తెలంగాణ వేగంగా డెవలప్​ అవుతోంది :గవర్నర్​ జిష్ణు దేవ్​ వర్మ

తెలంగాణ వేగంగా డెవలప్​ అవుతోంది  :గవర్నర్​ జిష్ణు దేవ్​ వర్మ
  • మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు భేష్: గవర్నర్​ జిష్ణు దేవ్​ వర్మ
  • రైతులకు ఉచిత విద్యుత్​ ఇవ్వడం అభినందనీయం

హనుమకొండ/వరంగల్/ములుగు, వెలుగు:  తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ అన్నారు. మహిళల ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. వ్యవసాయ రంగానికి  ప్రాధాన్యమివ్వడం,  రైతులకు ఉచిత విద్యుత్​ సరఫరా చేయడం అభినందనీయమన్నారు. బుధవారం గ్రేటర్​ వరంగల్ లో గవర్నర్​ పర్యటించారు. 

ములుగు నుంచి వరంగల్ ఎన్ఐటీకి చేరుకున్న గవర్నర్ కు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, సీతక్క స్వాగతం పలికారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టరేట్ లో  వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో గవర్నర్​ ఇంటరాక్ట్​ అయ్యారు. ఆ జిల్లాల్లో అమలు చేస్తున్న స్కీమ్​లు, అభివృద్ధి పనుల గురించి అధికారులు గవర్నర్​కు పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా  గవర్నర్​ మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కారు స్కీమ్​లను అమలు చేస్తున్న తీరు తనను ఆకట్టుకుందన్నారు. 

 వరంగల్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థికాభివృద్ధిలో ముందంజలో ఉన్నాయని, ఇంకా పురోగతి  సాధించాలని ఆకాక్షించారు. హిస్టారికల్​ సిటీ అయిన వరంగల్ అన్నిరంగాల్లో ముందుండాలని, వ్యవసాయరంగంలో మరింత  అభివృద్ధి చెందాలని సూచించారు. రైతులకు సోలార్​ వపర్​ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ యోజనను ప్రవేశపెట్టిందని, ఈ పథకంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆ తర్వాత జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, కవులు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు, సోషల్ యాక్టివిస్టులతో గవర్నర్​ చర్చాగోష్టిలో పాల్గొన్నారు. 

అనంతరం రెడ్​ క్రాస్​ ఆవరణలో తలసేమియా బిల్డింగ్​కు శంకుస్థాపన చేశారు. అలాగే, హనుమకొండలోని పద్మాక్షి ఆలయం, వేయి స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, ఖిలా వరంగల్ ను గవర్నర్​విజిట్​ చేశారు. కలెక్టరేట్​లో జరిగిన సమావేశంలో మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్​ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తీన్మార్ మల్లన్న, వరంగల్  మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్ సీపీ అంబర్​ కిశోర్​ ఝా, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారదా, గ్రేటర్  కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు.

ములుగు జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటా..   

ములుగు జిల్లాలోని ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసుకుంటానని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్​ రాత్రి లక్నవరం సరస్సు ఐలాండ్ లోని కాటేజీలో బస చేశారు. బుధవారం ఉదయం లక్నవరం సరస్సులో మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. 

అనంతరం గవర్నర్ ​మాట్లాడుతూ.. అటవీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పర్యాటకంగా ఎన్నో అద్భుతాలున్నాయని అన్నారు. ప్రకృతి అందాలతో లక్నవరం సరస్సు కనువిందు  చేస్తోందన్నారు. గొలుసు కట్టు చెరువులు కాకతీయుల ముందు చూపునకు నిదనమన్నారు.