భద్రాచలంలో ఘనంగా శ్రీరాముడి పట్టాభిషేకం

భద్రాచలంలో ఘనంగా శ్రీరాముడి పట్టాభిషేకం
  • భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ పట్టాభిషేకం
  • రాజవస్త్రాలు అందజేసిన గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌వర్మ
  • భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి రాముడు మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో సోమవారం శ్రీరామపట్టాభిషేకం ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ హాజరై ప్రభుత్వం తరఫున రాజవస్త్రాలు సమర్పించారు. ముందుగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల మధ్య స్వామివారిని పట్టాభిషేక మండపానికి తీసుకొచ్చారు. అనంతరం 10.30 గంటలకు పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, సంప్రోక్షణ నిర్వహించారు. పట్టాభిషేక క్రతువులో భాగంగా ముందుగా శ్రీరామ పాదుకలను సమర్పించారు. 

అనంతరం రాజదండం, రాజముద్రిక, శ్రీరాముడికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకుపతకం, లక్ష్మణుడికి శ్రీరామమాడ సమర్పించారు. తర్వాత స్వామివారికి చామరం, బంగారు ఛత్రం, రాజఖడ్గాన్ని అందజేశారు. చివరగా సామ్రాట్‌‌ కిరీటాన్ని రామయ్యకు ధరింపజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భక్తరామదాసు వారసులు, త్రిదండి చినజీయర్​స్వామి తరఫున జీయర్‌‌ మఠం, అహోబిల మఠాధిపతులు, ఉత్తరాది, కంచి కామకోటి పీఠం, రాజా తూము లక్ష్మీనర్సింహదాసు వారసులు పట్టాభిరాముడికి పట్టువస్త్రాలు అందజేశారు. రాములవారి పట్టాభిషేక కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

దీంతో ‘జయజయ రామా.. జానకి రామా, పావన నామా... పట్టాభిరామా’ అంటూ భక్తులు ఆనందంలో మునిగితేలారు. కార్యక్రమానికి ఎంపీ పోరిక బలరాంనాయక్‌‌, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, ఎండోమెంట్‌‌ కమిషనర్‌‌ శ్రీధర్, కలెక్టర్‌‌ జితేశ్‌‌ వి.పాటిల్‌‌, ఎస్పీ రోహిత్‌‌రాజు, ఐటీడీఏ పీవోబి.రాహుల్, ఈవో రమాదేవి పాల్గొన్నారు.  పట్టాభిషేకం అనంతరం రాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహించారు. విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన రథంలో స్వామివారిని ప్రతిష్ఠించి రాజవీధిలో ఊరేగించారు. నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సీతారామచంద్రస్వామికి మహదాశీర్వచనం నిర్వహించనున్నారు. కల్యాణం అనంతరం మూడో రోజు ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  

అద్భుతం.. ట్రైబల్‌‌ మ్యూజియం : గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్‌‌ మ్యూజియంను సోమవారం గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌‌కు ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌‌ మాట్లాడుతూ... గిరిజన సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రైబల్‌‌ మ్యూజియంను ఏర్పాటు చేయడం పట్ల ఐటీడీఏ పీవో బి.రాహుల్‌‌ను అభినందించారు. 

ఇలాంటి మ్యూజియాలు భావితరాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మ్యూజియంను ఆధునికీకరించాలని, గిరిజనుల ఉత్పత్తులకు, వారి తయారు చేసిన కళాఖండాలకు మార్కెటింగ్‌‌ సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల వస్తువులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్‌‌ జితేశ్‌‌ వి.పాటిల్‌‌, పీవో రాహుల్‌‌ ఉన్నారు.