ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. కరెంట్ ఛార్జీల పెంపుపై గవర్నర్ కీలక ప్రకటన

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. కరెంట్ ఛార్జీల పెంపుపై గవర్నర్ కీలక ప్రకటన

విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గుడ్ న్యూస్ చెప్పారు.  2025-26లో రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపు ఉండదని ఆయన ప్రకటించారు. 2025, ఫిబ్రవరి 24న ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసగించారు. ఈ సందర్భంగానే ఆయన కరెంట్ ఛార్జీల పెంపుపై పై ప్రకటన చేశారు. 

‘‘ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వ తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారు. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది’’ అని అన్నారు.

 ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేశామని గుర్తు చేశారు. అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడుతున్నామని.. మా ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అవకాశాలిస్తే ప్రతిఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం.. అందుకే ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.  

బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం.. స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని తెలిపారు. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. అధికారం చేపట్టగానే పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేశామని పేర్కొన్నారు. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్‌ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వ్యాఖ్యానించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని పేర్కొన్నారు. 

పేదరిక నిర్మూనలకు వినూత్న విధానంతో ముందుకెళుతున్నామని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 నినాదాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టామని.. ఇందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించామని గుర్తు చేశారు. ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సృష్టిపై ఫోకస్‌ పెట్టామని చెప్పారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్‌ సోలార్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్‌ చేస్తున్నట్లు తెలిపారు.