శిల్పారామంలో 106 షాపులతో...ఇందిరా మహిళా శక్తి నైట్​ బజార్​

  • నేడు ప్రారంభించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ​, సీఎం 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని శిల్పారామంలో దాదాపు 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ ప్రారంభం కానున్నది. ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ల చేతుల మీదుగా దీన్ని ప్రారంభించనున్నారు. ఈ  నేపథ్యంలో మహిళా శక్తి నైట్ బజార్ ను  సీఎస్​ శాంతి కుమారి బుధవారం సందర్శించారు. ఏర్పాట్ల పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక బృందాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్ల ను ఏర్పాటు చేయాలని గతంలోనే సీఎం ఆదేశించారు.

 ఇప్పటి కే స్టాల్స్​ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో, వాటిని సీఎస్ పరిశీలించారు. స్టాల్ నిర్వాహకులకు, సందర్శకులకు తాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నైట్ బజార్ లో లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నైట్ బజార్ లో స్వయం శక్తి మహిళా సంఘాలు చేసిన పిండి వంటకాలు, హస్తకళలు, మహిళలు స్వయంగా తయారు చేసిన పలు ఉత్పత్తులకు చెందిన స్టాల్స్, పలు శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు.