
- బ్రహ్మకుమారీస్ ప్రోగ్రాంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: న్యాయం, ధర్మంతోనే విజయాలు వరిస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆత్మను వికసింపజేస్తేనే ధర్మం వైపు అడుగులు వేయగలమని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్‌లో "మానసిక నియంత్రణతో వ్యక్తిగత విజయాల పెంపు" అంశంపై న్యాయ నిపుణులతో జరిగిన చర్చాకార్యక్రమం ముగింపు సభకు గవర్నర్ హాజరై, మాట్లాడారు.
"మనసును అదుపులో పెట్టుకున్నప్పుడే ఉన్నత స్థితికి చేరుకోగలం.సానుకూల ఆలోచన, పని, సేవ, దయ, విలువలు, నైతికత వంటివన్నీ ధర్మం ద్వారానే వస్తాయి. న్యాయవృత్తిలో కూడా ధర్మం ప్రధాన అంశం. చట్టంతో ధర్మం పెనవేసుకుని ఉంటుంది. ధర్మం, ప్రశాంత జీవనం గురించి విశ్వానికి చాటింది మనమే. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడమే నాగరికత లక్ష్యం" అని గవర్నర్ పేర్కొన్నారు.
అడ్వొకేట్ల ఆలోచనలు సానుకూలంగా ఉండాలి
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టి ప్రసంగిస్తూ.. అడ్వొకేట్లు ఆలోచనలు సానుకూలంగా ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కేసు అప్పగించే పార్టీలను అర్థం చేసుకుని క్లయింట్ చెప్పిన అంశాన్ని కోర్టుకు సరిగ్గా చెప్పగలిగితేనే కేసు గెలుస్తామన్నారు. త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్‌నాథ్ గౌడ్ మాట్లాడుతూ..రోజుకు 109 కేసులు చొప్పున 91 వేల కేసుల్ని పరిష్కరించి రికార్డుల్లో ఎక్కినట్లు చెప్పారు.
అందులో కేవలం 19 కేసులే అప్పీల్‌కు వెళ్లాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. ఈశ్వరయ్య, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి విజయ్‌సేన్‌రె డ్డి, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి బి.డి రాతి, సీనియర్ న్యాయవాదులు దేశాయ్ ప్రకాశ్ రెడ్డి, బీఎస్ ప్రసాద్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.