యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడి దర్శనంతో మర్చిపోలేని గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి పొందానని తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నరసింహస్వామిని దర్శించుకుని ముఖ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలతో పాటు దేశప్రజలంతా బాగుండాలని, పాడి పంటలతో రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానని చెప్పారు. కొత్త గుడిలో స్వామివారి దర్శనం గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుందని, మరోసారి స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వస్తానని తెలిపారు.
స్నాన సంకల్పం, అఖండ దీపారాధనలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
హైదరాబాద్ రాజ్ భవన్ నుంచి నరసింహస్వామి దర్శనం కోసం రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు వచ్చిన గవర్నర్కు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ హనుమంతు కే.జెండగే పూల మొక్కలు బహూకరించి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్ప పూజలు చేశారు. ప్రధానాలయ ప్రాంగణంలో అఖండ జ్యోతి దీపారాధనలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
మహాద్వారం నుంచి ఆలయ అంతర మాడవీధుల్లోకి చేరుకున్న గవర్నర్ కు ఆలయ ఈవో భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు ఆలయ సంప్రదాయ రీతిలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో గవర్నర్ కు ఆలయ అర్చకులు, వేదపండితులు చతుర్వేద ఆశీర్వచనం చేశారు. ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు శాలువాతో సత్కరించగా, ఈవో భాస్కర్ రావు నారసింహుడి మెమొంటో, స్వామి శేష వస్త్రాలు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు.
ఇక గవర్నర్ పర్యటన సందర్భంగా 250 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ రాజేశ్చంద్ర పర్యవేక్షణలో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, పది మంది ఎస్ఐలతో పాటు సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, ఫారెస్ట్, డాగ్ స్క్వాడ్ బృందాలతో భద్రత కల్పించారు. ప్రధానాలయ ప్రాంగణంలో తప్ప ఆలయంలోకి మీడియాను సైతం అనుమతించలేదు. గవర్నర్ వెంట గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ జె.భవానీ శంకర్ ఉన్నారు.