భద్రాచలం, వెలుగు: ఆంధ్రాలో విలీనమైనప్పటి నుంచి తమ పరిస్థితి దారుణంగా ఉందని పోలవరం ఆర్డినెన్స్ పేరుతో ఏపీలో కలిసిన గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకులపాడు పంచాయతీ ప్రజలు గవర్నర్ తమిళిసైకి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇల్లు కాలితే ఫైరింజన్ 100 కిలోమీటర్ల దూరం నుంచి రావాలని, అంబులెన్సుకు ఫోన్ చేస్తే 70 కిలోమీటర్ల నుంచి వచ్చేసరికి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలవాలంటే 450 కిలోమీటర్ల దూరంలోని పాడేరుకు పోవాలని, ఐటీడీఏకి వెళ్లాలంటే 200 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో ప్రయాణించాల్సి వస్తోందని మొరపెట్టుకున్నారు. బుధవారం భద్రాచలంలో ఆదివాసీలతో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు. ఆదివాసీలు తమ సమస్యలను గవర్నర్‌కు చెప్పుకున్నారు.
సీఎం పట్టించుకుంటలే: ఎమ్మెల్యే వీరయ్య
కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. తాను అసెంబ్లీలో ప్రభుత్వానికి పంచాయతీ ప్రజల సమస్యలపై నివేదించానని, సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. అయినా ఆయన పట్టించుకోవట్లేదన్నారు. 4 రాష్ట్రాల కూడలిలో ఉన్న భద్రాచలంలోని 200 పడకల దవాఖానలో డాక్టర్లే లేరన్నారు. ‘‘ప్రభుత్వం గిరిజన వైద్యాన్ని వదిలేసింది. వరదలు వచ్చినా పట్టించుకోలేదు. పోడు భూములకు ఇప్పటి దాకా పట్టాలివ్వలే. కొన్ని తెగలను గిరిజన తెగల్లో కలిపేందుకు బిల్లు తెస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలి. జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలి. గిరిజనులకు ఉద్యోగాల కోసం సబ్‌ప్లాన్ డ్రైవ్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలి” అని ఎమ్మెల్యే కోరారు.
ఐదు పంచాయతీలొస్తే భద్రాచలానికి కూడా మంచి జరుగుతుందని, రాముడి భూములు, ఉష్ణగుండాల, ఎటపాక జటాయువు గుడులు కూడా వస్తాయన్నారు. ఈశ్వరి అనే మహిళ మాట్లాడుతూ, పదేండ్లుగా కష్టాలు పడుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంది. స్పందించిన గవర్నర్..‘‘మీ సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తా. కేంద్రానికి నివేదించి పరిష్కరించడానికి కృషి చేస్తా’’ అని హామీ ఇచ్చారు. తర్వాత ఆదివాసీలతో గవర్నర్ రేలా నృత్యం చేశారు. సహపంక్తి భోజనం చేశారు. ఆదివాసీ పూజారుల సంఘం నుంచి రవితేజ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
పుట్టింటికి వచ్చినట్లుంది: గవర్నర్
ఆదివాసీలంతా తమ సమస్యలు చెప్పుకున్నాక గవర్నర్ తమిళిసై మాట్లాడారు. ‘‘భద్రాచలం ఏజెన్సీకి వస్తే నా పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. మీ (గిరిజనులు) జీవితాల్లో వెలుగులు నింపేందుకు దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని, శక్తిని ఉపయోగిస్తా. నా వంతుగా విద్య, వైద్య, ఉపాధి కోసం కృషి చేస్తా’’ అని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాలకు ఇదివరకే బైక్ అంబులెన్సులు, ఎలక్ట్రిక్ వాహనాలు అందించామన్నారు. ఆదివాసీ పిల్లల కోసం అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలు నిర్మించామని, న్యూట్రిషన్ ఫుడ్ కోసం గిరిరాజా కోళ్లు, చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందించే కార్యక్రమంలో తాను పాలు పంచుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ మీటింగ్‌లో గవర్నర్ పాల్గొన్నారు. అంతకు ముందు గవర్నర్ భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు.
రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చా
ఖమ్మం రూరల్, వెలుగు: రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజ్‌భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చానని, ప్రతి ఒక్కరూ తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా కలిసే అవకాశం కల్పించానని గవర్నర్ తమిళిసై అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో ఏర్పాటు చేసిన వై20 సదస్సులో గవర్నర్ మాట్లాడారు. తెలంగాణలో తయారైన వ్యాక్సిన్ వల్లే దేశంలో కరోనాను వేగంగా తుదముట్టించామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఫార్మా హబ్‌గా రూపుదిద్దుకుందని, మన దేశానికే కాకుండా, 150కి పైగా దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణకు దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ప్రాజెక్టులను ఆమె సందర్శించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను చూసి అభినందించారు.