సర్కార్​ ఆఫీసులే టార్గెట్​గా చోరీలు

కరీంనగర్, వెలుగు: ఇటీవల జిల్లాలో గవర్నమెంట్ ఆఫీసులే టార్గెట్ గా జరుగుతున్న వరుస చోరీలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. నిరుడు అక్టోబర్ 30న కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో ట్రాన్స్ ఫర్ పై వెళ్తున్న అప్పటి కలెక్టర్ గోపి ల్యాప్ టాప్, బ్యాగ్ చోరీకి గురవగా, తర్వాత డిసెంబర్ 24న కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో విలువైన ఫైళ్లు, పత్రాలు మాయమయ్యాయి. తాజాగా ఆదివారం ఎల్ఎండీలోని ఇరిగేషన్ ఈఈ ఆఫీసులో నాలుగు కంప్యూటర్లు, ఐదు మానిటర్లు, రెండు ప్రింటర్లు ఎత్తుకెళ్లారు. కలెక్టరేట్ క్యాంప్ ఆఫీసులో చోరీకి పాల్పడిన దొంగను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా రెండు రోజుల్లోనే పట్టుకుని సొత్తును రికవరీ చేయగా.. రిజిస్ట్రేషన్ ఆఫీసులో చోరీ చేసిందెవరనేది ఇప్పటికీ తేలలేదు. 

సంచలనం సృష్టించిన ఇరిగేషన్ ఆఫీసులో చోరీ

ఎల్ఎండీ ఇరిగేషన్ ఈఈ ఆఫీసులో ఆదివారం జరిగిన సీపీయూలు, మానిటర్లు, ప్రింటర్ల చోరీ రాష్ట్రంలో కలకలం రేపింది.  రూ.410 కోట్లతో చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనులతోపాటు కోట్లాది రూపాయలతో గతంలో చేపట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులు, ఇతర టెండర్లకు సంబంధించిన కీలకమైన ఫైళ్లన్నీ ఇదే ఆఫీసులో ఉన్నాయి. దీంతో ఆదివారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఉదయం క్లూస్ టీమ్ తో పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ ఆఫీసులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కొన్నాళ్లుగా పని చేయకపోవడం, ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు శనివారమే నీటిపారుదల శాఖ ఈఎన్సీ శంకర్ ఆధ్వర్యంలో సీఈ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఎల్ఎండీకి సంబంధించిన వివిధ పనుల వివరాలు, మానేరు రివర్ ఫ్రంట్, చెక్ డ్యామ్ లు, చెరువు పనుల వివరాలను అందించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇది జరిగిన మరుసటి రోజే ఆదివారం కంప్యూటర్లు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది.  

సిబ్బంది విచారణ.. 

కంప్యూటర్ల చోరీలో డిపార్ట్ మెంట్ ఉద్యోగుల హస్తం ఉండొచ్చనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు ఆ ఆఫీసులో పని చేసే ఉద్యోగులను ఒక్కొక్కరిగా పిలిచి మాట్లాడారు. కంప్యూటర్లలో ఎలాంటి డేటా ఉండేదని, పోయిన డేటా అంతా రికవరీ ఎలా చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. చోరీకి గురైన సీపీయూల్లోని డేటా అంతా సాఫ్ట్, హార్డ్ కాపీల రూపంలో భద్రంగా ఉందని, ఫైళ్ల మిస్సింగ్ కు చాన్స్ లేదని చెప్పినట్లు సమాచారం. కాగా, క్యాంప్ డివిజన్ సర్కిల్ –5 ఆఫీసులో జరిగిన దొంగతనంపై ఆ శాఖ ఉద్యోగులను విచారించినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ కర్ణాకర్ రావు వెల్లడించారు. కంప్యూటర్ లో ఎంట్రీ చేసిన డేటా సాఫ్ట్ కాపీ తమ వద్ద మరొకటి ఉందని, తమ ఆఫీసులో ఎలాంటి ఫైలు చోరీకి గురికాలేదని వారు చెప్పారని వెల్లడించారు. విచారణను వేగవంతం చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

15 రోజులైనా దొరకలే.. 

డిసెంబర్ 24న కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగతనం జరిగిన దృశ్యాలను సీసీ కెమెరాల ఫుటేజీలో చూడగా..అందులో ఓ వ్యక్తి రికార్డు రూమ్ లో నుంచి ఫైళ్లను బయటికి తీయడం కనిపించింది. కానీ, ఇప్పటి వరకు అతడు ఎవరో పోలీసులు గుర్తించలేకపోయారు. ఆ ఫైళ్లతో దొంగలకు అవసరం ఏముండదని, వాటిని మాయం చేసింది అదే ఆఫీసు వాళ్లు.. లేదంటే వాటితో పని ఉన్న బయటికి వ్యక్తులే అయి ఉంటారనే చర్చ అప్పట్లో జరిగింది. అన్ని రికార్డులు డిజిటలైజ్ చేశామని రిజిస్ట్రార్ ఆఫీస్ వర్గాలు చెప్తున్నప్పటికీ.. అలాంటప్పుడు ఎత్తుకెళ్లిన ఫైళ్లతో ఏం చేస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దొంగతనం జరిగి 15 రోజులైనా ఇప్పటి వరకు  నిందితులను గుర్తించకపోవడం గమనార్హం.