
వేములవాడలో శనివారం సద్దుల బతుకమ్మ సంబురాలు వైభవంగా జరిగాయి. వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఒక్కచోటకు చేరి ఆడిపాడారు. ఈ వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ జరుపుతారు. కానీ వేములవాడలో మాత్రం ఏడు రోజులకే వేడుకలు నిర్వహిస్తారు.
హాజరైన గవర్నర్ తమిళిసై
వేములవాడ, వెలుగు: సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడలో శనివారం ఘనంగా జరిగాయి. వేడుకలకు గవర్నర్ తమిళిసై హాజరై వేములవాడ మూలవాగు వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. అంతకుముందు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాగా.. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే స్వాగతం పలికారు. తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9 రోజులకు సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగితే వేములవాడ పట్టణంలో మాత్రం 7 రోజులే నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మీడియాను అడ్డుకున్న పోలీసులు
వేములవాడలో గవర్నర్ మీడియాతో మాట్లాడడానికి సిద్ధమవగా.. మీడియాతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. గవర్నర్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పలువురు మీడియా ప్రతినిధులు కిందపడిపోయారు. భక్తులు కూడా ఇబ్బందిపడ్డారు.