ఏపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా పారదర్శక పాలన అందిస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారిగా ప్రారంభ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నవరత్నాలతో ఏపీ ప్రజలకు డైరెక్టుగా నిధులు అందించామన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు.
జీఎస్‌డీపీలో దేశంలోనే ఏపీ టాప్ ప్లేస్లో ఉందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రతి ఏటా 11.43 శాతం జీఎస్‌డీపీ వృద్దిరేటు సాధించిందని పేర్కొన్నారు. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగిందన్నారు. రాష్ట్ర ఆర్ధికపరిస్థితి నాలుగేళ్లుగా మెరుగుపడిందని గవర్నర్ చెప్పారు. ఏపీలో పారదర్శకంగా పాలన సాగుతుందని..ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు చేరుతున్నాయన్నారు. పరిశ్రమలు , వ్యవసాయం, సేవా రంగంలో గణనీయమైన అభివృద్దిని సాధించినట్టుగా గవర్నర్ వివరించారు. మన బడి , నాడు-నేడు ద్వారా తొలి దశలో రూ.3669 కోట్లతో ఆధునీకీకరణ చేపట్టామన్నారు. అమ్మఒడి ద్వారా 80 లక్షల పిల్లలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్ల ఆర్ధిక సహయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
డిజిటల్ లెర్నింగ్ కోసం విద్యార్ధులకు రూ. 690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్ లను పంపిణీ చేశామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. 2020--21 విద్యా సంవత్సరం నుండి పాఠ్యాంశాల సంస్కరణలు అమలు చేస్తున్నట్లు వివరించారు. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల రీడిజైన్ చేసినట్టుగా గవర్నర్ పేర్కొన్నారు. జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది కలగనుందని వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అమలు చేస్తున్నామన్నారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ, విజయనగరంలో జేఎన్‌టీయూ- గురజాడ, ఒంగోలులో ఆంధ్రకేసరి , కడపలో వైఎస్ఆర్ అర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ, కర్నూల్ లో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు.
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అంతేకాదు నామినేటేడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మహిళల భధ్రత కోసం దిశ యాప్ ను ప్రారంభించామన్నారు. అటు వైద్య శాఖ ద్వారా 1.4 కోట్ల మందికి హెల్త్ కార్డులు అందించామని గవర్నర్ తెలిపారు. రూ.971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహలను అందిస్తున్నామని గవర్నర్ వివరించారు. మహిళల పేరుతో 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. ఇల్లు కట్టుకునేందుకు 5 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. వీటితో పాటు..ఇండ్లకు విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి నెల 1వ తేదీన వైఎస్ఆర్ పెన్షన్ ను అందిస్తున్నామన్నారు. 64.45 లక్షల మందికి రూ.66,823.79 కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని గవర్నర్ వెల్లడించారు. రూ.9900 కోట్లతో నాలుగేళ్లుగా ఏడాదికి రూ.15 వేల చొప్పున అమ్మఒడి పథకం కింద అందిస్తున్నామన్నారు. ప్రతీ చేనేత కుటుంబానికి ఏటా వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా రూ.24 వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. వైఎస్సార్ మత్సకార భరోసా రూపంలో మత్సకారులకు రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నామన్నారు. అలాగే వారికిచ్చే డీజిల్ లో సబ్సిడీ కూడా ఇస్తున్నామన్నారు. మత్సకారులు చనిపోయే ఇచ్చే పరిహారం రూ.10 లక్షలకు పెంచామన్నారు. జగనన్న చేదోడు ద్వారా నాయీ బ్రహ్మణులు, టైలర్లకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ బీమా పథకం ద్వారా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు బీమా అందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నామన్నారు.