- స్వచ్ఛభారత్‌లో ప్రజలు, ఆఫీసర్లు భాగస్వాములు కావాలి
- తెలంగాణలో తన తొలి గ్రామ పర్యటన ఓబుల్ కేశవాపూర్ కావడం ఆనందంగా ఉంది
- జనగామ జిల్లా పర్యటనలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
జనగామ, వెలుగు : తెలంగాణ ప్రజలు మంచి మనసున్న వాళ్లని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వచ్ఛ భారత్ కోసం ప్రజలు, ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి, గొప్ప విజయాలు సాధించాలని సూచించారు. గురువారం ఆయన జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఆఫీసర్లు, కవులు, కళాకారులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. జిల్లా సమగ్రాభివృద్ధిపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం గవర్నర్ మాట్లాడారు. కవులు, కళాకారులు, ప్రఖ్యాతిగాంచిన గొప్ప వ్యక్తులు పుట్టిన జనగామ గడ్డపైకి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ఓబుల్ కేశవాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు
జనగామ మండలంలోని ఓబుల్ కేశవాపూర్ వెంకటేశ్వరాలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎంపీ కడియం కావ్య, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, డీసీపీ రాజమహేంద్రనాయక్, అడిషనల్ కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేశ్‌కుమార్ స్వాగతం పలికారు. కళాకారుల కోలాటం నడుమ ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం ఆడిటోరియంలో గ్రామస్తులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణలో తన తొలి పర్యటన ఓబుల్ కేశవాపూర్‌లో జరగడం ఆనందంగా ఉందన్నారు. ఓబుల్ కేశవాపూర్ తమ ప్రిన్సిపల్ సెక్రటరీ ఊరని, ఆయన ఈ గ్రామ అభివృద్ధి పై చూపుతున్న శ్రద్ధ అభినందనీయం అన్నారు.
అభివృద్ధి పథంలో తెలంగాణ
యాదాద్రి, వెలుగు : తెలంగాణ అభివృద్ధి పథంలో సాగుతోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. గురువారం యాదాద్రి జిల్లాలో పర్యటించిన గవర్నర్ కలెక్టరేట్‌లో అవార్డు గ్రహీతలు, ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులపై కలెక్టర్ హనుమంతు జెండగే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గవర్నర్ మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా, సంస్కృతిపరంగా జిల్లా ప్రసిద్ధి చెందిందన్నారు. పద్మశ్రీ అవార్డులు పొందిన ప్రముఖులు యాదాద్రి జిల్లాలో ఎక్కువ మంది ఉండడం అభినందనీయం అన్నారు.