అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి : గవర్నర్ జిష్ణు దేవ్‌‌‌‌ వర్మ

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి : గవర్నర్ జిష్ణు దేవ్‌‌‌‌ వర్మ

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్‌‌‌‌, వెలుగు : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికీ అందాలని, అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని గవర్నర్‌‌‌‌ జిష్ణు దేవ్‌‌‌‌ వర్మ చెప్పారు. శుక్రవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లలో జిల్లా అధికారులు, ప్రముఖులు, కళాకారులు, రచయితలు, క్రీడాకారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌‌‌‌ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యలాగే తానూ పర్యావరణ వేత్తగానే కెరీర్‌‌‌‌ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమన్న భావన అందరిలో ఉండాలని చెప్పారు. ఖమ్మం జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు బాగుందని ప్రశంసించారు. 

చెట్లు మానవజీవనానికి ఎంతగానో ఉపయోగపడుతాయని, ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలని సూచించారు. ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందన్నారు. డబ్బుతో మాత్రమే అభివృద్ధి సాధ్యం కాదని ఇందుకు సమయం, మంచి విజన్, చిత్తశుద్ధి  అవసరం అన్నారు. జిల్లా అభివృద్ధిలో ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్య,  వైద్య రంగాల్లో ఖమ్మం మెరుగైన స్థానంలో ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలపై వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొటో ఎగ్జిబిషన్‌‌‌‌ను గవర్నర్‌‌‌‌ తిలకించారు. 

2047 నాటికి వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌ కావాలి

సమాజం అంటే సంపద మాత్రమే కాదని, సంస్కృతి అని గవర్నర్‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్‌‌‌‌లో గవర్నర్‌‌‌‌ మాట్లాడుతూ 2047 నాటికి దేశం వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌ కావాలని ఆకాంక్షించారు. స్టూడెంట్లకు చదువుతో పాటే పలు చేతి వృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. భద్రాద్రి జిల్లాలో కొండరెడ్ల అభివృద్ధిపై ఫోకస్‌‌‌‌ పెట్టాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతమైన ఈ జిల్లాలో విద్య, వైద్యం, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే గిరిజనులు అభివృద్ధిలోకి వస్తారన్నారు. 

కమ్యూనిటీ హెల్త్​సెంటర్లు సక్రమంగా నడిచేలా, ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్‌‌‌‌, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావ్‌‌‌‌, గవర్నర్‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ బుర్ర వెంకటేశం, కలెక్టర్లు ముజమ్మీల్‌‌‌‌ఖాన్‌‌‌‌, జితేశ్‌‌‌‌ వి.పాటిల్‌‌‌‌, ఐటీడీఏ పీవో రామూల్‌‌‌‌, ఎస్పీ రోహిత్‌‌‌‌రాజ్‌‌‌‌, డీఎఫ్‌‌‌‌వో కృష్ణాగౌడ్‌‌‌‌ ఇతర ఆఫీసర్లు పాల్గొన్నారు.