
- పారిశ్రామికంగా వారిని మరింత శక్తివంతం చేయాలి
గచ్చిబౌలి, వెలుగు: మహిళలు కుటుంబ నిర్వాహకులు మాత్రమే కాదని, సమాజాన్ని నిర్మించేవారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళలను విద్య, వాణిజ్యం, పారిశ్రామిక రంగాల ద్వారా శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా వ్యాపారులకు కొత్త అవకాశాలు అందించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (సీఓడబ్ల్యుఈ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్‌లో ఉమెన్ ఇంటర్నేషనల్ సమిట్ ఆన్ ఎంట్రప్రెన్యూర్షిప్ (డబ్ల్యూఐఎస్ఈ) బీ2బీ ఎక్స్‌పో 2025ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, అంతర్జాతీయ సహకార భావనను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తున్నదని చెప్పారు.
మహిళా వ్యాపారవేత్తలకు టెక్నాలజీ ద్వారా సాధికారత కల్పించేందుకు చర్చిస్తున్న ఈ సమయంలో వ్యాపార భవిష్యత్తు డిజిటల్‌తో ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం అయిందని పేర్కొన్నారు. టెక్నాలజీ ద్వారా లింగ అసమానతలను తగ్గించుకోవాలని, కొత్త మార్కెట్లు తెరిచి వ్యాపారాల పరిధి పెంచుకోవాలని సూచించారు. మహిళలు జనాభాలో సగం ఉన్నారని, వికసిత మహిళలు లేకుండా వికసిత్ భారత్ ఊహించలేమన్నారు.
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: మంత్రి కొండా సురేఖ
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం మహిళా సాధికారతకు కట్టుబడి ఉందని.. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కు అనుకూల వాతావరణం కోసం సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళా సాధి కారత కోసం సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసు కుంటున్న చర్యలను వివరించారు. రాణి రుద్రమదేవి నుంచి నేటి వ్యాపారవేత్తల వరకు మహిళలు సమాజానికి వెన్నెదన్నుగా నిలిచారని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా ఐదేండ్లలో లక్ష మంది మహిళా కోటీశ్వరులను తయారు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, నైపుణ్యాభివృద్ధి అందజేస్తున్నట్టు చెప్పారు.