ఘనంగా నారసింహుడి చక్రస్నానం..పూర్ణాహుతికి హాజరైన గవర్నర్‌‌‌‌

ఘనంగా నారసింహుడి చక్రస్నానం..పూర్ణాహుతికి హాజరైన గవర్నర్‌‌‌‌
  • అష్టోత్తర శతఘటాభిషేకంతో  నేడు ముగియనున్న  ఉత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదోరోజైన సోమవారం ఉదయం ప్రధానార్చకులు నల్లంతీగళ్‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో వేదపండితులు, పారాయణికులు, రుత్వికులు, యజ్ఞాచార్యులు మహాపూర్ణాహుతిని నిర్వహించారు.

అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా విష్ణుపుష్కరిణి వరకు తీసుకెళ్లారు. అక్కడ లక్ష్మీనరసింహులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చక్ర తీర్థస్నానం నిర్వహించారు. కలెక్టర్‌‌‌‌ హనుమంతరావు, ఈవో భాస్కర్‌‌‌‌రావు భక్తులతో కలిసి పుష్కరిణిలో స్నానాలు చేశారు.

భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. సాయంత్రం నిత్యారాధనలు ముగిసిన అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి శ్రీపుష్పయాగం నిర్వహించారు. అనంతరం దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు జరిపారు. కార్యక్రమాల్లో చైర్మన్‌‌‌‌ నరసింహమూర్తి, ఈవో భాస్కర్‌‌‌‌రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌‌‌శర్మ పాల్గొన్నారు.

మహాపూర్ణాహుతిలో పాల్గొన్న గవర్నర్

బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన మహాపూర్ణాహుతికి గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ హాజరయ్యారు. హైదరాబాద్‌‌‌‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరిన గవర్నర్‌‌‌‌ ఉదయం 11.10 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్‌‌‌‌ హనుమంతరావు స్వాగతం పలుకగా, పోలీసుల గౌరవ వందనం సమర్పించారు.

అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్‌‌‌‌కు ఈవో భాస్కర్‌‌‌‌రావు ఆలయ మర్యాదలతో, ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగళ్‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు పూర్ణకుంభంతో  స్వాగతం పలికారు. మొదట ధ్వజస్తంభానికి మొక్కిన గవర్నర్‌‌‌‌ తర్వాత గర్భగుడిలోకి వెళ్లారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం ప్రధానాలయ ముఖ మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో స్వామి వారి ప్రసాదం, శేష వస్త్రాలు, నారసింహుడి ఫొటోను అందజేశారు. అనంతరం ప్రధానాలయ ఈశాన్య దిశలో ఏర్పాటు చేసిన యాగశాలకు చేరుకుని మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు కంకణధారణ చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈవో క్యాంప్ ఆఫీస్‌‌‌‌కు వెళ్లిన గవర్నర్‌‌‌‌ అక్కడ ఆఫీసర్లతో ముచ్చటించారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు రోడ్డు మార్గం గుండా హైదరాబాద్‌‌‌‌కు వెళ్లారు.

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం స్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహించనున్నారు. దీంతో 11 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి.