పేదలు చావాల్సిందేనా..ప్రభుత్వాలు పట్టించుకోవా..?

విశ్లేషణ

‘ఆత్మహత్యలన్నీ హత్యలే, కాకపోతే.. వీటిలో నిందితులెవరో అప్పటికప్పుడు తెలియదు, వెతికి పట్టడం అంత తేలిక కాదు. స్థూలంగా సమాజమే ముద్దాయి’ అంటాడో సామాజిక వేత్త! ఇదెంత పచ్చి నిజం! వ్యక్తులు, దంపతులు, కుటుంబాలు.. ఇలా లెక్కలేనంత మంది రోజూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరికీ పట్టడం లేదు. ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. చచ్చేంత దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న దీనుల్ని ఆదుకునే వ్యవస్థలే లేవు. ఉన్న వ్యవస్థల్ని కూడా పాలకులు విధ్వంసం చేస్తుంటే దాదాపు అన్ని వయసుల వారూ దిక్కులేని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకీ దురవస్థ? అని ఎవరూ ప్రశ్నించడం లేదు. దీని వెనుక బలమైన కారణాలేమై ఉంటాయి? ఓ శాస్త్రీయ పరిశీలన లేదు. లోతైన అధ్యయనమూ లేదు. సర్కార్లకు సమస్య పరిష్కరించే చిత్తశుద్ధి లేదు. 

పేదరికం, దైనందిన సమస్యలు, పెరిగిపోతున్న ఆర్థిక–సామాజిక అసమానతలు, మోసాలు, ద్రోహాలు, వేధింపులు, అనారోగ్యాలు, అవమానాలు, చీత్కారాలు.. ఇలా రకరకాల కారణాలతో నిండు జీవితాల్ని అర్దాంతరంగా చాలిస్తున్నారు. అభం, శుభం తెలియని చిన్నారుల్ని నిర్దయగా చంపి మరీ చస్తున్నారు. పత్రికల్లో వస్తున్న ఒక్కో కథ చదువుతుంటే కడుపు తరుక్కుపోయేంత బాధ! అయ్యో.. ఇలా అయితే బతికే వారేమో? అలా ఎవరైనా ఓ మాట సాయం చేసుంటే ప్రాణాలు నిలిచేవేమో? పదివేల అప్పు పుట్టుంటే భార్యా–భర్త బతికుందురేమో? అనిపించడం సహజం! ‘నీ పొలం ఓ ఎకరం అమ్మితే...  నీకున్న అప్పుకు నాలుగింతలు డబ్బు వస్తుంది, చావకు’ అని ఎవరైనా చెప్పుంటే రైతు చచ్చేవాడు కాదేమో? అని మనకే అనిపించిన సందర్భాలు కోకొల్లలు! కానీఅలా జరగటం లేదు. ఎవరూ ఎవర్నీ అనునయించటం లేదు, ఆత్మహత్య చేసుకోకుండా నిలువరించలేకపోతున్నారు. ఎక్కడో గట్టి లోపమే ఉంది.

పేదరికం శాపమైతే.. ప్రజాస్వామ్యమెందుకు?

