- ఉన్నత విద్య మార్పులో మీదే కీలక పాత్ర
- ప్రతి 3 నెలలకు ఓ సారి మీటింగ్ నిర్వహిస్తా
- కొత్త వీసీలతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఉన్నత విద్య రూపు రేఖలను మార్చడంలో వైస్ చాన్సలర్ (వీసీ) లదే కీలక పాత్ర అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వీసీలు యూనివర్సిటీకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అభివర్ణించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వీసీలు రీచ్ కావాలన్నారు.
బుధవారం రాజ్ భవన్ లో నూతనంగా నియమితులైన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం, వీసీలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు.వర్సిటీల్లో నాణ్యమైన విద్య స్టూడెంట్స్ కు అందించాలని, రీసెర్చ్ లు పెంచాలని గవర్నర్ సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వీసీలతో మీటింగ్ నిర్వహిస్తానని తెలిపారు.
జిల్లాల్లో పర్యటించనున్న గవర్నర్
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురు, శుక్ర వారాల్లో సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని అధికారులు ఎంపిక చేసిన కవులు, కళాకారులు, ప్రముఖులు, మేధావులతో భేటీ కానున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ముఖ్య అధికారులతో సమావేశమైయి ప్రభుత్వ స్కీమ్ ల గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఇటీవల వరంగల్, ములుగు, జనగామ, యాదాద్రి జిల్లాల్లో పర్యటించిన గవర్నర్ ఇప్పుడు మరో 3 జిల్లాల్లో పర్యటించనున్నారు.
గవర్నర్తో మంత్రి ఉత్తమ్ భేటీ
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో రాజ్ భవన్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలు భేటీ అయ్యారు. ఉత్తమ్ జిల్లా సూర్యాపేట పర్యటనకు గురువారం గవర్నర్ వస్తున్నందున మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా చరిత్ర, ప్రాముఖ్యత, విశేషాలను ఆయనకు మంత్రి, ఎమ్మెల్యే వివరించినట్టు తెలుస్తోంది.