
- నేడో రేపో ఉత్తర్వులు.. దానికి అనుగుణంగా త్వరలోనే జాబ్ నోటిఫికేషన్లు
- ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ
- త్వరలోనే రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు
- ధ్రువీకరించిన రాజ్‌భవన్ వర్గాలు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు రాజముద్ర పడింది. తెలంగాణ ఉభయసభల్లో పాసైన బిల్లును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఆమోదించారు. దీంతో ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. గవర్నర్ఆమోద ముద్ర పడిన కాపీ ప్రభుత్వానికి చేరినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. నేడో, రేపో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయనున్నది. ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు ఇవ్వనున్నది. ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, 18న అసెంబ్లీ ఆమోదించింది. 19న కౌన్సిల్ ఆమోదం తెలిపిన అనంతరం ఈ బిల్లు రాజ్ భవన్‌కు చేరింది.
3 గ్రూప్‌లుగా ఎస్సీ వర్గీకరణ
జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీటిని ఉన్నది ఉన్నట్లుగా ఎస్సీ వర్గీకరణ బిల్లులో పొందుపరిచారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288 శాతం కాగా, వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు.
మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.748 శాతం ఉండగా.. 9 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963 శాతం కాగా, వీరికి 5 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. దీంతో ఇన్నాళ్లూ పెండింగ్పడిన ప్రభుత్వ జాబ్నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేసేందుకు డిపార్ట్మెంట్లవారీగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారవర్గాలు చెప్తున్నాయి.
రాష్ట్రపతికి బీసీ రిజర్వేషన్ బిల్లులు
విద్య, ఉద్యోగాలు, లోకల్బాడీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల 17న అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించి.. రాజ్‌భవన్‌కు పంపిన బిల్లులు ప్రస్తుతం గవర్నర్వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ..బీసీ రిజర్వేషన్బిల్లులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. కాగా, బీసీ రిజర్వేషన్ బిల్లులపై ఇప్పటికే న్యాయసలహా తీసుకున్న గవర్నర్..దానిని త్వరలోనే రాష్ట్రపతికి పంపనున్నట్లు రాజ్‌భవన్ వర్గాల ద్వారా తెలిసింది.