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన17 సుస్థిరాభివృద్ది లక్ష్యాల్లో మొదటిది ‘పేదరిక’ నిర్మూలన, రెండోది ‘ఆకలి’ లేకుండా చేయడం. పౌరులందరికీ సమానావకాశాలు కల్పించాలని భారత రాజ్యాంగం చెబుతోంది. సంపద ఒకచోట పోగు కాకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని ఆదేశిక సూత్రాలు చెబుతాయి. కానీ, వాస్తవంలో జరిగేది అందుకు పూర్తి విరుద్ధం. మన ప్రభుత్వ విధానాలు ధనవంతుల్ని మరింత సంపన్నులుగా, పేదల్ని ఇంకా నిరుపేదలుగా మారుస్తున్నాయి. దేశంలోని 77 శాతం సంపద10 శాతం మంది దగ్గర పోగుపడింది.100 కోట్లకు పైబడి ఆస్తులున్న సంపన్నులు 2000 సంవత్సరంలో 9 మంది ఉంటే, ఇప్పుడా సంఖ్య119 కి చేరింది. 2018‌‌‌‌–22 మధ్య, రోజూ 70 మంది కొత్తగా లక్షాధికారులయ్యారు. దేశంలోని 50 శాతం జనాభాకు దక్కుతున్నది జాతీయ సంపదలో13 శాతమే! కేవలం వైద్య ఖర్చుల భారం వల్ల ఈ దేశంలో ప్రతి సెకనుకు ఇద్దరు(అంటే ఏటా 6.3 కోట్ల మంది) దారిద్ర్య రేఖ దిగువకు జారిపోతున్నారని ఆక్స్​ఫామ్ నివేదిక చెబుతోంది. కరోనా కష్టకాలంలో ఉద్యోగాలు–ఉపాధులు పోయి, వర్తక–వాణిజ్యాలు మునిగి, సాగు కుదేలై.. రకరకాల కారణాలతో18 నుంచి 20 కోట్ల మంది బలవంతంగా దారిద్ర్య రేఖ కిందకు నెట్టివేయబడ్డారు. అదే సమయంలో.. దేశంలో అతి సంపన్నులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలతో పాటు ఎందరో పారిశ్రామికవేత్తల సంపదలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ఆశ్రితవర్గ పెట్టుబడులు, వారసత్వ సంపద వృద్ధి ఈ అసమానతలకు ముఖ్య కారణం. రియల్టర్ల పదఘటనల్లో భూములమ్ముకునే యజమానులు కౌలు రైతులవుతున్నరు.  రైతులు రైతు కూలీలవుతున్నారు. కూలీలు బతుకుదెరువు దొరక్క వలసలతో ఆగమవుతున్నారు. గత మూడు దశాబ్దాల ప్రైవేటు‌‌‌‌–ఆర్థిక–సరళీకరణ మార్కెట్ విధానాల వల్ల ఈ అంతరాలు అసాధారణ స్థాయిలో పెరిగాయి. పేదరికాన్ని తొలగించడానికి బదులు, పేదల్ని చీదరించుకొని కార్పొరేట్లకు కార్పెట్లు పరిచే పరిస్థితులు దేశంలో బలపడుతున్నాయి.

బాధ్యత లేనితనమే!

ఆవులు పొలంలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా? అప్పు తప్పని చెప్పటం లేదు ప్రభుత్వాలు. ఉత్పాదకతతో ముడివడని రుణాలు, వడ్డీల చక్రబంధనంలో జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. సర్కార్లే... చట్టాల్ని సవరించి, నిబంధనల్ని వంచించి మరీ తలకు మించిన అప్పులు తెస్తున్నాయి. రాబోయే రెండు, మూడు తరాల వారికీ అప్పుభారాన్ని ఇప్పటి నుంచే అంటగడుతున్నాయి. తన లాగే, అప్పు చేసి పప్పుకూడు తినమంటున్నాయి పౌరుల్ని. పోనీ, ఆ అప్పులకైనా సవ్యమైన వ్యవస్థ ఉందా అంటే, అదీ లేదు. వందల కోట్లు కొల్లగొట్టే బడా వ్యాపారులకు మన బ్యాంకులు తలుపులు బార్లా తెరుస్తాయి.  రైతులు, చేతి వృత్తుల వాళ్లు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలాంటి వారికి ప్రభుత్వ వ్యవస్థీకృత బ్యాంకింగ్ రంగంలో అప్పు పుట్టడం గగనమే! దొరికినా.. వేధింపులు, చెల్లింపు జాప్యమైతే అవమానాలు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ జీవితాలెన్నో! ఇక, దిక్కులేక ప్రైవేటు అప్పులకు వెళ్లిన వారి బతుకులు నరకమే! లెక్కకు మించిన వడ్డీలు, చక్రవడ్డీలతో రుణపాశం యమపాశమై సామాన్యుల బతుకుల్ని కాటేస్తోంది. ఇటీవలి కాల్(మనీ) నాగుల కాటుకు బలైన మహిళల మానాలు, భరించ శక్యం కాని అవమానాలు, కడకు ఆత్మబలిదానాల.. వాటికి లెక్కే లేదు. ఈ దుర్మార్గాలను నియంత్రించే వ్యవస్థ లేదు. అవసరమైన కొత్త చట్టాలు తేరు. ‘మనీ లెండింగ్ యాక్ట్’ వంటి ఉన్న చట్టాలను అమలుపరచరు. కంపెనీలు, కార్పొరేట్లకే ‘దివాలా’ తీసే వెసులుబాటు! విధిలేక, జరుగుబాటుకు అప్పులు తెచ్చి, ఊబిలో కూరుకుపోయిన సామాన్యుల్ని ఆదుకునే ఏ చిన్న ప్రయత్నమూ సర్కారు వైపు నుంచి సాగదు.

