టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా తెలంగాణ: గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా తెలంగాణ: గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ
  • ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్న ప్రభుత్వం
  • దావోస్​ ఒప్పందాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి
  • ఒకేరోజు 4  పథకాలు  ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడి
  • పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన​ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు

హైదరాబాద్​, వెలుగు:దావోస్ ఒప్పందాలతో తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ అన్నారు.  తెలంగాణను సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల కారణంగా కృష్ణా వాటర్ ట్రిబ్యునల్–-2 ఇటీవల ఇచ్చిన తీర్పు ఫలితంగా కృష్ణా నది జలాల్లో తెలంగాణ తగిన వాటా దక్కుతున్నదని , ఇది రాష్ట్రం సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు. 76వ గణతంత్ర వేడుకల్లో భాగంగా గవర్నర్‌‌ జిష్ణుదేవ్‌‌ వర్మ సికింద్రాబాద్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు.

సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్యంతో తెలంగాణ ముందుకు వెళ్తున్నదని అన్నారు. సమగ్ర కుటుంబ కుల గణన సర్వేను ప్రభుత్వం నిర్వహించిందని, ఆ సర్వే ఆధారంగా కొత్త విధానాలను రూపొందిస్తుందని తెలిపారు. తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తున్నదని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలు, రాజీవ్ గాంధీ సివిల్స్​ అభయ హస్తం, జాబ్​ క్యాలెండర్​ వంటివి అమలు చేస్తున్నదని వివరించారు. 4 పథకాలను ఒకేసారి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

Also Read : వర్సిటీలపై కేంద్రం పెత్తనాన్ని సహించం

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రజలకు అందిస్తున్నదని చెప్పారు. మెట్రో రైలు నెట్‌‌వర్క్ విస్తరణ,  మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఎలివేటెడ్ ఎక్స్‌‌ప్రెస్‌‌ వేలు, రీజినల్​ రింగ్ రోడ్డు నిర్మాణం–కనెక్టివిటీ రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయని​ ఆశాభావం వ్యక్తం చేశారు. 

జీసీసీఎస్​ కేంద్రంగా తెలంగాణ

దావోస్ శిఖరాగ్ర సమావేశంలో రూ.1.78  లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరిందని గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ తెలిపారు. ఐటీ, రెన్యూవబుల్​ ఎనర్జీ, ఫార్మా రంగాలు స్థిరమైన అభివృద్ధికి కేంద్రంగా రాష్ట్ర ఖ్యాతిని పటిష్టం చేశాయన్నారు. ఈ ప్రయత్నాలు 49,500 ఉద్యోగాలను సృష్టించి, తెలంగాణ పారిశ్రామిక వృద్ధిని ముందుకు తీసుకెళ్తాయని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ఐటీ, ఫార్మా పరిశ్రమలలో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్స్​ (జీసీసీఎస్)  కేంద్రంగా మారిందన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని, రైతులపై ఆర్థిక భారం తగ్గించేందుకు 27 రోజుల్లోనే 2 లక్షల  పంట రుణ మాఫీని అమలు చేసిందని తెలిపారు.  25 లక్షల 35 వేల 934 మంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం చేకూరిందని చెప్పారు. ప్రతి ఏటా ఎకరానికి రూ.12వేలు పెంచిన  రైతు భరోసా పెట్టుబడి  సాయం అందిస్తుందని తెలిపారు.  

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత

తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తున్నదని గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మ తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని స్థాపించడం ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచస్థాయి శిక్షణను అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే వారిని ప్రోత్సహించడానికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. గత ఏడాది కాలంలో 55 వేలకు పైగా  యువతీ, యువకులు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పొందారని చెప్పారు.

సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మ తెలిపారు. మహిళలు, ట్రాన్స్​జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు,  ఇంటర్నేషనల్​ స్కూల్స్​ ఏర్పాటు మొదలైన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ –2025ను రూపొందించిందని గవర్నర్​జిష్ణుదేవ్​ వర్మ తెలిపారు.

ఇది రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన, నమ్మకమైన, సరసమైన విద్యుత్తును అందించడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. తెలంగాణకు కళలు, సంస్కృతి, సాహిత్యం, జర్నలిజం రంగాల్లో అపారమైన సేవలందించిన ప్రముఖ వ్యక్తులు గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజు, సుద్దాల అశోక్ తేజ, ఎక్కా యాదగిరిరావు, పాశం యాదగిరి వంటివారిని సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వారికి  రూ.కోటి నగదు బహుమతి, ఫ్యూచర్ సిటీలో 300 చదరపు గజాల చొప్పున స్థలం, తామరపత్రాన్ని అందించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.  

ఐఏఎస్​లకు పురస్కారాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనతోపాటు పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన13 మంది అధికారులకు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం  ప్రత్యేక పురస్కారాలు అందజేసింది. గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ చేతుల మీదుగా ఐఏఎస్​లు పురస్కారాలు అందుకున్నారు.

ఇందులో ఐఏఎస్​లు నర్సింహారెడ్డి, వరుణ్​రెడ్డి, ముషారఫ్​ అలీ ఫారుఖీ, దురిశెట్టి అనుదీప్​, హరీశ్, ఇతర అధికారులు​ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్​ శాంతి కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.