- స్వచ్చ భారత్ కార్యక్రమం కాదు.. అదొక ఉద్యమం
- మహిళా సాధికారతపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది
- 2047 నాటికి వికసిత్ భారత్ కావాలి
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నల్గొండ, వెలుగు : సమాజంలో ఉన్న ప్రతిఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, పలువురు ప్రముఖులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ముఖాముఖికి గవర్నర్ హాజరయ్యారు. ఆయనకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్వాగతం పలికారు.
అనంతరం గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందన్నారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనతను 2024 నాటికి 21 శాతానికి తగ్గించడం అభినందనీయమన్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలను అందజేస్తే గ్రామీణ ప్రాంత ప్రజల్లో రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 475 గ్రామపంచాయతీలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషకరమన్నారు. స్వచ్ఛభారత్ అనేది ఒక కార్యక్రమం కాదని, అదొక ఉద్యమం అన్నారు.
ఇలాంటి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. మహిళా సాధికారితపైనే భవిష్యత్ ఆధారపడి ఉందని, స్వయం శక్తితో ఉపాధి కల్పించుకొని విజయాలు సాధించిన మహిళలను సమాజానికి తెలియజేయాలని సూచించారు. ప్రతిఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు అయితే వికసిత్ భారత్ సాధ్యమన్నారు. స్టూడెంట్లకు విద్యతో పాటు చేతివృత్తులకు సంబంధించిన చిన్న చిన్న వస్తువుల తయారీ వంటివి నేర్పితే వారు ఇంకా విజ్ఞాన వంతులు అవుతారన్నారు. 2047 నాటికి ఇండియా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, వికసిత్ భారత్ కావాలని ఆకాంక్షించారు.
అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సాధించిన ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు వారి వారి రంగాల్లో చేసిన కృషిని గవర్నర్‌తో పంచుకున్నారు. కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ పాల్గొన్నారు.
వేగంగా అభివృద్ధి చెందిన తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలోనే వేగంగా అభివృద్ధి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఐటీ, ఫార్మా ,సైన్స్ రంగాల్లో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని, వ్యవసాయంలో సైతం ముందుందన్నారు. ప్రతి సంవత్సరం 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించి ఐదేండ్లలో 30 లక్షల ఎకరాల ఆయకట్టు రెడీ చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాను రోల్ మోడల్‌గా మార్చడమే తమ లక్ష్యమన్నారు.