సంక్షోభం

ముంచుకొస్తున్న  ఆహార సంక్షోభం

వాతావరణ మార్పులు, కరోనా లాంటి మహమ్మారులు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, ఎడారీకరణ, ప్రకృతి విపత్తులతో సుమారు 258 మిలియన్ల మంది ఆకలి బాధ ఎదుర్కొన్నారని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ క్రైసిస్ రిపోర్ట్ చెబుతున్నది.‌‌ ముఖ్యంగా 7 దేశాలు సోమాలియా, సౌత్ సూడాన్, అఫ్గానిస్తాన్, బురాఖాఫానో, హైతీ, నైజీరియా, యమన్ వంటి దేశాల్లో ఈ ఆహార సంక్షోభం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వరుసగా గత నాలుగేండ్లుగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఆహార సంక్షోభం, ఆహార ధాన్యాల కొరత వెంటాడుతున్నది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలతో పాటు, మరికొన్ని పేద దేశాల్లో ఆకలి ఆక్రందనలు ఆకాశాన్నంటుతున్నాయి.‌‌

ద్రవ్యోల్బణం పెరిగి

రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో సప్లై చైన్ ఫెయిల్ అయింది. ముఖ్యంగా గోధుమ పంట దిగుబడి తగ్గింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరిగాయి. ప్రపంచంలోనే ఎరువులు తయారీ, ఎగుమతుల్లో రష్యాదే అగ్రస్థానం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎరువులు ఎగుమతులు తగ్గడం ద్వారా ధరలు పెరిగాయి.‌‌ తదునుగుణంగా ఆహార ధాన్యాలు, పప్పులు, ఆయిల్ ధరలు పెరిగాయి.‌‌ దీంతో పేద దేశాలకు ఆహార ధాన్యాల అందుబాటు తగ్గింది. మిగిలిన ప్రజలపై ధరాభారం పెరిగింది.‌‌ ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. గత నాలుగేండ్లుగా కొవిడ్ వెంటాడుతున్న నేపథ్యంలో చాలా దేశాల్లో నేటికీ పూర్తి స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడలేదు. కొన్ని చోట్ల రోజుకు కనీసం 175 రూపాయల వేతనం దొరకడం కూడా కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు మూడు పూటలా తిండి లేని స్థితిలో నిద్రిస్తే, మరికొందరు క్షుద్భాతతో కొన ఊపిరి వదులుతుండటం చాలా బాధాకరం.  ఇంకా మనలాంటి దేశంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం( చౌక ధరల దుకాణాలు) ద్వారా కొంతమేరకు ఆహార పదార్థాలు అందుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ఆకలి కేకలు ఎక్కడా పెద్దగా లేవు. అయితే  దేశంలో 28 కోట్ల మంది ఆకలి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 

ప్రభుత్వాలు స్పందించాలి

ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ కల్పనతోపాటు కనీసం ఉపాధి హామీ పథకాలను మెజార్టీ ప్రజలకు అందుబాటులోకి తేవాలి. చిన్న, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. విద్య, వైద్యం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.‌‌ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయాలి. పంట మార్పిడి విధానం అమలు చేయాలి. ఒకే పంట పలు దశాబ్దాల తరబడి పండించడం వల్ల నేల నిస్సారంగా మారి, దిగుబడులు తగ్గిపోతున్నాయి. ప్రజలు కూడా కేవలం బియ్యం, గోధుమ వంటి ఆహార పదార్థాలు తినడానికి బదులు ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు, పప్పులు తీసుకోవాలి. చిరు ధాన్యాలను దైనందిన జీవితంలో ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు దొరుకుతాయి. ఇతర ఆహార ధాన్యాల ధరలు అదుపులోకి వస్తాయి. రైతులకు లాభసాటిగా ఉంటుంది.  క్లైమేట్ ఛేంజ్ వలన భవిష్యత్తులోనూ పంటలపై పెను ప్రభావం ఉండబోతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 

కాబట్టి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పంటల సాగు మార్పు చేసుకోవాలి. దిగుబడి కాలాన్ని తగ్గించుకోవాలి. తక్కువ నీటితో పండే పంట రకాలను సాగు చేయాలి. ఉన్న నీటి వనరులను కాపాడుకోవాలి.  నూతన టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నూతన వ్యవసాయ పద్ధతులు, నూతన విత్తనాలు, ఎరువులు, వంగడాలు వంటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలి. ప్రభుత్వాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాలు కొరత రాకుండా చూడాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. రైతులకు భరోసా కల్పించాలి.‌‌ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. పంట బీమా, భద్రత రైతులకు కల్పించాలి. ప్రభుత్వాలు రైతులకు శిక్షణ, అవగాహన, ఆర్థిక సహకారం అందించడం ద్వారా ఆహార భద్రత సాధ్యమవుతుంది. 
-
  ఐ.ప్రసాదరావు