హైదరాబాద్, వెలుగు: మహిళా సాధికారతతోనే సమాజ సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళలు వృద్ధిలోకి వచ్చినప్పుడే భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వీ హబ్‌ను ఆయన సందర్శించారు. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌తో మాట్లాడారు. వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మహిళలకు సమాన అవకాశాలను కల్పిస్తూ.. వారి ఎదుగుదలకు తోడ్పడుతున్నదని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, అన్ని రంగాల్లో అభివృద్ధి జరగడానికి మహిళా పారిశ్రామికవేత్తలు చాలా కీలకమన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మహిళలకు.. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి రాష్ట్రం మార్గదర్శిగా ఉందని, వీహబ్ ఇనిషియేటివే అందుకు ఉదాహరణ అని అన్నారు. మహిళా శక్తి, మహాలక్ష్మి వంటి పథకాలతో వారి అభ్యున్నతికి పాటుపడుతున్నామని తెలిపారు.