- పూల మొక్కలు, బొకేలతో ఆహ్వానం పలికిన మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధులు, అధికారులు
- రామప్ప శిల్పకలను చూసి మంత్ర ముగ్ధుడైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- కళాసంపదను కాపాడుకోవాలని పిలుపు
ములుగు, వెంకటాపూర్ (రామప్ప),రేగొండ, వెలుగు : తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన జిష్ణుదేవ్‌వర్మ తొలిసారిగా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మంగళవారం పర్యటించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ములుగు జిల్లాకు వచ్చిన గవర్నర్ కు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ములుగు కలెక్టర్ టీ.ఎస్ దివాకర, ఎస్పీ శబరీశ్ పూలమొక్కలు, బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి టెంపుల్‌లో పూజలు చేసిన అనంతరం గవర్నర్ రోడ్డు మార్గంలో ములుగులోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
గిరిజన సాంప్రదాయ నృత్యాలతో గవర్నర్ కు ఆహ్వానం పలికారు. అనంతరం కలెక్టరేట్ వద్ద గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడే ఆయన జిల్లాస్థాయి ఆఫీసర్లతో గంట సేపు ఇంటరాక్ట్ అయ్యారు. కలెక్టర్ దివాకర జిల్లా ఆభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాలో చేపట్టిన వారికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్, ములుగులో ఏర్పాటు చేసిన ట్రైబల్ యూనివర్సిటీ, సమ్మక్క సారలమ్మ జాతర ప్రాముఖ్యత వివరించారు.
ఆ తర్వాత ములుగు ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో గవర్నర్ జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇంటాక్ కన్వీనర్ పాండు రంగారావు, రచయిత డాక్టర్ రాచర్ల గణపతి, డాక్టర్ అంబటి శ్రీజన్, రెజ్లింగ్ క్రీడాకారిణి చల్ల మౌనిక, జిమ్నాస్ట్ పి.రజిత, వాలీబాల్ జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ పాలడుగు వెంకటేశ్వరరావు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ కాజంపురం దామోదర్, సోషల్ వర్కర్ కొమరం ప్రభాకర్, ఇంటర్నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత డాక్టర్ కొండల రామయ్య తదితరులు గవర్నర్‌తో మాట్లాడారు. అనంతరం రామప్ప ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.
గుడి ప్రాంగణాలను పరిశీలిస్తూ రామప్ప శిల్ప కలను చూసి మంత్రముగ్ధులయ్యారు. స్తంభాలు కాంతివంతంగా ఉండడంతో ఇదిఎలా సాధ్యమైందని గవర్నర్ ప్రశ్నించారు. ఇది పాలిష్ కాదని, స్తంభాలపై కాంతి పడి, గుడిలో కాంతి ఏర్పడుతుందని, దీనివల్ల శివలింగం అద్భుతంగా కనిపిస్తుందని ప్రొఫెసర్ పాండురంగారావు వివరించారు. టెంపుల్ నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీటిపై తేలాడుతాయని, ఆ కాలంలోనే లైట్ వెయిట్ ఇటుకలతో గుడి నిర్మించడంవల్ల ఇప్పటికీ పటిష్టంగా ఉందని చెప్పారు.
గర్భగుడి ద్వారం వద్ద శిల్పాన్ని తాకి చేసి సరిగమపదనిస రాగాలను గవర్నర్ విన్నారు. కాగా, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గవర్నర్గ్రీవెన్స్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ములుగు జిల్లా జర్నలిస్టుల ఆధ్వర్యంలో గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మకు వినతిపత్రం అందజేశారు.
కాకతీయ కళాసంపదను కాపాడుకోవాలి..
భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు గణపేశ్వరాలయాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ కు వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గణపేశ్వరుడికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం గణపేశ్వారాలయం ఆవరణలో తవ్వకాలలో బయటపడ్డ శిల్పాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ కాకతీయుల కళా సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ పేర్కొన్నారు. అనంతరం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు పరిశీలించారు. వేలాడే వంతనపై నడుచుకుంటూ వెళ్లారు. మంగళవారం రాత్రి అక్కడే హరిత కాకతీయ హోటల్‌లో రాత్రి బస చేశారు.
జాతర జాతీయ హోదాకు కృషి చేయాలి : మంత్రి సీతక్క
ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం మహాజాతరకు జాతీయ పండుగ హోదా వచ్చేలా సహకరించాలని గవర్నర్‌ను రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు. ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి కోటి మంది భక్తులు వస్తారని వివరించారు. గవర్నర్‌గా మొదటిసారే ములుగు జిల్లాకు రావడంపై జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, జిల్లా అడిషనల్ కలెక్టర్ పి శ్రీజ, డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలన
కాశీబుగ్గ/ జనగామ అర్బన్, వెలుగు : నేడు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నందున మంగళవారం సాయంత్రం వరంగల్ డీసీపీ సలీమా దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో భద్రకాళి ఆలయ ఏఈవో శేషు భారతి, ప్రధాన అర్చకులు శేషు తదితరులున్నారు. జనగామ జిల్లాలో 29న గవర్నర్పర్యటన నేపథ్యంలో ఓబుల్‌కేశ్వాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిధిలోని మినీ ఆడిటోరియంలోని ఏర్పాట్లను కలెక్టర్రిజ్వాన్బాషా షేక్, అడిషనల్కలెక్టర్పింకేశ్కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షించారు.