
- మహబూబ్ కాలేజీలో వివేకానంద దివస్లో గవర్నర్ జిష్ణుదేవ్
పద్మారావునగర్, వెలుగు: స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో, రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయి అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న తన జీవితంలోనే తొలిసారిగా ఓ బహిరంగ సభను ఉద్దేశించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో ప్రసంగించారని గవర్నర్ గుర్తుచేశారు.
మహబూబ్ కాలేజీలో వివేకానంద దివస్ సందర్భంగా గురువారం మహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, రామకృష్ణ మఠం సంయుక్తంగా నిర్వహించిన యూత్ కన్వెన్షన్లో గవర్నర్ ప్రసంగించారు. అమెరికాలోని చికాగోలో జరిగిన విశ్వమత సభలో స్వామీజీ ప్రసంగానికి నాంది మహబూబ్ కాలేజీలో చేసిన ప్రసంగమే అని చెప్పారు. యువత స్వామీజీ చూపిన బాటలో నడవాలని, ఆయన కలలను సాకారం చేయాలని సూచించారు.
హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మాట్లాడుతూ.. స్వామీజీ బోధనలు చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి వస్తుందని తెలిపారు. స్వామీజీ స్ఫూర్తితో నిర్భయత్వం, త్యాగగుణం అలవర్చుకోవాలని యువతకు ఆయన సూచించారు. భారత్ ను విశ్వగురువు చేయాలని స్వామీజీ కన్న కలలను యువత సాకారం చేయాలని బోధమయానంద పిలుపునిచ్చారు.
బోల్టన్ స్కూల్ చైర్మన్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ కు స్వామీజీ పేరు పెట్టాలని, చౌరస్తాలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.