వడ్డెరలను పట్టించుకోని ప్రభుత్వాలు : ఇత్తడి మారయ్య

లక్ష్మణచాంద, వెలుగు : వడ్డెర జాతిని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇత్తడి మారయ్య, జేఏసీ చైర్మన్ దండి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మణచాంద మండలంలోని ఓ ఫంక్షన్ హాల్​లో ఆదివారం జిల్లా అధ్యక్షుడు సంపంగి ప్రభాకర్ అధ్యక్షతన వడ్డెర సంఘం కులస్తులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో వీరు పాల్గొని మాట్లాడారు. దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందమైన రోడ్లు కనిపిస్తున్నాయని, కానీ అందుకు శ్రమ పడ్డ వడ్డెర జాతి మాత్రం ఏ పార్టీకి కనిపించడంలేదన్నారు.

ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ జాతిని గుర్తించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. నాయకులు గండ్ల శేఖర్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సంపంగి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు వేముల గురువయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.