వివాదంలో గవర్నర్ వ్యవస్థ ?

వివాదంలో గవర్నర్ వ్యవస్థ ?

దేశంలో గవర్నర్‌ వ్యవస్థ రోజురోజుకూ రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నది. రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లు  తమకు లేని అధికారాన్ని పాలనా వ్యవహారాల్లో చూపించాలనే అత్యుత్సాహం, మితిమీరిన రాజకీయ జోక్యంతో గవర్నర్లకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య తలెత్తుతున్న విభేదాలు వివాదాస్పదమవుతున్నాయి.  కేంద్ర, రాష్ట్ర సంబంధాల బలోపేతానికి సంధానకర్తగా వ్యవహరించాల్సిన గవర్నర్ పదవికి రాజకీయ మూలాలున్న వ్యక్తులను నియమించడం నాటి నుంచి నేటిదాకా ఒక దుస్సంప్రదాయంగా మారింది. అలా నియమించడంతో వారు తమ పూర్వాశ్రమ రాజకీయ ప్రభావాన్ని వదులుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, మంత్రిమండలి ఆమోదాలను గవర్నర్​లకున్న విచక్షణాధికారం పేరిట బిల్లులకు ఆమోదం తెలపకుండా మోకాళ్ళు అడ్డు పెడుతుండడంతో గవర్నర్ వ్యవస్థ చుట్టూ రాజకీయ వివాదం జరుగుతోంది.

ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కొందరు గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారింది.  శాసనసభ, మంత్రిమండలి ఆమోదించిన పలు కీలక బిల్లులను అక్కడి గవర్నర్లు ఆమోదించకపోవడం వివాదాస్పదం అవుతోంది. ఇటీవల తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలపకుండా నిలిపివేసి, బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడంతో తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య చెలరేగిన వివాదం రాజకీయ రంగు పులుముకుంది. గవర్నర్ ఆర్.ఎన్.రవి తనకు లేని వీటో పవర్​తో  ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన తీరుపై డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ అధికారాల పరిధిపై విచారించిన సుప్రీంకోర్టు బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే, పెండింగ్​లో ఉన్న బిల్లులను ఆమోదిస్తూ వెలువరించిన తీర్పు న్యాయవ్యవస్థ చరిత్రలో  మైలురాయి లాంటిదని చెప్పవచ్చు.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

రాజ్యాంగంలోని అధికరణ 153 ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని పేర్కొంది. అధికరణ  200 ప్రకారం శాసనసభ, మంత్రిమండలి ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లులను ఆమోదముద్ర వేయడం, ఆమోదించకపోవడం, పునః పరిశీలన కోసం తిరిగి శాసనసభకు పంపడం లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం వంటి విచక్షణా అధికారాలు కలిగి ఉంటారు. అవి కూడా రాజ్యాంగంలోని 163 (1) లో తెలిపిన నిబంధనలకు లోబడి మాత్రమే ఉన్నాయి. శాసనసభ పునఃపరిశీలన కోసం గవర్నర్ తిప్పి పంపిన తర్వాత ఆ బిల్లులను మరోసారి శాసనసభ ఆమోదిస్తే, గవర్నర్ ఆ బిల్లులను నిలిపివేసే అధికారం లేదు. కానీ, బిల్లులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అది కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని భావిస్తే మాత్రమే స్పష్టమైన కారణాలను వివరిస్తూ  రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేయవచ్చు. ఏదైనా బిల్లును రాష్ట్ర మంత్రిమండలి సలహాకు విరుద్ధంగా గవర్నర్ రాష్ట్రపతికి పంపాలనుకుంటే మూడు నెలల్లోగా 
ఆ ప్రక్రియ పూర్తిచేయాలి.

 తమిళనాడు గవర్నర్​ తీరును తప్పుపట్టిన సుప్రీం

తమిళనాడు రాష్ట్ర శాసనసభ పంపిన ప్రతి బిల్లును గవర్నర్ రిజర్వులో పెట్టారు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి బిల్లులను పంపినప్పటికీ వాటిని రాష్ట్రపతి పరిశీలనకు నివేదించడమంటే అక్కడ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం చేతుల్లో పెట్టడమే!  బిల్లుల నిలిపివేతపై గవర్నర్‌ ఆర్.ఎన్.రవి చర్యను  రాజ్యాంగ విరుద్ధమని భావించిన సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నివేదనపై రాష్ట్రపతి తీసుకునే ఎలాంటి చర్యలైనా రాజ్యాంగబద్దంగా నిలబడజాలవని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 142 అధికరణం సుప్రీంకోర్టు తనకున్న విశిష్టమైన అధికారాలను ఉపయోగించుకొని పెండింగ్ బిల్లులను గవర్నర్‌ ఆమోదం పొందినట్టుగా ప్రకటించడం గమనార్హం. రాజ్యాంగబద్ధమైన ఏ పదవి అయినా, అది ఎంత ఉన్నతమైనదైనా రాజ్యాంగం కంటే ఉన్నతమైనది కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా గవర్నర్ వ్యవస్థ తీరు మారాలి.

నాలుగు రాష్ట్రాల్లో అదే తీరు

ఇటీవలి కాలంలో  తమిళనాడుతో పాటు కేరళ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ గవర్నర్ల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ యూనివర్సిటీల వైస్ చాన్స్​లర్​ను మూకుమ్మడిగా తొలగించడం ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయ్​కు ఆగ్రహం తెప్పించింది. గవర్నర్ వర్సిటీల చాన్స్​లర్ హోదాను తొలగిస్తూ మంత్రివర్గం ఆర్డినెన్స్​ను ఆమోదించి గవర్నర్​కు పంపింది. తనను తాను చాన్సులర్ పదవి నుంచి తొలగించుకోవడం ఇష్టంలేని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ దానిని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి గతంలో ఆ రాష్ట్ర గవర్నర్​గా సేవలందించిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ మధ్య  ప్రచ్చన్న యుద్ధమే సాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ పార్టీకి చెందిన నాయకులను, అనుకూలంగా ఉన్న వ్యక్తులను గవర్నర్లుగా నియమించి రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం. 

సర్కారియా కమిషన్‌ ఏం చెప్తున్నది?

గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షకులుగా కాకుండా ఫక్తు రాజకీయ నాయకులుగా వ్యవహరించిన ప్రతిసారి సర్కారియా కమిషన్‌ చేసిన సిఫారసులు ప్రాముఖ్యతను సంతరించుకొంటున్నాయి. ఇంతకాలం గవర్నర్లు తమ అధికారాలు దుర్వినియోగం చేసిన అనేక సందర్భాల్లో సర్కారియా కమిషన్‌ సిఫార్సులను సుప్రీంకోర్టు సమర్థించింది. 

కమిషన్ చేసిన సిఫార్సు ప్రకారం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొన్నవారిని గవర్నర్లుగా నియమించరాదని స్పష్టం చేసింది, కానీ, ఆచరణలో అమలుకావడంలేదు.  గవర్నర్లకు కొన్ని విచక్షణాధికారాలు ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వినియోగించాల్సినవే! కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే గవర్నర్ల వ్యవహరిస్తున్న తీరు ఒకరకంగా,  ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలుంటే మరోరకంగా వ్యవహరించడం రాజ్యాంగవిరుద్ధం.  రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. లేదంటే గవర్నర్ వ్యవస్థనే ప్రజలు తిరస్కరించే దుస్థితి భవిష్యత్తులో తలెత్తుతుంది.

- డా. చెట్టుపల్లి మల్లికార్జున్​,  
పొలిటికల్​ ఎనలిస్ట్