గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: సీపీఐ

గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ లుగా పని చేస్తున్నారని.. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CPI ‘ఛలో కలెక్టరేట్’కి పిలుపునిచ్చింది. అందులో భాగంగా సిద్దిపేట కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకలను మోడీ ప్రభుత్వం అణిచివేస్తుందని విమర్శించారు.

వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొడుతోందని.. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయారన్నారు. ప్రతిపక్ష పార్టీల మీద ఈడీ, సీబీఐ దాడులు చేస్తూ అణిచి వేస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసి నాశనం చేస్తున్నారని వెల్లడించారు. NREGS నిధులతో కల్లాలు నిర్మిస్తే తప్పేముందని..వాళ్ళు రైతులు కాదా అని ప్రశ్నించారు. గత కొంతకాలంగా గవర్నర్ వ్యవస్థపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడించారు. రాజకీయ అజెండాలతో ప్రజా ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి గవర్నర్ వ్యవస్థ అవసరం లేదంటున్నారు.