రేపు ఓరుగల్లులో పర్యటించనున్న గవర్నర్ తమిళి సై

హన్మకొండ జిల్లా ఓరుగల్లులో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ రేపు పర్యటించనున్నారు. మహా శివరాత్రి సందర్బంగా హనుమకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తోన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలకు గవర్నర్ హాజరు కానున్నారు. అందుకోసం  ఇండస్ ఫౌండేషన్ నిర్వాహకులు హైగ్రివాచారి గ్రౌండ్ లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ శివరాత్రి మహోత్సవాలకు గవర్నర్ తమిళి సైతో పాటు అవధాని మాడుగుల నాగఫణిశర్మ, సినీ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ కూడా హాజరుకానున్నారు. ఓరుగల్లు వైభవం ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఇండస్ ఫౌండేషన్ ఛైర్మన్ రాకేష్ రెడ్డి, నరహరి వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. జాగరణ కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.