గవర్నర్ వ్యవస్థ - వివాదాలు

కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడల్లా రాష్ట్రాల్లో గవర్నర్లు మారుతూ ఉన్నారు. ఈ పదవి కాలపరిమితి పూర్తిగా రాష్ట్రపతి ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.  సూర్యనారాయణ వర్సెస్​ యూనియన్​ ఆఫ్ ఇండియా(1982) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఆమోదం అనేది న్యాయస్థానంలో సవాల్​ చేయరాదు. రాజ్యాంగంలో గవర్నర్ల తొలగింపునకు సంబంధించి ఎలాంటి నిబంధనలు గానీ కారణాలు గానీ పేర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం రాష్ట్రపతి ద్వారా గవర్నర్లను తొలగించగలదు. 

  • 1989లో వీపీసింగ్​ ప్రభుత్వం 17 రాష్ట్రాల గవర్నర్లను తొలగించింది. 
  • 1991లో పీవీ నర్సింహారావు ప్రభుత్వం 14 రాష్ట్రాల గవర్నర్లను ఒకేసారి తొలగించింది. 
  • 1998లో వాజ్​పేయీ ప్రభుత్వం 13 మంది గవర్నర్లను తొలగించింది. 
  • 2004లో మన్మోహన్​సింగ్​ ప్రభుత్వం 12 మంది గవర్నర్లను తొలగించింది. 

రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి గవర్నర్.  ఆయన అధికారిక నివాసాన్ని రాజ్​భవన్​ అంటారు. రాజ్​భవన్​ రాజకీయాలకు అతీతంగా స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన వ్యవస్థ. ప్రస్తుత కాలంలో రాజకీయ పునరావస కేంద్రంగా మారిందని విమర్శల నేపథ్యంలో గవర్నర్​ వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. వాస్తవానికి 1967 వరకు గవర్నర్​ వ్యవస్థపై ఎలాంటి విమర్శలు లేవు.  అప్పటి వరకు కేంద్రం, రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండేవి. 1967 తర్వాత పరిస్థితి మారింది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అధికారంలో ఉండటంతో గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే చర్యలకు కేంద్రంలోని ప్రభుత్వాలు శ్రీకారం చుట్టడంతో గవర్నర్ వ్యవస్థపై విమర్శలు బయల్దేరాయి. 
ఉదాహరణకు ఎన్​టీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కరరావు తెలుగుదేశం పార్టీలో చీలిక తీసుకువచ్చారు. ఎన్​టీ రామారావుకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా గవర్నర్​ రామ్​లాల్​ నాదెండ్ల భాస్కరరావు  చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించడం వివాదాస్పదంగా మారింది. 
1996లో గుజరాత్​లో జరిగిన సంఘటనతో గవర్నర్​ చర్యలపై విమర్శలు వచ్చాయి. గవర్నర్​ రిపోర్టును ఆధారం చేసుకొని బిహార్​లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని భర్తరఫ్​ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఈ మధ్యకాలంలోనూ గవర్నర్ల చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఉదాహరణకు పశ్చిమబెంగాల్​ గవర్నర్​, ముఖ్యమంత్రి మధ్య చాలా వివాదాలు నడుస్తున్నాయి. సహజంగా గవర్నర్​ ఆ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చాన్స్​లర్​గా వ్యవహరిస్తారు. గవర్నర్​కు ఉన్న చాన్స్​లర్​ అధికారం ముఖ్యమంత్రికే కట్టబెడుతూ పశ్చిమబెంగాల్​ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితి తమిళనాడులోనూ ఉంది. కేరళలో  గవర్నర్​ చర్యలు సైతం వివాదాస్పదమైంది. తెలంగాణలో ఏడాదికాలంగా ముఖ్యమంత్రికి గవర్నర్​కు మధ్య వివాదం కొనసాగుతోది. 

గవర్నర్​కు ప్రవర్తనా నియమావళి ఏర్పాటు చేయాలని ఏ కమిషన్​ సూచించింది? (సి)
ఎ. పూంచీ కమిషన్​ బి. రాజ్యాంగ సమీక్ష కమిషన్​ సి. సర్కారియా కమిషన్​ డి. మండల్​ కమిషన్​
రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి రాజ్యాంగంలో ఆర్టికల్​ 153 నుంచి 167 వరకు వివరించబడింది. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో గవర్నర్​, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అడ్వకేట్​ జనరల్​ ఉంటారు. ఆర్టికల్​153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్​ ఉంటాడు. 7వ రాజ్యాంగ సవరణ(1956) ప్రకారం రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒకే గవర్నర్​ను నియమించవచ్చు. ఆర్టికల్​ 155 ప్రకారం గవర్నర్లను ప్రధాన మంత్రి, మంత్రిమండలి సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నర్లను నియమించే అధికారం, హక్కు, స్వేచ్ఛ ఈ ఆర్టికల్​ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తుంది. గవర్నర్​ కేంద్ర ప్రభుత్వానికి ఆధీనుడు కాదు. ఏజెంటూ  కాదు. ఈ పదవి స్వతంత్ర రాజ్యాంగ పదవి అని 1997 సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగ ముసాయిదా పత్రంలో గవర్నర్​ను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని పేర్కొన్నారు. కానీ, రాజ్యాంగ పరిషత్​ మాత్రం అనేక రకాల కారణాల వల్ల గవర్నర్​ను రాష్ట్రపతి నియమించాలనే పద్ధతిని ఎంపిక చేసింది. 

సర్కారియా కమిషన్​ సూచనలు 

  • గవర్నర్​గా నియమితులయ్యే వ్యక్తి అదే రాష్ట్రానికి చెందినవారై ఉండకూడదు. 
  • క్రియాశీలక రాజకీయాలలో ఉన్న వారిని గవర్నర్లుగా నియమించరాదు. 
  • గవర్నర్​ నియామకంలో ముఖ్యమంత్రిని సంప్రదించాలి.

తెలంగాణలో రాజ్​భవన్​ ప్రగతి భవన్​ మధ్య సంఘర్షణ కొనసాగుతుంది. గవర్నర్ల వ్యవస్థ ఈ విధంగా తయారు కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్లను నియమించడంలో పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉండటం, ఆర్టికల్​ 164 ప్రకారం ముఖ్యమంత్రిని నియమించే అధికారం గవర్నర్​కు ఉండటం, ఆర్టికల్​ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా రిపోర్టు చేసే అధికారం గవర్నర్​ కలిగి ఉండటం.

కింది వివరణల్లో సరైంది? (సి)
ఎ. దేశంలో ఒకే కాలంలో ఒకే వ్యక్తి రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్​గా నియమించరాదు
బి. రాష్ట్ర గవర్నర్​ హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తాడు
సి. గవర్నర్​ను తొలగించడానికి రాజ్యాంగంలో ఎలాంటి ప్రక్రియ నిర్దేశించలేదు
డి. గవర్నర్​ ఐదేండ్ల పదవీకాలం పూర్తికాకుండానే అతడిని పదవి నుంచి తొలగించడానికి వీల్లేదు