సర్కార్లకు సవాల్!

‘మానవ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’అన్న కమ్యూనిస్ట్ యోధుడు కారల్ మార్క్స్ మాటల్ని ప్రస్తుత సమాజం అక్షరాలా నిజం చేస్తోంది. సమష్టి కుటుంబ వ్యవస్థ చితికిపోయి, క్యూబికల్ ఫ్యామిలీ పద్ధతి వచ్చాక విలువలు, మానవ సంబంధాలు వికలమయ్యాయి. ఆర్థిక, సామాజిక విషయాల్లో పరస్పరం ఉపయోగపడుతూ చేదోడు–వాదోడుగా ఉంటూ వస్తున్న మన సంప్రదాయిక ‘సోషల్ నెట్​వర్క్’ ఇప్పుడు బలహీనపడింది. కష్టాల్లో నలిగే పేదలు, బలహీనులు దిక్కులేని వారవుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో.. భూమిలేని, ఇళ్లు లేని, ఉపాధిలేని, డబ్బులేని కుటుంబాలు ఎలా బతకాలో తెలియక అలమటిస్తున్నాయి. వారి బతుకులు.. భూమ్మీద అతిపెద్ద, ప్రగతిశీలమని చెప్పుకునే మన ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నాయి. పోనీ చస్తూ తగ్గిపోతున్నారు పేదలని చంకలు గుద్దుకుందామా! అది పద్ధతా? చావకుండా నిరుపేదల్ని, దిక్కులేని వారిని ఆదుకునే ఏదో ఒక మార్గాంతరం ఉండాలి.. రాచరిక కాలంలో కూడా దీనులకు కనీసం ఒక ధర్మగంట ఉండేది, అంతకన్నా మన ప్రజాస్వామ్యం అధ్వాన్నమయిందా? అన్న ప్రశ్న సర్కార్లకు ఒక సవాల్!

రుణ విమోచన కమిషన్​ ఏమైంది?

మాజీ శాసనసభ్యుడొకరు తలుపు తడితే,  హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో తెలంగాణలో రుణ విమోచన కమిషన్(రువిక) పునరుద్ధరణ జరిగింది. మరేమయింది? అదిపుడు పనిచేయడం లేదు. చేజేతులా దాన్ని నిర్వీర్యం చేశారు. పాతబస్తీలో,  ఆ మాటకొస్తే చాలా చోట్ల.. చిన్నా చితకా వ్యాపారులకు ఉదయం100 రూపాయల అప్పు (నిజానికి రూ.90 చేతికిస్తారు) ఇచ్చి, సాయంత్రం120 వసూలు చేస్తారు రుణ దళారులు. అంటే, నికరంగా 30 శాతం రోజువారీ వడ్డీ! ఇటువంటి అన్యాయాలకు చెక్​పెట్టే వ్యవస్థల్ని ఇపుడు లేకుండా చేశారు. పేదరికం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించాల్సిందే. ఆ ప్రయత్నం ఎక్కడా జరగటం లేదు. బయటకు అలా కనిపించే ప్రభుత్వాల పథకాలన్నీ తాత్కాలిక తాయిలాలే తప్ప పేదరికానికి శాశ్వత పరిష్కారాలు కావు. మధ్య తరగతిలో ఒక వర్గంది కొని తెచ్చుకున్న సమస్య! సంపద లేమికి తోడు అభివృద్ధి కాంక్ష, సౌఖ్యాల మోజు మనిషిలో ఆశల్ని పెంచుతోంది. తాహతుకు మించి డబ్బు వ్యయం చేస్తూ ఊబిలో కూరుకుపోతున్నారు. సమకాలీన సంపన్నులతో పోల్చుకొని, అనవసర హంగులకు, హెచ్చులకు పోయి చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. వాస్తవికంగా జీవించడం నేర్చుకోవాలి.

- దిలీప్ రెడ్డి.
dileepreddy.r@v6velugu.com