గందరగోళం .. ఆర్టీసీ బిల్లుపై సందిగ్ధం

హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తూ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది.  రేపు సాయంత్రంలోగా అసెంబ్లీ సెషన్ ముగుస్తుంది. అప్పటిలోగా రాజ్ భవన్ నుంచి గవర్నర్ సంతకం చేసిన బిల్లు వస్తుందా..? లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక వేళ ఆలస్యమైతే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను పొడిగిస్తుందా..? లేదా..? అన్న చర్చకూడా నడుస్తోంది. 

సర్కారు వాదన ఇది..

ప్రస్తుత అసెంబ్లీ సెషన్ లో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ విలీనం చేసుకోవాలని భావించామని, ఇందుకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ చేపట్టి బిల్లును సిద్ధం చేశామని చెబుతోంది. ఫైనాన్స్ బిల్లు కావడంతోనే గవర్నర్ కాన్సెంట్ కోసం పంపామని అంటోంది. రెండు రోజులుగా గవర్నర్ తమిళిసై తన అభిప్రాయాన్ని చెప్పకుండా కాలయాపన చేస్తోందని చెబుతోంది.  గవర్నర్ తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేక వైఖరితో మిగతా బిల్లులు ఆపినట్టే ఆర్టీసీ బిల్లును ఆపి ఇటు ప్రభుత్వాన్ని, అటు ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శిస్తోంది. 

ఏపీ బిల్లు అధ్యయనం 

గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు ఆర్టీసీ బిల్లు చేరింది. అయితే దానిని ఆమె అధ్యయనం చేస్తున్నారని సమాచారం. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఫైలును తెప్పించుకొని స్టడీ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? కాన్సెంట్ ఇస్తారా..? ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తారా..? అనేది హాట్ టాపిక్ గా మారింది.